
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా రాజీవ్ కుమార్
దేశంలో 33.21 లక్షల ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్ ఆగస్టు 1న లోక్‌సభకు తెలిపారు.
ఆక్రమణలో 33 లక్షల ఎకరాల అటవీ భూమి
దేశంలో 33.21 లక్షల ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్ ఆగస్టు 1న లోక్‌సభకు తెలిపారు. గోవా, లక్షద్వీప్, పుదుచ్చేరి మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయన్నారు. తెలంగాణలో 7,551 ఎకరాలు, ఏపీలో 4,177 ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు వెల్లడించారు. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 13 లక్షల ఎకరాలు, అసోంలో 7 లక్షల ఎకరాలు ఆక్రమణకు గురైందన్నారు.
2050 నాటికి అంతరించిపోనున్న 4000 భాషలు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూడింట రెండొంతుల భాషలు అంతరించే ప్రమాదంలో ఉన్నట్లు పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా (పీఎల్‌ఎస్‌ఐ) తెలిపింది. ప్రపంచంలో మొత్తం 6000 భాషలు ఉన్నట్లు అంచనా. వాటిలో 2050 నాటికి 4000 భాషలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని భాషా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిలో 10 శాతం భారతీయ భాషలున్నాయి. అయితే ఎక్కువ సంఖ్యలో ప్రజలు మాట్లాడుతున్న హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠీ, కన్నడ, మలయాళం, గుజరాతీ, పంజాబీ భాషలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది.
ఈ–రకమ్ పోర్టల్ ప్రారంభం
రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఆన్‌లై ద్వారా విక్రయించి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 1న ఈ–రకమ్ (ఈ–రాస్ట్రీయ కిసాన్ అగ్రి మండి) పోర్టల్ ప్రారంభించింది. ఇదిæ కుగ్రామ రైతులను ప్రపంచంలోని పెద్ద మార్కెట్లకు అనుసంధానించే మొట్టమొదటి ఆన్‌లైన్ పోర్టల్.
భారత్‌లో వ్యవసాయం ప్రమాదకరం
భారతదేశంలో ప్రస్తుతం వ్యవసాయం చేయడం ప్రమాదకరంగా పరిణమించిందని అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఒక నివేదికలో పేర్కొంది. పంట ఎదిగే కాలంలో 20 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరిగే ప్రతి డిగ్రీకి 67 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆగస్టు 1న ప్రచురితమైన ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన జర్నల్‌లో వెల్లడించింది. 2050 నాటికి దేశంలో భూతాపోన్నతి మరో మూడు డిగ్రీలు పెరుగుతుందని, అప్పుడు రైతుల పరిస్థితి మరెంత దారుణంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో 130 కోట్ల జనాభా ఉండగా.. వారిలో 58 శాతం మంది రైతులు ఉన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక, పంటలు దెబ్బతిని ఏటా లక్షా 30 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
నేషనల్ హైవేల పక్కన వినోద కేంద్రాలు
జాతీయ రహదారుల పక్కన ప్రయాణికులు, డ్రైవర్ల కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక సౌకర్య కేంద్రం(వేసైడ్ ఎమినిటీ సెంటర్)ను ఏర్పాటు చేయాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆగస్టు 3న నూతన విధానాన్ని ఆవిష్కరించారు. ఈ కేంద్రాల ఏర్పాటు బాధ్యతలను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ చూడనుంది. వీటిలో కార్లు, బస్సులు, ట్రక్కుల పార్కింగ్‌కు స్థలం కేటాయిస్తారు. పెట్రోల్ బంకులు, వాహన మరమ్మతు కేంద్రాలు, విశ్రాంతి గదులు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, వ్యవసాయ, చేనేత ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. తొలి విడతలో 183 చోట్ల ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
మరణ ధ్రువీకరణ పత్రానికి ఆధార్ తప్పనిసరి
దేశవ్యాప్తంగా మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి అక్టోబర్ 1 నుంచి ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వ్యక్తుల గుర్తింపులో మోసాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం శాఖ పేర్కొంది.
అంతర్జాతీయం
ప్రపంచ బ్యాంక్‌లో పాక్‌కు ఎదురుదెబ్బ
జమ్మూకశ్మీర్‌లో భారత్ చేపట్టిన క్రిష్ణగంగ, రత్లే జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొనసాగించవచ్చని ప్రపంచ బ్యాంకు ఆగస్టు 1న పేర్కొంది. అయితే 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని అనుసరించి.. కొన్ని పరిమితులకు లోబడి ఆనకట్టల నిర్మాణాలు ఉండాలని సూచించింది. ఈ మేరకు పాకిస్థాన్, భారత్‌లకు చెందిన కార్యదర్శి స్థాయి అధికారులతో చర్చల అనంతరం ఓ ప్రకటన విడుదల చేసింది. సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్ నుంచి పాక్‌కు ప్రవహిస్తున్న పశ్చిమ నదులపై ప్రాజెక్టుల నిర్మాణానికి భారత్.. ఈ వ్యవహారంతో సంబంధం లేని వ్యక్తి లేదా సంస్థ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. సింధు నది ఉప నదులైన జీలం, చీనాబ్‌లపై భారత్ క్రిష్ణగంగ, రత్లే జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఇప్పటికే ప్రారంభించింది. దీనిపై పాకిస్థాన్ ప్రపంచ బ్యాంకును ఆశ్రయించింది.
టిబెట్ పీఠభూమిపై ఎక్స్‌ప్రెస్ హైవే
ప్రపంచంలోనే ఎత్తయిన టిబెట్ పీఠభూమిపై చైనా ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రారంభించింది. కింఘై ఫ్రావిన్స్‌లోని గాంగ్హె కౌంటీని వుషు నగరంతో కలుపుతూ దీన్ని నిర్మించారు. 634.8 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి నిర్మాణానికి చైనా వేల కోట్లను ఖర్చు చేసింది. దీన్ని సగటున 4 వేల మీటర్ల ఎత్తులో నిర్మించారు. రహదారిలో 36 శాతం పెర్మాఫ్రాస్ట్(మంచు)నేలపై ఉంటుంది. వాహనాల వల్ల ఏర్పడే ఉష్ణోగ్రత మార్పుల కారణంగా నేల కరిగిపోకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేలను స్థిరంగా ఉంచి నిర్మాణం చేపట్టారు.
2050 నాటికి 15 కోట్ల మందికి పౌష్టికాహార లోపం
వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు పెరగడం వల్ల భూతాపోన్నతి పెరగడంతోపాటు వరి, గోధుమ వంటి పంటల్లో ప్రొటీన్ వంటి పౌష్టికాహార పదార్థాలు లుప్తమవుతాయని శాస్త్రవేత్తలు ఆగస్టు 2న హెచ్చరించారు. పర్యవసానంగా 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది పౌష్టికాహార లోపానికి గురై అకాల మృత్యువాత పడతారని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
మనీలాలో ఆసియాన్–భారత్ విదేశాంగ మంత్రుల సదస్సు
15వ ఆసియాన్–భారత్ విదేశాంగ మంత్రుల సదస్సు ఆగస్టు 6న మనీలాలో ముగిసింది. భారత విదేశాంగ సహాయ మంత్రి వి.కె.సింగ్ పాల్గొన్నారు. దక్షిణ చైనా సముద్ర వ్యవహా రాలపై సదస్సు ఉమ్మడి ప్రకటన చేసింది.]
వార్తల్లోవ్యక్తులు
పాకిస్థాన్ ప్రధానిగా అబ్బాసీ
పాకిస్థాన్ 18వ ప్రధానిగా పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీ నేత షాహిద్ ఖాకన్ అబ్సాసీ ఆగస్టు 3న బాధ్యతలు స్వీకరించారు. ఆ దేశ జాతీయ అసెంబ్లీలో ఆగస్టు 1న జరిగిన ఓటింగ్‌లో ఆయనకు 221 ఓట్లు వచ్చాయి. అక్రమాస్తుల వ్యవహారంలో నవాజ్ షరీఫ్‌పై ఆ దేశ సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసిన నేపథ్యంలో అబ్బాసీ ఆపద్ధర్మ ప్రధానిగా ఎన్నికయ్యారు.
