పల్నాడును ప్రత్యేక జిల్లా చేస్తా..
పల్నాడు ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా చేసేందుకు కృషి చేస్తానని నరసరావుపేట పార్లమెంటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి చెప్పారు. వెనుకబడిన పల్నాడు ప్రాంతానికి స్పెషల్ ప్యాకేజీలు తీసుకొచ్చి అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. ఆదివారం ఉదయం ఆయన సాక్షి ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయాలు ఆయన మాటల్లోనే..
- సాక్షి, గుంటూరు
పొత్తులు చిత్తు చేస్తాం..
టీడీపీ ఒంటరిగా పోటీచేయలేక బీజేపీతో పొత్తుపెట్టుకుంది. ఆ రెండు పార్టీలే కాదు ఎంతమంది పొత్తుపెట్టుకున్నా.. మా కొచ్చిన భయమేమీ లేదు. ప్రజలకు మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడిపై నమ్మకం, గౌరవంపై ఉన్నాయి. 2004లో మహా కూటమిగా ఏర్పడి ఎన్నికల్లోకి వచ్చినా వైఎస్సార్ ఒక్కరే ఒంటిచేత్తో పార్టీని అధికారంలోకి తీసుకు రాగలిగారు. ఇప్పుడుకూడా సమర్ధుడైన జగన్ నాయకత్వంలో ముందుకుసాగుతున్నాం. ఎన్ని కూటములు వచ్చినా వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనే ధైర్యం ఎవరికీ లేదు. మా పార్టీకి అధికారంలోకి రావాడం ఖాయం.. జగన్ సీఎం కావడం ఖాయం. నేను.. నాతోపాటు నా పార్లమెంటు పరిధిలోని ఏడుగురు శాసనసభ్యులు అత్యధిగ మెజార్టీతో గెలవబోతున్నాం.
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం..
ఎంపీగా గెలుపొందాక పార్టీ అందించే సంక్షేమ కార్యక్రమాలు కాకుండా ప్రతి నియోజకవర్గంలో సర్వే చేయించి మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తా. ప్రభుత్వం నుంచి ఏం చేయాలి, స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఏం చేయాలనేది ఆలోచించి అభివృద్ధి చేస్తా. వృత్తి నైపుణ్యం, వ్యవసాయ ఉత్పత్తులు పెంచడం, పాడిపరిశ్రమ అభివృద్ధిపై ముఖ్యంగా దృష్టి సారిస్తా.
అనవసర విమర్శలు మా నైజం కాదు..
రాజకీయ పార్టీల అభ్యర్థులు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. మేము మాత్రం పార్టీపరంగా, వ్యక్తిగతంగా ప్రజలకు గట్టి భరోసా ఇస్తూ మేం ఏం చేస్తామనేది చెప్తూ ముందుకెళుతున్నాం. వైఎస్సార్ పథకాలు ప్రజల్లోకి తీసుకెళుతున్నాం. దీంతో ప్రజలకు ఎవరు మంచి చేస్తారో అర్ధమవుతోంది. అవసరమైన చోట ప్రతిపక్షాల తప్పుడు విధానాలను ప్రజలకు తెలియపరుస్తూనే ఉన్నాం. అంతేకాని అనవసరంగా ఏది పడితే అది విమర్శించడం మా నైజం కాదు.
ఫౌండేషన్ ద్వారానూ సేవ..
ప్రచారంలో ఎన్నో సమస్యలు నా దృష్టికి వస్తున్నాయి. గ్రామాల్లో జీవన ప్రమాణాలు మౌలిక వసతులు, ఆదాయ వనరులు బాగా తక్కువగా ఉన్నాయి. వీటన్నింటిని రెట్టింపు చేయాల్సిన అవసరం ఉంది. నా పార్లమెంటు పరిధిలో 28 మండలాలు, 750 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామం నుంచి కనీసం ఒక్కరిని జాతీయ స్థాయిలో ఉన్నతస్థానంలో కూర్చొబెట్టాలనేదే నా ఆలోచన. అతని ద్వారా ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. ప్రతి గ్రామానికి ఓ ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వపరంగా కుదరకపోతే మా ఫౌండేషన్ ద్వారా వాటిని పూర్తి చేసే ఏర్పాటు చేస్తా.
టీడీపీని ప్రజలు విశ్వసించ రు..
టీడీపీ నేతలు నోటికొచ్చిన వాగ్దానాలు చేస్తున్నారు, వీటిని విశ్వసించరు. వైఎస్ చెప్పినవి, చెప్పనవి కూడా చాలా చేశారు. కనుక ఆయన అంటే ప్రజల్లో విశ్వాసం ఉంది. చంద్రబాబు తొమ్మిదేళ్ల హయాంలో చెప్పిన ఏ ఒక్కటి చేయలేదు. కాబట్టే ఆయన ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. రాయపాటి చెప్పే మాటలు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు.