నృత్య రీతులు నేర్పించే.. కొరియోగ్రాఫర్ | We can build up Career with Cinema Choreography | Sakshi

నృత్య రీతులు నేర్పించే.. కొరియోగ్రాఫర్

Published Mon, Jul 21 2014 11:56 PM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM

నృత్య రీతులు నేర్పించే.. కొరియోగ్రాఫర్

నృత్య రీతులు నేర్పించే.. కొరియోగ్రాఫర్

అప్‌కమింగ్ కెరీర్: మనిషి జీవితంలో ఒక భాగం.. నృత్యం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో కాలు కదిపినవారే. మంచి సంగీతం వినిపించినప్పుడు తెలియకుండానే కాళ్లు, చేతులు ఆడిస్తాం. ఇది కూడా ఒకరకంగా నృత్యమే. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కెరీర్.. నాట్యాచార్యుడు(కొరియోగ్రాఫర్). నృత్యం నేర్పించేవారికి ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. డ్యాన్స్‌పై జనంలో అవగాహన పెరిగింది. దీన్ని ఒక కళగానే కాకుండా మానసిక, శారీరక సామర్థ్యాన్ని, ఆలోచనా శక్తిని పెంచే సాధనంగా చూస్తున్నారు. ఫిట్‌నెస్ సెంటర్లలోనూ డ్యాన్స్ ప్రవేశించింది. నగరాలు, పట్టణాల్లో ఎన్నో డ్యాన్స్ స్కూళ్లు వెలిశాయి. ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్‌తోపాటు వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకొనేందుకు పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. విదేశాల్లోనూ కూచిపూడి, కథక్, భరతనాట్యం వంటి భారతీయ సంప్రదాయ నృత్యాలకు మంచి ఆదరణ ఉంది.  
 
  సినిమాలు, టీవీ సీరియళ్లు, అడ్వర్‌టైజ్‌మెంట్లు, రియాలిటీ టీవీ షోలు,  సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్య రీతులను సమకూర్చే కొరియోగ్రాఫర్లకు భారీ డిమాండ్ ఉంది. పాఠశాలల్లో చిన్నారులకు నృత్యం నేర్పించేందుకు కొరియోగ్రాఫర్లను నియమిస్తున్నారు. డ్యాన్స్ ట్రూప్‌ను ఏర్పాటు చేసుకుంటే మంచి ఆదాయం ఆర్జించొచ్చు.
 నాట్యంలో కనీసం 15 ఏళ్లు సాధన చేసిన తర్వాత కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ఆరంభించాలని ఈ రంగంలోని ప్రముఖ కళాకారులు సూచిస్తున్నారు. నాట్యాచార్యుడిగా పేరు తెచ్చుకోవాలంటే ప్రతిరోజూ కఠోరమైన సాధన చేయాలి. ఇందుకు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. ఇతరులను అనుకరించకుండా డ్యాన్స్‌లో తమదైన ముద్ర వేయాలంటే సృజనాత్మకత ప్రదర్శించాలి. కొత్త నృత్య రీతులను సృష్టించడానికి ప్రయోగాలు చేస్తుండాలి.  
 అర్హతలు: నృత్యం నేర్చుకోవడానికి ప్రత్యేకంగా విద్యార్హతలంటూ లేవు. డ్యాన్స్‌పై సహజమైన ఆసక్తి, అభిరుచి ఉన్నవారు ఇందులోకి ప్రవేశించొచ్చు. కొరియోగ్రఫీని ఫుల్‌టైమ్ ప్రొఫెషన్‌గా స్వీకరించాలనుకొనేవారు ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత డ్యాన్స్ స్కూల్‌లో చేరితే మంచిది. వేరే కోర్సులు చదువుతూ ఖాళీ సమయాల్లో పార్ట్‌టైమ్‌గా కూడా డ్యాన్స్ నేర్చుకోవచ్చు.
 వేతనాలు:  కొరియోగ్రాఫర్లకు ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో ఆకర్షణీయమైన ఆదాయం లభిస్తోంది. ఫ్రెషర్లకు నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా వేతనం అందుతుంది. కొంత అనుభవం ఉన్న కొరియోగ్రాఫర్లు నెలకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు సంపాదించుకోవచ్చు.
 
 డ్యాన్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
 1.    పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ
     వెబ్‌సైట్: http://teluguuniversity.ac.in/
 2.    వాసవి కాలేజీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్-హైదరాబాద్
     వెబ్‌సైట్: www.vcmdhyd.ac.in/
 3.    కూచిపూడి ఆర్ట్ అకాడమీ
     వెబ్‌సైట్: www.kuchipudi.com/
 4.    షియామక్ దావర్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద పెర్ఫార్మింగ్ ఆర్ట్స్
 వెబ్‌సైట్: www.shiamak.com
 
 కొరియోగ్రఫీతో  కెరీర్ గ్రోత్

 ‘‘ఆనందం.. ఆహ్లాదం.. ఆరోగ్యాన్ని ఇచ్చేది డ్యాన్స్ ఒక్కటే. అందుకే కేజీ పిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం కొరియోగ్రఫీకి క్రేజ్ పెరుగుతోంది. సినిమాలు, టీవీ ఛానళ్లు, డ్యాన్స్ కాంపిటీషన్‌‌స దీనికి మరింత హోదాను తెచ్చిపెడుతున్నాయి. కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ను ఉన్నతంగా మలచుకునేందుకు బోలెడన్ని మార్గాలున్నాయి. ఆసక్తికి క్రియేటివిటీ తోడైతే కెరీర్ గ్రోత్ సాధ్యం. మంచి వేతనాన్ని, సంతృప్తినిచ్చే కెరీర్.. కొరియోగ్రఫీ’’
 - శేఖర్ మాస్టర్,
 ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement