
చంద్రబాబు రెండు ఘోరతప్పిదాలు చేశారు
‘వైఎస్సార్ జనభేరి’లో మేకపాటి
సాక్షి, ఒంగోలు: ‘టీడీపీ అధినేత చంద్రబాబు సుదీర్ఘకాలం రాజకీయాల్లో పండిపోయానని చెప్పుకుంటున్నారు. ఆయన చేసిన రెండు ఘోర తప్పిదాలను రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరవలేరు. ఆయన్ను క్షమించే ప్రసక్తే ఉండదని’ వైఎస్సార్ కాంగ్రెస్ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు.
సోమవారం కందుకూరులో జరిగిన వైఎస్సార్ జనభేరి లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట రోడ్డుషోలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. చంద్రబాబు చేసిన రెండు తప్పులు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడవడం మొదటిదైతే, రాష్ట్ర విభజనకు 2008లో లేఖ ఇచ్చి ... పార్లమెంట్‌లో విభజన బిల్లుకు అనుకూలంగా ఓటేయించడం.. తెలంగాణలో నేతలను ఉత్సవాలు జరుపుకోమని చెప్పడం రెండో తప్పుగా వివరించారు.
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని నరహంతకుడని గతంలో విమర్శించిన చంద్రబాబు మళ్లీ ఆయనతో పొత్తు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. విశ్వసనీయత కోల్పోయిన నేతగా ఉన్న బాబు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రి చేయడం కల్లని దుయ్యబట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు.
సీమాంధ్రలో 175 అసెంబ్లీ సీట్లకు 150కి పైగా వస్తాయని, అలాగే 25 ఎంపీ సీట్లను క్లీన్‌స్వీప్ చేస్తుందన్నారు. తెలంగాణ లో ఖమ్మం, మల్కాజ్‌గిరి, మహబూబ్‌బాద్‌లతో పాటు, మరోచోట మొత్తం నాలుగు ఎంపీ సీట్లు వైఎస్సార్‌సీపీకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోవడం అసాధ్యమన్నారు. ఎల్లో పత్రికల్లో తప్పుడు వార్తలు రాయిస్తూ దుష్ర్పచారం చేస్తున్న చంద్రబాబు కుళ్లు, కుతంత్ర రాజకీయాలు ఇంకెన్నాళ్లో సాగవని హెచ్చరించారు.