సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మాజీ మంత్రి సునీతారెడ్డి సీటుకు సీపీఐ ఎసరు పెట్టింది. ఆమె సొంత నియోజకవర్గమైన నర్సాపూర్‌ను పొత్తులో భాగంగా ఈసారి తమకు ఇవ్వాలని సీపీఐ కోరింది. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర సమితి ప్రతిపాదించగా.. కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సునీతారెడ్డి తన స్థానాన్ని త్యాగం చేయాల్సి వస్తున్నందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ అధిష్టానం మెదక్ పార్లమెంటు స్థానాన్ని ఆఫర్ చేయగా.. ఆమె నిరాకరించినట్లు ఢిల్లీ నుంచి అందిన సమాచారం ద్వారా తెలుస్తోంది.
పొత్తులపై స్పష్టత...
కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తులపై ఒక స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఈ రెండు పార్టీల రాష్ట్ర నేతల మధ్య సోమవారం జరిగిన పొత్తులు, సీట్ల సర్దుబాటు చర్చలు అర్థవంతంగానే ముగిసినట్లు తెలిసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును గట్టిగా సమర్థించిన ఈ రెండు జాతీయ పార్టీల మధ్య మొదటి నుంచి భావసారూప్యత ఉంది. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) వీరికి ఉమ్మడి శత్రువు. రెండు పార్టీలు జత కట్టడం ద్వారా తెలంగాణ సానుకూల ఓటును ఒడిసి పట్టుకోవచ్చని నాయకుల భావన.
సీట్ల పంపకాలలో పెద్దగా పేచీలు లేవని, పొత్తు దాదాపు ఖాయమని, ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. సీపీఐ 22 అసెంబ్లీ స్థానాలను, రెండు పార్లమెంటు సీట్లను కోరగా... కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అంతకుముందు టీఆర్‌ఎస్ పార్టీ పొత్తుల కమిటీతో నారాయణ బృందం చర్చలు జరిపినప్పటికీ ఆ చర్చలు కొలిక్కి రానట్లు తెలిసింది. నర్సాపూర్ నియోజకవర్గం మొదటి నుంచి సీపీఐ పార్టీకి మంచి పట్టుంది. ఇక్కడ ఆ పార్టీ నుంచి చిలుముల విఠల్‌రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సునీతా లక్ష్మారెడ్డి ఇప్పటివరకు వరుసగా గెలుస్తూ వచ్చారు. 1999, 2004లో రెండు సార్లు విఠల్‌రెడ్డి మీద, 2009 ఆయన కుమారుడు కిషన్‌రెడ్డి మీద సునీతారెడ్డి విజయం సాధించారు.
ఈసారి కూడా ఆమె గెలుపు ధీమాతోనే ఉన్నారు. కాగా నర్సాపూర్ సీటు తమకే ఇవ్వాలని సీపీఐ కోరటంతో కాంగ్రెస్ పార్టీ సునీతారెడ్డిని ఒప్పించే పనిలో పడ్డట్టు తెలిసింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఆమెతో మాట్లాడినట్లు తెలిసింది. మెదక్ పార్లమెంటు నుంచి పోటీచేయాలని ఆయన సూచించగా... సునీతారెడ్డి నిరాకరించినట్లు తెలిసింది. పటాన్‌చెరు సీటు కూడా అడగాలని సీపీఐ జిల్లా నాయకత్వం కోరినప్పటికీ రాష్ట్ర నాయకులు అంతగా ఆసక్తి చూపనట్లు సమాచారం. పార్టీకి బలం లేని చోట సీటు కోరి ఓడిపోవడం ఎందుకని రాష్ట్ర నాయకులు అన్నట్లు సమాచారం.
ఆత్మరక్షణలో సునీతారెడ్డి..
సొంత నియోజకవర్గం పొత్తుల పాలు కావడంతో సునీతారెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. ఒకవేళ సీటు తనకు దక్కకపోతే భవిష్యత్తు కార్యాచరణను కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. తమ పార్టీలోకి రావాలని ఇప్పటికే ఆమెకు టీఆర్‌ఎస్ ఆహ్వానం పంపినట్టు వార్తలు వచ్చిన విషయం విదితమే. ఆమె కూడా పార్టీ మారుతున్నట్లు మొదట్లో ప్రచారం జరిగింది. అయితే సునీతారెడ్డి మాత్రం మీడియా ముందుకు వచ్చి తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. ఇంతలోనే అనూహ్యంగా సీపీఐతో పొత్తులు తెరమీదకు రావడం, వాళ్లు నర్సాపూర్ కోసమే పట్టుబట్టడంతో మళ్లీ ఆమె ఆత్మరక్షణలో పడ్డారు.
పొత్తు.. సీటు చిత్తు!
Published Mon, Mar 24 2014 11:45 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement