జాబు ఓ డాబు
- బాబు హయాంలో మెడికల్ ఇన్‌వాలిడేషన్ అర్జీల రద్దు జీవో
- అన్యాయమైపోయిన వందలాదిమంది
- ఉత్తర్వు రద్దు చేసిన మహానేత
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ‘జాబు కావాలి... బాబు రావాలి...’ ఇదీ టీడీపీ నేతల ప్రచారం. యువతలోనూ ఇదే నినాదం తీసుకెళ్లి ఊదరగొడుతున్నారు. నిజంగా బాబు వస్తే ఉద్యోగాలొస్తాయో లేదో గానీ ఉన్న ఉద్యోగాలను ఊడగొడతారని ఆయన పాలన గురించి బాగా తెలిసిన ఉద్యోగులెవరైనా ఇట్టే చెబుతున్నారు. బాబు రాకూడదు బాబోయ్ అంటూ పలువురు ఆందోళన చెందుతున్నారు. కాం ట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌లలో పని చేస్తు న్న వారితో బాటు కారు ణ్య నియామక ఉద్యోగాల్లోనూ కోత వేస్తాడని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
పినకోటకు చెందిన నూకరాజు వైద్య శాఖలో నాలుగో తరగతి ఉద్యోగం చేసేవాడు. అతడికి ఓ సారి రోడ్డు ప్రమాదంలో వెన్నుపూస విరిగిపోయింది. అప్పటి నుంచీ ఆరోగ్యం సహకరించేది కాదు. 54 ఏళ్ల వయస్సులోనూ అన్ని కార్యాలయాలకు తిరిగి ఫైల్స్ మోసుకురావడం కష్టమయ్యేది. వైద్యులు చూసి ఆరోగ్యం సహకరించడం లేదని నిర్ధారించారు. దీంతో తన కుమారునికి ఆ ఉద్యోగం ఇవ్వాలని 2002లో అర్జీ చేసుకున్నాడు. ఇలాంటి వారు జిల్లాలో దాదాపు అయిదారొందల మంది దరఖాస్తులు అప్పటికే ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో వుంచారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దరఖాస్తులు వేలల్లోనే ఉన్నాయని గ్రహించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ ఇన్‌వాలిడేషన్‌లో వచ్చే అర్జీలకు ఇచ్చే ఉద్యోగాలను రద్దు చేస్తూ 2002 లో జీవో (ఎం ఎస్ నెంబర్ 202, 203) జారీ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా వున్న వందలాది మంది తమ పిల్లలకు ఉద్యోగాలొస్తాయని మెడికల్ ఇన్‌వాలిడేషన్ చేయించుకున్న వారంతా అన్యాయమైపోయారు. ఒక పక్క జీతం రాక, పిల్లలకు ఉద్యోగం లేక, కేవలం పెన్షన్‌పైనే ఆధారపడి జీవిస్తున్నారు.
వైఎస్సార్ ఉద్యోగమిచ్చారు...!
మెడికల్ ఇన్‌వాలిడేషన్ ఉద్యోగాలను కల్పించే జీవోలను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆరోగ్యం సహకరించక ఉద్యోగం చేయలేకపోతున్న వారికి తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించి తద్వారా కుటుంబ భారాన్ని మోసేందుకు ఉన్న ఏకైక అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు ఎన్జీవోలంతా ఏకమాయ్యరు. 2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఎన్జీవోలంతా 202, 203 జీవోలను రద్దు చేయాలని కోరడంతో 2008లో అక్టోబర్ 23న జీవో ఎంఎస్ నెంబర్ 661 ద్వారా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2008 నుంచీ ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా వున్న దాదాపు 40 రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 500 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు.
బాబు వస్తే జాబు ఎలా..!
బాబు వస్తే జాబు ఎలా వస్తుంది. ఇంటింటికీ ఓ ఉద్యోగం అంటూ ప్రచారమే తప్పా ఆచరణ ఎలా సాధ్యం. ఓ ఊళ్లో 100 ఇళ్లుంటాయి. అక్కడ 100 మందికి ఉద్యోగాలిచ్చి ఏం చేయిస్తారో ఆయనే చెప్పాలి. ఇదంతా నిరుద్యోగులను మోసగించడమే.
- అశోక్, నిరుద్యోగి, పిఠాపురం కాలనీ
పర్మినెంట్ ఉద్యోగులుండరు..!
బాబు వస్తే రెగ్యులర్ ఉద్యోగులుండరు. అంతా ఔట్‌సోర్సింగ్ సిబ్బందే. వారికి జీతాలు ఇవ్వరు..ప్రజలకు పని చేయరు. అంతా జన్మభూమి..మన ఖర్మ భూమి మాత్రమే మిగులుద్ది.
- నాగమణి, జీవీఎంసీ ఔట్‌సోర్సిగ్ ఉద్యోగి