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా రాజీవ్ కుమార్
నీతి ఆయోగ్ కొత్త ఉపాధ్యక్షుడిగా ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ రాజీవ్ కుమార్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 5న ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా పదవి నుంచి వైదొలుగుతున్న దృష్ట్యా ఆయన స్థానంలో రాజీవ్ కుమార్‌ను నియమించింది. పనగారియా ఆగస్టు 31 వరకు పదవిలో కొనసాగుతారు. రాజీవ్ కుమార్ ప్రస్తుతం సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో సీనియర్ ఫెలోగా ఉన్నారు.
సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్ పీఎం భార్గవ కన్నుమూత
ప్రఖ్యాత శాస్త్రవేత్త, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) వ్యవస్థాపక డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్పమిత్ర భార్గవ (89) ఆగస్టు 1న హైదరాబాద్‌లో మరణించారు. ఆధునిక జీవశాస్త్రానికి ఆర్కిటెక్ట్‌గా ప్రశంసలందుకున్న భార్గవ.. సీసీఎంబీ డైరెక్టర్‌గా 13 ఏళ్లపాటు విశేష సేవలందించారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు 500కు పైగా వ్యాసాలు రాశారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికలో వెంకయ్య విజయం
ఎన్డీఏ అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడు భారత 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆయన ఆగస్టు 5న జరిగిన ఎన్నికలో 516 ఓట్లతో (68 శాతం) విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగిన గోపాలకృష్ణ గాంధీకి 244 ఓట్లు లభించాయి.
ప్రపంచ బ్యాంకు ఈడీగా ఐఏఎస్ అధికారిణి అపర్ణ
గుజరాత్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఎస్.అపర్ణ ప్రపంచ బ్యాంకులో కార్యనిర్వాహక సంచాలకులు(ఈడీ)గా ఆగస్టు 5న నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం గుజరాత్ సీఎంకు ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈడీ హోదాలో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకలకు ప్రపంచ బ్యాంకులో ప్రాతినిథ్యం వహిస్తారు.]
ఆర్థికం
రెపో రేటు 0.25 శాతం తగ్గింపు
రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పావు శాతం (0.25) తగ్గించింది. ఫలితంగా రెపో రేటు ఆరున్నరేళ్ల కనిష్ట స్థాయి(6 శాతాని)కి చేరింది. దీంతోపాటు రివర్స్ రెపో రేటును 0.25 శాతం తగ్గించి 5.75 శాతానికి పరిమితం చేసింది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆధ్వర్యంలోని పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఆగస్టు 2న ప్రకటన చేసింది. వీటితోపాటు మార్జినల్ స్టాడింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటును 6.25 శాతానికి తగ్గించారు. బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన 4 శాతం నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)లో ఎలాంటి మార్పు లేదు.
అవార్డులు
గోరటి, అశోక్‌తేజలకు జాలాది పురస్కారం
సినీ కవి డాక్టర్ జాలాది పేరిట ప్రదానం చేస్తున్న జాతీయ ప్రతిభా పురస్కారాలకు సుప్రసిద్ధ ప్రజాకవి గోరటి వెంకన్న, ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ ఎంపికయ్యారు.
భారత వ్యాపారవేత్తకు యూఏఈ పురస్కారం
జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను విడిపించడంలో ప్రత్యేక చొరవ చూపిన భారత వ్యాపారవేత్త ఫిరోజ్ మర్చెంట్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చెందిన ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఆయన ఇటీవల యూఏఈ ఉపప్రధాని హెచ్‌హెచ్ షేఖ్ నుంచి కమ్యూనిటీ సర్వీస్ మెడల్‌ను స్వీకరించారు.
క్రీడలు
ఉసేన్ బోల్ట్‌కు కాంస్యం
ఉసేన్ బోల్ట్ (జమైకా) తన కెరీర్ చివరి 100 మీటర్ల రేసులో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. లండన్‌లో ఆగస్టు 5న జరిగిన ఫైనల్లో 9.95 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు.
విజేందర్‌కు డబ్ల్యూబీవో టైటిల్
భారత బాక్సర్ విజేందర్‌సింగ్.. డబ్ల్యూబీవో టైటిల్‌ను గెలుచుకున్నాడు. జుల్పికర్ మైమైటియాలి(చైనా)పై విజయం సాధించాడు.