
గెలుపు మాదే!
తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా ఈ ఎన్నికల్లో అంతిమ విజయం మాదే.... ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు
తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా ఈ ఎన్నికల్లో అంతిమ విజయం మాదే.... ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు. ఆయన మూడు దశాబ్దాలు ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తారు.... ఇవి ఆళ్లగడ్డ ైవె ఎస్సార్‌సీపీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి మరణానికి ముందు ‘సాక్షి’ టీవీ చానల్‌తో చెప్పిన మాటలు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడానికి కొంచెం ముందు ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది.
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ప్రచారం ఏ విధంగా సాగుతోంది?
ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. రాష్ట్రం మొత్తం వైఎస్సార్‌సీపీ వెంటే ఉంది. పార్టీ కార్యకర్తలు, అభ్యర్థుల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. అదే వాతావరణం ఆళ్లగడ్డలోనూ ఉంది. అంతా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. జగన్ చెబుతున్న సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం.
గతంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు భారీ మెజారిటీ వచ్చింది. రెండోసారీ వైఎస్సార్‌సీపీ తరఫున మీరు పోటీకి దిగుతున్నారు. ఎండనక, వాననక ప్రచారంలో ఉన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యల్ని మీకు చెబుతున్నారు?
2009లో ఎన్నికలైన కొన్నాళ్లకే వైఎస్ మృతి చెందారు. దీంతో రాష్ట్ర పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న మాదిరిగా పరిస్థితి తయారయ్యింది. ఆయన ఉన్నప్పుడు ప్రజలు దేనికీ ఇబ్బంది పడలేదు. పింఛన్లు, రేషన్‌కార్డుల సమస్యలుండేవి కాదు. అదో నిరంతర ప్రక్రియలా కార్డులు జారీ చేసేవారు. ఈ నాలుగేళ్లలో అభివృద్ధి ఆగిపోయింది. పక్కా ఇళ్లు, పింఛన్లు ప్రజలకు అందడం లేదు. కరెంట్ చార్జీలు, కోతలు పెరిగిపోయాయి. పంటలకు ధర రావడం లేదు. పేదల సమస్యలు మరింత పెరిగిపోయాయి. ఇక గ్రామాల్లో ఇబ్బందుల గురించి చెప్పాలంటే ఎంత సమయమైనా చాలదు. ఏ గ్రామానికి వెళ్లినా వారు ఇదే విషయాన్ని చెబుతున్నారు. మేం ఒకటే చెప్పదలచుకున్నాం. నెల రోజులు ఓపిక పట్టండి అని. జగన్ సీఎం అవుతారు. ఐదు సంతకాలతో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. ఆ సమస్యలన్నీ పరిష్కారం కాగలిగినవే. ప్రజలకు న్యాయం జరుగుతుంది. మేం వివరిస్తున్న విషయం అదే.
ప్రజా ప్రతినిధిగా ఉన్నారు, అయినా ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు. అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎందుకు? వైఎస్సార్‌సీపీకి మద్దతిస్తున్నందుకా? పథకాలు అందకుండా చేస్తున్నారా? అసలే ం జరుగుతోంది?
వైఎస్. రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత జగన్‌తోనూ, ఆయన కుటుంబసభ్యులతోనూ మేం కలిసి ఉన్నాం. ఆ కుటుంబంతో కలిసి ఉన్న ప్రతి సిటింగ్ ఎమ్మెల్యేకీ ఏ పనీ జరగకుండా చూస్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఆళ్లగడ్డకు వచ్చి చెప్పారు. ప్రజలు శోభానాగిరెడ్డికి ఓటేస్తే ఆళ్లగడ్డలో ఏ పనీ జరగదు అని.. ఒక సీఎం స్థాయి వ్యక్తి కక్ష కట్టి మా మీద పడితే ఏం చేస్తాం? మేం ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు దీనిని శత్రువుల నియోజకవర్గంలా చూస్తున్నారు. ప్రభుత్వం మామీద కక్ష కట్టడం వల్లనే ఏమీ చేయలేకపోతున్నామని, ఈ పరిస్థితి ఎంతో కాలం సాగదనీ ప్రజలకు వివరిస్తున్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. గతంలో నా నియోజకవర్గ ప్రజలు నాకు 37 వేల మెజారిటీ ఇచ్చి గెలిపించారు. సాక్షాత్తూ కిరణ్‌కుమార్ చెప్పినా వినలేదు. అభివృద్ధి కోరుకున్నారు. తమ ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి నడిస్తే అదే చాలంటున్నారు. అదే మెసేజ్‌ను ఓటు ద్వారా ఇచ్చారు. మేం జగన్ కుటుంబంతో ఉన్నామంటే మా ప్రజలు కూడా దానికి కట్టుబడి ఉన్నట్టే.
