అయోధ్యరామిరెడ్డి నామినేషన్‌కు పోటెత్తిన జనం
విద్యానగర్(గుంటూరు), న్యూస్‌లైన్ :జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మద్దతుగా భారీగా ర్యాలీలతో తరలివచ్చారు. నగరంలోని చుట్టుగుంట సెంటర్ నుంచి వేలాది మంది కార్యకర్తలు ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ర్యాలీలో కార్యకర్తలు అభిమానులు పులివెందుల పులిబిడ్డ జగన్ నాయకత్వం వర్థిల్లాలి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్థిల్లాలి, వైఎస్సార్ జోహార్, అయోధ్యరామిరెడ్డి నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అయోధ్యరామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
పేదలకు సొంతిల్లు వైఎస్సార్‌సీపీ..
అనంతరం విలేక రులతో అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. వైఎస్సార్‌సీపీ మధ్యతరగతి పార్టీ అని, పేదలకు సొంతిల్లు లాంటిదన్నారు. జిల్లాలో బ్రహ్మాండమైన మెజారిటీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులందరి గెలుపు ఖాయమన్నారు. పేదలు, ప్రజలు ఎప్పుడు రాజన్న రాజ్యం చూడాలా అని ఆశగా ఎదురు చూస్తున్నారని, మరో నెల రోజుల్లో సుఖశాంతులతో తులతూగే రాజన్న రాజ్యాన్ని ప్రజలు చూస్తారని చెప్పారు. రెండు నెలల నుంచి నరసరావుపేట డివిజన్‌లో ప్రతి గ్రామం తిరుగుతున్నానని, స్థానికంగా ఉన్న సమస్యలను పరిశీలిస్తున్నానని, తప్పని సరిగా సరైన ప్రణాళిక ద్వారా ఐదేళ్లలో నరసారావుపేట డివిజన్‌ను అభివృద్ధి చేస్తాన ని చెప్పారు.
రాయపాటి, గల్లా నామినేషన్ల దాఖలు
టీడీపీ నరసరావు పేట ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు, గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ర్యాలీగా ఆ పార్టీనాయకులు, కార్యకర్తలతో మార్కెట్ సెంటర్ నుంచి కలెక్టరేట్‌కు చేరుకుని నామినేషన్లు దాఖలు చేశారు.ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడుతూ పల్నాడు అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. నియోజకవర్గ నాయకులు అసమ్మతితో ఉన్న మాట వాస్తవమేనని, కొన్ని రోజుల్లో సర్దుకుపోతుందని చెప్పారు. గల్లా జయదేవ్ మాట్లాడుతూ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. పరిశ్రమలు స్థాపనకు కృషిచేసి ప్రతి గ్రామంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని చెప్పారు.
పోలీసుల హడావుడి..
ర్యాలీగా వస్తున్న ప్రజలపై పోలీసులు తమదైన శైలిలో ప్రతాపాన్ని చూపారు. ర్యాలీగా వస్తున్న వాహనాలను నిలిపి కేసులు నమోదు చేశారు. ద్విచక్రవాహనాలను సైతం స్టేషన్లకు తరలించారు. కలెక్టర్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో జనసంచారం ఉండకుండా ఏర్పాట్లు చేశారు. అభ్యర్థితోపాటు మరో నలుగురిని మాత్రమే కలెక్టరేట్‌లోకి అనుమతించారు.