కల చెదిరినా..కాంతులీనేలా! | Summer Study Abroad | Sakshi
Sakshi News home page

కల చెదిరినా..కాంతులీనేలా!

Published Thu, Mar 30 2017 11:31 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

కల చెదిరినా..కాంతులీనేలా! - Sakshi

కల చెదిరినా..కాంతులీనేలా!

స్టడీ అబ్రాడ్‌ అనగానే గుర్తొచ్చే దేశం అమెరికా. కానీ, ఇప్పుడు అమెరికా కొత్త ప్రభుత్వం కఠిన నిబంధనల వల్ల పరిస్థితులు మారుతున్నాయి. ఫలితంగా భారతీయ యువతలో అమెరికా కల చెదిరిపోతున్న పరిస్థితి. కానీ, స్టడీ అబ్రాడ్‌  పరంగా విద్యార్థులకు భరోసా ఇచ్చే దేశాలు మరెన్నో ఉన్నాయి. ఓవైపు ఉన్నత విద్యావకాశాలు, మరోవైపు వర్క్‌పర్మిట్లతో అమెరికాకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. వాటి వివరాలు..

 సింగపూర్‌
ప్రస్తుతం ఏటా దాదాపు 35 వేల మంది విదేశీ విద్యార్థులు సింగపూర్‌లో అడుగుపెడుతుండగా.. వారిలో భారతీయులు 15 నుంచి 20 శాతం వరకూ ఉంటారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌ కోర్సుల పరంగా సింగపూర్‌ ఆకర్షణీయంగా మారుతోంది. వీసా నిబంధనల సరళత, తక్కువ ఫీజులు, కోర్సు పూర్తయ్యాక ఏడాదిపాటు పోస్ట్‌ స్టడీ వర్క్‌ పేరుతో అక్కడే పని చేసే అవకాశం, తర్వాత దాన్ని కొనసాగించుకునే వెసులుబాటు... ఇలాంటివన్నీ విదేశీ విద్యార్థులకు అనుకూల అంశాలు. సింగపూర్‌లో అకడమిక్‌ సెషన్‌ మార్చి, జూలై నెలల్లో రెండుసార్లుగా ఉంటుంది.
వివరాలకు:  www.moe.gov.sg

జర్మనీ
జర్మనీకి సంబంధించి భారతీయ విద్యార్థుల్లో అవగాహన కొంత తక్కువనే అభిప్రాయం ఉంది. ఇక్కడి ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఫీజులు నామమాత్రం. సెమిస్టర్‌కు 500 నుంచి 700 యూరోల మధ్య ఉంటాయి. ఈ దేశం ఇంజనీరింగ్‌ కోర్సులకు ప్రత్యేకంగా నిలుస్తోంది. కాలపరిమితిపై ఆంక్షలు లేకుండా పోస్ట్‌ స్టడీ వర్క్‌ వీసా సదుపాయం అందుబాటులో ఉండటం జర్మనీ ప్రత్యేకతగా చెప్పొచ్చు. దీని ప్రకారం కోర్సు పూర్తయ్యాక కూడా 18 నెలలపాటు జర్మనీలోనే ఉండి ఉద్యోగాన్వేషణ సాగించొచ్చు. ఉద్యోగం సొంతం చేసుకుంటే స్పాన్సర్‌ లెటర్‌ ఆధారంగా అక్కడే∙కొనసాగొచ్చు. ఏప్రిల్, అక్టోబర్‌ నెలల్లో అకడమిక్‌ సెషన్లు ప్రారంభమవుతాయి.
వెబ్‌సైట్‌:  www.studyin.de

జపాన్‌
జపాన్‌లో ప్రధాన కోర్సులు ఇంజనీరింగ్, సైన్స్‌. ఇక్కడి వీసా నిబంధనలు కూడా సరళీకృతంగా ఉంటున్నాయి. అంతేకాకుండా కోర్సు పూర్తయ్యాక పోస్ట్‌ స్టడీ వర్క్‌ వీసా పరంగా సానుకూల విధానం అమల్లో ఉంది. చదువు çపూర్తయ్యాక ఉద్యోగ సాధన దిశగా ఆర్నెల్లు అక్కడే నివసించే అవకాశముంది. ఆ సమయంలో ఉద్యోగం లభిస్తే స్పాన్సర్‌షిప్‌ లెటర్‌ ఆధారంగా మూడేళ్ల వ్యవధికి వర్క్‌ వీసా పొందొచ్చు. ఏటా ఏప్రిల్, అక్టోబర్‌లలో ప్రారంభమయ్యే అకడమిక్‌ సెషన్లకు కనీసం 8 నెలలు ముందుగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించడం మంచిది.
వెబ్‌సైట్‌:  www.jasso.go.jp

న్యూజిలాండ్‌
గతేడాది 30 వేల మంది విదేశీ విద్యార్థులు న్యూజిలాండ్‌లోని పలు వర్సిటీల్లో అడుగుపెట్టగా వారిలో భారత విద్యార్థుల సంఖ్య దాదాపు 5 వేలు. ముఖ్యంగా అగ్రికల్చర్, మేనేజ్‌మెంట్‌ కోర్సులకు న్యూజిలాండ్‌లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉంది. ఫీజులు కూడా తక్కువే. అన్నింటికంటే ముఖ్యంగా కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత జాబ్‌ సెర్చ్‌ వీసా ద్వారా ఏడాది పాటు అక్కడే ఉండి ఉద్యోగ వేట కొనసాగించొచ్చు. ఆ సమయంలో ఉద్యోగం సొంతం చేసుకుంటే గరిష్టంగా మూడేళ్లు అక్కడే పని చేసుకునే అవకాశముంది. ప్రతి ఏటా మార్చిలో ప్రారంభమయ్యే అకడమిక్‌ సెషన్‌ కోసం ఏడాది ముందుగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించడం మేలు.
వెబ్‌సైట్‌:  www.immigration.govt.nz

చైనా
చైనా ప్రభుత్వం విదేశీ విద్యార్థులను ఆకర్షించేలా వర్క్‌ వీసాల పరంగా సరళీకృత నిబంధనలు అమలు చేస్తోంది. అయితే చైనా విషయంలో మన విద్యార్థులు ఇంకా అంతగా ఆసక్తి చూపడం లేదు. గతేడాది గణాంకాల ప్రకారం చైనాలో మూడు లక్షల మంది విదేశీ విద్యార్థులుంటే.. వారిలో భారత విద్యార్థుల సంఖ్య కేవలం 14 వేలు. రెండేళ్ల వ్యవధి కోర్సులను పూర్తి చేసుకున్న  అభ్యర్థులు తమ అకడమిక్‌ సంబంధిత రంగాల్లో చైనా సంస్థల్లో కనిష్టంగా ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్‌ చేయొచ్చు. అలాగే వర్క్‌ వీసాల పరంగా అంతర్జాతీయ నిపుణులను ఆకర్షించే విధంగా చైనా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.
వెబ్‌సైట్‌: : www.csc.edu.cn

ఆస్ట్రేలియా
అమెరికా, యూకే తర్వాత మన విద్యార్థులకు అత్యంత ఫేవరెట్‌గా నిలుస్తున్న దేశం ఆస్ట్రేలియా. భారత్‌ నుంచి ఏటా దాదాపు 30 వేల మంది విద్యార్థులు ఆస్ట్రేలియా పయనమవుతున్నారు. హోటల్‌ మేనేజ్‌మెంట్, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ, డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సుల పరంగా నాణ్యమైన ఇన్‌స్టిట్యూట్‌లు ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఇక్కడి స్టూడెంట్‌ వీసా, పోస్ట్‌ స్టడీ వర్క్‌ వీసా నిబంధనలు సరళీకృతంగా ఉండటం మన విద్యార్థులకు కలిసొచ్చే అంశం. పోస్ట్‌ స్టడీ వర్క్‌ వీసా పరంగా టెంపరరీ గ్రాడ్యుయేట్‌ వర్క్‌ స్ట్రీమ్, పోస్ట్‌ స్టడీ వర్క్‌ స్ట్రీమ్‌ వీసా విధానం అమలవుతోంది. కనీసం రెండేళ్ల వ్యవధి కలిగిన కోర్సులను అభ్యసించి ఉద్యోగం సొంతం చేసుకున్న విద్యార్థులకు టెంపరరీ గ్రాడ్యుయేట్‌ వర్క్‌ స్ట్రీమ్‌ విధానంలో తొలుత ఏడాదిన్నరపాటు అక్కడ పని చేసే వీలుంది.

పోస్ట్‌ స్టడీ వర్క్‌ స్ట్రీమ్‌ విధానంలో.. అభ్యర్థులు కనిష్టంగా రెండేళ్లు, గరిష్టంగా నాలుగేళ్లు ఆస్ట్రేలియాలోనే పనిచేసే అవకాశముంది. ఇటీవలి కాలంలో స్టూడెంట్‌ వీసా నిబంధనలు సడలించడం, పలు క్లాస్‌లుగా ఉండే వీసా దరఖాస్తులను ఒకే క్లాస్‌ కిందికి తీసుకురావడం కూడా స్టూడెంట్‌ వీసా పరంగా కలిసొచ్చే అంశం. ఏటా జూన్‌/జూలై, ఫిబ్రవరి/మార్చిల్లో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. కొన్ని యూనివర్సిటీలు నవంబర్‌/డిసెంబర్‌లలోనూ అకడమిక్‌ సెషన్స్‌ ప్రారంభిస్తాయి.
వెబ్‌సైట్‌:  www.border.gov.au

