వ్యవసాయం దండగ.. ఆ వృత్తిని మానేసి మరో వృత్తివైపు వెళ్లండని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు కల్లబొల్లి కబుర్లు చెబుతుండటం ఊసరవెల్లిని గుర్తుకు తెస్తోందని రైతులు మండిపడుతున్నారు.
ఊసరవెల్లికి మారుపేరు
వ్యవసాయం దండగ.. ఆ వృత్తిని మానేసి మరో వృత్తివైపు వెళ్లండని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు కల్లబొల్లి కబుర్లు చెబుతుండటం ఊసరవెల్లిని గుర్తుకు తెస్తోందని రైతులు మండిపడుతున్నారు. మీరు ఎన్ని కష్టాలైనా అనుభవించండి.. విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే జైలు తప్పదని కనికరం లేకుండా రాక్షసంగా వ్యవహరించిన ఆయన్ను ఎలా మరిచి పోగలమని జిల్లా రైతాంగం వాపోతున్నారు. ఆ తొమ్మిదేళ్లూ వ్యవసాయ రంగాన్ని అవసాన దశకు తీసుకెళ్లి.. రైతుల ఆత్మహత్యలకు కారకుడైన ఆయన నేడు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని చెబుతుండటాన్ని ఏ ఒక్కరూ నమ్మరంటున్నారు.
వ్యవసాయాన్ని నాశనం చేశాడు
చంద్రబాబు హైటెక్ మోజుతో వ్యవసాయాన్ని నాశనం చేశాడు. కేవలం హైదరాబాద్‌పై దృష్టిపెట్టి గ్రామాలను నిర్లక్ష్యం చేశాడు. ఆయన హయాంలో లోఓల్టేజీ, హై ఓల్టేజీ, అప్రకటిత కోతలతో వ్యవసాయం గిట్టుబాటు కాక ఎందరో రైతులు కూలీలుగా మారారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి ఏడు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానంటే సాధ్యం కాదన్న చంద్రబాబు నేడు తొమ్మిది గంటలు ఉచితంగా విద్యుత్ ఇస్తాననడం హాస్యాస్పదం. పదవి కోసం ఏ గడ్డి అయినా కొరకడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సార్వత్రిక ఎన్నికలల్లో ఆయనకు ఘోరపరాభవం తప్పదు.
-ఉప్పుకూరు కేశవరెడ్డి, రైతు, మద్దులచెరువు, తాడిమర్రి మండలం
నరకం చూశాం
చంద్రబాబు పాలనలో నరకం అనుభవించాం. వర్షాలు లేవు.. పంటలు లేవు.. రాష్ట్రం కరువుతో అల్లాడింది. పైగా కరెంటు బిల్లులు కట్టలేదని రైతులను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇప్పుడేమో అధికారం కోసం రైతులకు రుణమాఫీ అంటున్నాడు. పథకంలో ఏదోమెలిక పెట్టి రైతులను మోసం చేస్తాడు. ఈ చంద్రబాబును రైతులు నమ్మరు.
- నరసింహారెడ్డి, రైతు, ముచ్చుకోట, పెద్దపప్పూరు మండలం
అంతా చీకటే...
బాబు రైతులకు చేసింది ఏమీలేదు..
రాష్ట్రంలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చే శానని, కేంద్రంలో చక్రం తిప్పానని, కింగ్ మేకర్‌నని చెప్పకునే చంద్రబాబు వాస్తవంగా రైతులకు చేసింది ఏమీలేదు. బోరు బావుల కింద వ్యవసాయం చేసుకునే మా లాంటి చిన్న రైతులకే చుక్కలు కనిపించేవి. కరెంటు ఎప్పుడు వస్తుందో...ఎప్పుడు పోతుందో బోర్ల వద్ద రాత్రంతా కాపలా కాయాల్సి వచ్చేది. అప్పట్లో రైతుల పరిస్థితి దారుణంగా వుండేది.
- యర్రభూమి అనంతరెడ్డి, రైతు, రాఘవంపల్లి, బత్తలపల్లి మండలం
రైతులు దివాలా తీశారు
చంద్రబాబు పాలనలో రైతులు దివాలా తీశారు. వర్షాలు సకాలంలో రాలేదు. దీంతో ఉన్న 20 ఎకరాల్లోని వేరుశనగ పంట ఎండి పోయి నష్టాల ఊబిలో కూరుకపోయాం. ఎన్ని కష్టాలు వచ్చినా పట్టించుకున్న పాపాన పోలేదు.
- రైతు రామాంజినేయులు, భీమునిపల్లి పెద్దవడుగూరు
9 ఏళ్ల కష్టాలు గుర్తుకొస్తాయి
బాబు పాలనను తలుచుకుంటే తొమ్మిదేళ్ల కష్టాలు గుర్తుకొస్తాయి. ఆయన ఏనాడూ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. విద్యుత్ బిల్లులు కట్టలేదని స్టార్టర్లు తీసుకెళ్లిపోవడంతో.. నీరున్నా పంటలను సాగు చేసుకోలేని పరిస్థితిని బాబు కల్పించారు. ఆ కష్టాలు మళ్లీ రాకూడదని కోరుకుంటున్నాం.
- రఘునాథ్‌రెడ్డి,
పాపసానిపల్లి, మడకశిర మండలం