
ఆళ్లగడ్డ ఎన్నికపై రేపు స్పష్టత
ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమా శోభానాగిరెడ్డి మరణించిన విషయాన్ని కేంద్ర ఎన్నికల దృష్టికి తీసుకెళ్తున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు.
హైదరాబాద్: ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమా శోభానాగిరెడ్డి మరణించిన విషయాన్ని కేంద్ర ఎన్నికల దృష్టికి తీసుకెళ్తున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఆళ్లగడ్డలో ఎన్నికలు నిర్వహించే విషయంలో ఈసీని స్పష్టత కోరుతున్నామని చెప్పారు. బ్యాలెట్ పేపర్‌ను మార్చడమా లేదా పోలింగ్‌ను వాయిదా వేసి మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలా అనే దానిపై స్పష్టం చేయాలని కోరనున్నామని తెలిపారు. రేపటిలోగా ఆళ్లగడ్డ ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చే అవకాశముందని భన్వర్లాల్ అన్నారు.
ఈ- సేవ, మీ సేవా కేంద్రాల్లో ఓటర్‌కార్డులు తక్షణం జారీ చేయాలని భన్వర్‌లాల్ ఆదేశించారు. ఏ కారణంతోనూ ఓటర్‌కార్డు జారీలో జాప్యం జరగకూడదన్నారు. ఓటర్ కార్డు జారీ కోసం పది రూపాయలు మాత్రమే తీసుకోవాలని సూచించారు. ఓటర్ కార్డు జారీలో ఆలస్యం జరిగినా, ఎక్కువ డబ్బులు తీసుకున్నా ఆయా సెంటర్లపై తక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఓటరు చైతన్యానికి ఈవీఎం వాడకంపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.