
మోడీ నాయకత్వం బాగుందన్న నాగ్
నటుడు నాగార్జున బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. పవన్ కల్యాణ్ నరేంద్ర మోడీని కలుసుకున్న కొద్ది రోజులకే నాగార్జున మోడీని అహ్మదాబాద్ లో కలుసుకోవడంతో ఈ సమావేశం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే ఒక వైపు నరేంద్ర మోడీని పొగుడుతూనే, తాను రాజకీయాలకు దూరమని నాగార్జున స్పష్టం చేశారు. 'నేను లేదా నా భార్య అమల పోటీ చేయడం లేదు. నాకు క్రియాశీలక రాజకీయాలు వద్దు. మేము సీటు గురించి మాట్లాడలేదు,' అని ఆయన అన్నారు.
'నరేంద్ర మోడీ చాలా ప్రేరణనిచ్చే నాయకుడు. ఆయన నాయకత్వం చాలా బాగుంది. ఆయన ఆలోచనా విధానం నాకు నచ్చింది. నేను ఒక గ్రామానికి వెళ్లి స్వయంగా అక్కడి అభివృద్ధిని చూశాను. ఆ గ్రామంలో వై ఫై వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.' అని నాగార్జున చెప్పారు. అయితే 'మార్పు మంచిదే' అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
ఒక వైపు తెలుగుదేశంలో పొత్తు ఇప్పటి వరకూ ఖరారు కాకపోయినా, బిజెపికి రాష్ట్రంలో పెద్దగా పట్టు లేకపోయినా ఒక వారం వ్యవధిలో నరేంద్ర మోడీని ఇద్దరు పాపులర్ తెలుగు నటులు కలవడం విశేషం.