మీరో సీనియర్ పొలిటీషియన్. చాలా ఎన్నికలు చూశారు. వాటిని 2014 ఎన్నికలతో ఏ విధంగా పోలుస్తారు?
నేను ఐదోసారి పోటీలో ఉన్నా. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ఉప ఎన్నికల్లో చూపిన ఉత్సాహమే ప్రజలు ఇప్పుడూ చూపిస్తున్నారు. పోటా పోటీగా ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు పార్టీల మధ్య ఫైట్ జరుగుతోంది. జగన్‌కు ఓటేయాలన్న ఉత్సాహం ప్రజల్లో కనిపిస్తోంది. ఇప్పుడూ చూస్తున్నా. ప్రజలు మా వైపే ఉన్నారు.
మిమ్మల్ని నిరోధించాలని కాంగ్రెస్, టీడీపీలు చేసే ప్రయత్నాలకు మీరెలా స్పందిస్తున్నారు? ఆ అంశం మీ ప్రచారంలో ఎలా ఉపయోగపడుతోంది?
అది వాస్తవమే. నాపై పోటీ చేసే అభ్యర్థులతో ఆ రెండు పార్టీల వాళ్లు కాంప్రమైజ్ అవుతున్నారు. అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరుగుతోంది. వ్యక్తులు కలిస్తే ఏ మవుతుంది? ప్రజలు తమ అభిప్రాయాల్ని మార్చుకోలేరు. వాళ్లు డిసైడ్ అయిపోయారు. జగన్ సీఎం అవుతారని నమ్మకం ఉంది. బీజేపీ-టీడీపీ పొత్తును ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మోడీని తిట్టిన చంద్రబాబు.. హైదరాబాద్‌లో ఆయన్ను అడుగుపెట్టనీయబోమని ప్రకటించిన బాబును ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం, మైనార్టీలకు బాబు క్షమాపణలు చెప్పారు. ఇవన్నీ తెలిసినా మళ్లీ యూ టర్న్ తీసుకుని వాళ్లతోనే జత కట్టారు. ప్రజల్ని బాబు కాంప్రమైజ్ చేయలేరు.
ఇన్ని కుయుక్తుల మధ్య మీరు ఎలా ఎన్నికల్లోకి వెళ్తున్నారు. మీ హామీలేంటి?
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నేను ఒకటే అడుగుతా. పులివెందులలా ఆళ్లగడ్డనూ అభివృద్ధి చేయమని. అంతకుమించి నేను ఏదీ కోరను. ప్రజలకూ అదే చెబుతాను. మనం ఇన్నాళ్లూ జగన్‌కు అండగా ఉన్నాం కాబట్టి, జగన్ కూడా మనకు అండగా ఉంటారని చెబుతున్నా. ఐదేళ్లుగా ఆళ్లగడ్డ అభివృద్ధిలో వెనకబడిపోయింది. ఆ ఐదేళ్ల అభివృద్ధినీ ఒక్క సంవత్సరంలోనే చేసి చూపిస్తా.
ప్రజల సమస్యలకు మీ వద్ద ఎలాంటి పరిష్కారం ఉంది?
రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, సిమెంట్ రోడ్లు.. ఇలా అన్ని సమస్యల్ని పరిష్కరిస్తాం. ఐదు సంతకాలతో జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. నిధులు తెచ్చుకుంటే చాలు. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థా మెరుగుపడుతుంది.
వైఎస్సార్‌సీపీ పట్ల ప్రజల ఆదరణ ఎలా ఉంది?
ఉప ఎన్నికల్లాగానే ప్రజలు డిసైడయిపోయారు. వైఎస్సార్ కొడుకుగా జగన్ అన్నీ చేస్తారు. సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తారు. అందుకే మనం కృతజ్ఞతలు చూపించాలి. ఒకసారి అవకాశం ఇస్తే జగన్.. ఇక మరెవ్వరికీ అవకాశం ఇవ్వరు. 30 యేళ్లపాటు జగన్ నిరాటంకంగా రాష్ట్రాన్ని పాలిస్తారు.