
'మల్కాజ్‌గిరి నుంచి ఉండవల్లి పోటీ'
రాజమండ్రి: జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున మల్కాజ్‌గిరి నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ను పోటీకి దింపుతామని అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ తెలిపారు. అమలాపురం నుంచే తాను పోటీ చేస్తానని చెప్పారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసినట్టు వెల్లడించారు.
జై సమైక్యాంధ్ర పార్టీ తెలంగాణలోనూ పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంతకుముందే ప్రకటించారు. మల్కాజ్ గిరిలో అధిక సంఖ్యలో ఉన్న సీమాంధ్ర ఓట్లు ఉండడంతో ఇక్కడి నుంచి తమ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని జై సమైక్యాంధ్ర పార్టీ నిర్ణయించింది. మల్కాజ్ గిరిలో పోటీకి ఉండవల్లి కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.