మోదుగులను చంపేసే వారే: ఉండవల్లి
విజయవాడ: అధికార, ప్రతిపక్షాలు కలిసిపోతే పార్లమెంట్లో అత్యాచారం, హత్య జరిగిన బయటకు రాదని జై సమైక్యాంధ్ర పార్టీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టినప్పడు సీమాంధ్ర ఎంపీలపై జరిగిన దాడే దీనికి నిదర్శనమన్నారు. లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే కొట్టకపోతే మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని గొంతు నులిమి చంపేసే వారని చెప్పారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో 2005లో ఆమోదం పొందినా ఇప్పటి వరకు ఎందుకు లోక్సభలో పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణవాదులు భద్రాచలంను ఎలా అడుగుతారని అన్నారు. భద్రాచలంను నిజాం ప్రభువులు పాలించారా అని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు రాజ్యాంగవిరుద్ధమని అరుణ్ జైట్లీయే చెప్పారన్నారు. రాష్ట్ర విభజన ఇంకా జరగలేదని, దీన్ని ప్రజలు గుర్తించాలన్నారు. తెలంగాణలోనూ జై సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. ప్రజలు మద్దతిస్తే తమ సత్తా ఏంటో చూపిస్తామని ఉండవల్లి అన్నారు.