కేజ్రీవాల్ - నాలుగు నెలల్లో హీరో నుంచి జీరోకి
ఏడాది క్రితం ఆయన ఉద్యమ వీరుడు. అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు. మూడు నెలల క్రితం ఆయన దేశానికి 'దిల్' లాంటి ఢిల్లీకి ముఖ్యమంత్రి. మే 16 నాడు ఆయన హీరో నుంచి జీరోగా మారిపోయాడు. అదీ అరవింద్ కేజ్రీవాల్ పతనం దిశగా ప్రస్థాన గాథ.
ఆయన అవినీతి వ్యతిరేక పోరాటం భారీ హవాతో మొదలైంది. ఆయన ఉన్నట్టుండి హీరో అయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేసి, తెల్లటోపీతో ముందుకు వచ్చినప్పుడు ఢిల్లీ ఉత్సాహంతో ఊగిపోయింది. ఆయన ఏకంగా మూడుసార్లు ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పై పోటీకి దిగారు. దిగి గెలిచారు. దీంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనపై ప్రజలకు ఎన్నో ఆశలు పెరిగాయి. అవినీతి, నేరపూరిత రాజకీయాలతో విసిగి వేసారిన ప్రజలు ఆయన నుంచి ఎంతో ఆశించారు. ఆయన నిక్కచ్చి వ్యవహారం, ముక్కుసూటి తీరు ప్రజలను ఆకట్టుకుంది. అరవింద్ కేజ్రీవాల్ అంటే సాధారణ పార్టీలన్నీ గజగజలాడే పరిస్థితి వచ్చింది.
అయితే 49 రోజుల్లోనే రాజకీయాలంటే ధర్నాలు, దీక్షలు కావన్నది ఆయనకు అర్థం అయిపోయింది. ఆయన ప్రతి చర్యను మీడియా ఈకలు, తోకలు పీకి మరీ పరీక్షించడం ఆయనకు తలనొప్పిగా మారింది.
చివరికి ఆయన అధికార నివాసం, అధికారిక వాహనం కూడా కూడా వివాదమయ్యాయి. ఆయన రాజీనామా చేశారు. అదే ఆయన చేసిన తప్పు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో ఆయనపై ప్రజల నమ్మకం సడలింది. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఆయన లోకసభ ఎన్నికల్లో భారీ ఎత్తున అభ్యర్థులను నిలబెట్టి, ఆయన స్వయంగా మోడీపై వారణాసిలో పోటీకి దిగారు. దీంతో ఆయన వారణాసికే పరిమితం కావలసి వచ్చింది. గాలి ఎటువైపు వీస్తోందో గుర్తించకపోవడం ఆయన చేసిన పెద్ద రాజకీయ తప్పిదం. ఆయన తనకు బలమున్న వేరే నియోజకవర్గం నుంచి గెలిచి, పార్లమెంటులో ప్రవేశించి ఉంటే, ఆయన మంచి ప్రతిపక్ష నేతగా ప్రజల దృష్టిలో నిలబడే వారు. కానీ మోడీపై పోటీ చేయడం వల్ల ఆయన స్వయంగా ఓడారు. ఇప్పటి వరకూ ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకే ఒక్క సీటు లభించింది. హడావిడిగా తప్పు చేసి, తీరిగ్గా ఏడవడం అన్న సామెతకు అరవింద్ కేజ్రీవాల్ ఆకాశమంత ఉదాహరణ. ఇప్పుడు కేజ్రీవాల్కు మరో అయిదేళ్ల వరకూ వనవాసమే.