కెనడా
రీసెర్చ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులకు కేరాఫ్‌ అయిన కెనడాలో  విద్యాభ్యాసం పూర్తి చేసుకొని వర్క్‌ పర్మిట్‌ పొందడం ద్వారా భవిష్యత్తులో అమెరికాలో అడుగుపెట్టే అవకాశాలు కూడా సొంతం చేసుకోవచ్చనే భావన నెలకొంది. గణాంకాల ప్రకారం ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది విదేశీ విద్యార్థులు కెనడాలోని యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇక్కడ రెండేళ్ల వ్యవధి కోర్సులు పూర్తి చేసుకున్న తర్వాత వర్క్‌ పర్మిట్‌ పొందడం చాలా సులభం. కనీసం 8 నెలలు లేదా అంతకంటే ఎక్కువ వ్యవధి కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆ కోర్సు వ్యవధికి సమానంగా ఉండే కాలపరిమితితో పోస్ట్‌ స్టడీ వర్క్‌ పర్మిట్‌ మంజూరు చేస్తారు. కోర్సు వ్యవధి రెండేళ్లకు మించితే పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ వర్క్‌ పర్మిట్‌ ప్రోగ్రామ్‌ పేరుతో గరిష్టంగా మూడేళ్ల కాలపరిమితితో ఉండే వర్క్‌ పర్మిట్‌ను జారీచేసే విధానం ఉంది.  
వెబ్‌సైట్‌: www.cic.gc.ca


యూకే
ఏటా లక్షకుపైగా విదేశీ విద్యార్థులు యూకేలో అడుగుపెడుతున్నారు. వీరిలో భారత విద్యార్థుల సంఖ్య 20 శాతం వరకు ఉంటోంది. పోస్ట్‌ స్టడీ వర్క్‌ వీసా అవకాశాల పరంగా రెండు విధానాలు ఇక్కడ అమల్లో ఉన్నాయి. వాటిలో.. టైర్‌–5 గవర్నమెంట్‌ ఆథరైజ్డ్‌ ఎక్సే్ఛంజ్‌ స్కీమ్‌ ప్రకారం– కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత తమ అకడమిక్‌ సబ్జెక్ట్‌కు సంబంధించిన రంగంలో అక్కడే ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు అనుమతి లభిస్తుంది. టైర్‌–4 విధానంలో డిగ్రీ, ఆపై స్థాయి కోర్సులు పూర్తయ్యాక నాలుగు నెలలపాటు అక్కడే ఉండి ఉద్యోగ సాధనకు కృషి చేయొచ్చు. ఉద్యోగం సొంతం చేసుకుంటే గరిష్టంగా ఐదేళ్లు అక్కడే నివసించొచ్చు. ఏటా జనవరి, సెప్టెంబర్‌లలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.
వెబ్‌సైట్‌: www.gov.uk

మలేసియా
గతేడాది మలేసియాలోS విదేశీ విద్యార్థుల సంఖ్య లక్షన్నర వరకు ఉంది. ఏడాదిన్నర వ్యవధి ఉండే మాస్టర్‌ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కేటగిరీ–1, 2, 3 పేరుతో మూడు రకాల పోస్ట్‌ స్టడీ వర్క్‌ పర్మిట్లు అందుబాటులో ఉంటాయి. కేటగిరీ–1 విధానంలో నెలకు కనిష్టంగా 5 వేల రింగిట్స్‌ జీతం పొందే వారికి ఐదేళ్ల కాలపరిమితి ఉండే ఎంప్లాయ్‌మెంట్‌ పాస్‌ సొంతమవుతుంది. నెలకు 5 వేల లోపు రింగిట్స్‌ వేతనంతో రెండేళ్ల కాంట్రాక్ట్‌ ఉద్యోగం పొందిన వారికి కేటగిరీ–2 విధానంలో; ఉద్యోగ కాల పరిమితి ఏడాది లోపు, వేతనం 2,500–4,999 రింగిట్స్‌ మధ్యలో ఉంటే.. కేటగిరీ–3 విధానంలో ఎంప్లాయ్‌మెంట్‌ పాస్‌లు మంజూరవుతాయి.
వెబ్‌సైట్‌: educationmalaysia.gov.my


నెదర్లాండ్స్‌
కోర్సులు ఆయా సబ్జెక్ట్‌లను బట్టి  కనిష్టంగా ఏడాది, గరిష్టంగా రెండేళ్ల వ్యవధిలో ఉంటాయి. వీటిని పూర్తిచేసిన వారికి పోస్ట్‌ స్టడీ వర్క్‌ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కోర్సుల అనంతరం ఉద్యోగ సాధన పరంగా ఏడాది పాటు అక్కడే నివసించే వెసులుబాటు ఉంది. ఆ సమయంలో ఉద్యోగం సొంతం చేసుకుంటే తొలుత మూడేళ్లపాటు నివసించే విధంగా వర్క్‌ పర్మిట్‌ లభిస్తుంది.
వెబ్‌సైట్‌: www.studyinholland.nl
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement