న్యూఢిల్లీ: ఆకాశహర్మ్యాలతో కూడిన పట్టణ ప్రాం తాలతోపాటు పాడుబడిన పెంకుటిళ్లు, గుడిసెలు కలిగిన గ్రామీణ ప్రాంతాలున్న గుర్గావ్ నియోజకవర్గంలో ఈసారి లోక్‌సభ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇందుకు కారణం ఇక్కడ నుంచి పోటీపడుతున్న అభ్యర్థులే. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ నుంచి యోగేంద్ర యాదవ్‌ను ఎన్నికల బరిలోకి దింపింది. ఆప్ వ్యవస్థాపక సభ్యుడైన ఆయన ఎన్నికల బరిలో దిగడంతో గుర్గావ్ లోక్‌సభ ఎన్నిక దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
రావ్ ఇంద్రజీత్ సింగ్‌ను తమ పార్టీ అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దింపింది. ఆయన గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడాతో విభేదాల వల్ల ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. రావ్ ఇంద్రజీత్ సింగ్ పార్టీ మారడం వల్ల గుర్గావ్‌లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్ ఇక్కడ నుంచి రావ్ ధర్మపాల్‌ను నిలబెట్టింది. ఐఎన్‌ఎల్‌డీ అభ్యర్థిగా పోటీచేస్తున్న జాకీర్ హుస్సేన్ కూడా పార్టీ మారారు. ఆయన బీఎస్పీని వీడి ఐఎన్‌ఎల్‌డీలో చేరారు.
గత లోక్‌సభ ఎన్నికలలో ఆయన రెండో స్థానంలో నిలిచారు. రివాడీ రాజకుటుంబానికి చెందిన రావ్ ఇంద్రజీత్ సింగ్ కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. ఆయనకు మహేంద్ర గఢ్, రివాడీ, గుర్గావ్, జజ్జర్, మేవాత్ ప్రాంతాలపై గట్టి పట్టు ఉండేది. సాధారణంగా కాంగ్రెస్‌కే ఓటు వేస్తూ వస్తోన్న ఈ ప్రాంతాల ఓటర్లు ఆయన పార్టీ మారడంతో అయోమయంలో పడ్డారు. సింగ్ కాం గ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడంతో ఇక ముస్లిం ఓట్లపై ఆయన ఆశలు వదులుకోవాల్సిందేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల సంఖ్య కూడా ఫలితాలను శాసించే స్థాయిలో ఉండడంతో గెలుపుకోసం సింగ్ చెమటోడ్చక తప్పదని చెబుతున్నారు. దీనిని అవకాశంగా మలచుకునేందుకు యోగేంద్ర యాదవ్ వేగంగా పావులు కదుపుతున్నారు.
ముస్లిం ఓటర్లను ఆయన ఆకట్టుకోవడం చాలా తేలికైన అంశమని రాజకీయ పండితులు చెబుతున్నారు. యాదవ్‌ల ఓట్లు కూడా బాగా నే ఉన్నందున వారి ఓట్లను కూడా కొల్లగొట్టడం లో యోగేంద్ర యాదవ్ సఫలీకృతుడవుతాడని జోస్యం చెబుతున్నారు. ఇదే జరిగితే ఆప్ పార్టీ విజయం ఇక్కడ నల్లేరు మీద నడకే. బీజేపీకి ఓటు వేయడానికి వెనుకాడే ముస్లిం ఓటర్లను ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి యోగేంద్ర యాదవ్ ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని స్థానిక సర్వేలు చెబుతున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే నిజాయితీపరుడైన, చిత్తశుద్ధి కలిగిన నేత అన్న పేరు ఆయనకు ప్లస్ పాయింట్ కానుంది.
గుర్గావ్ వంటి అంతర్జాతీయ హంగులున్న ప్రాంతాలతో పాటు నూహ్ వంటి గ్రామీణ ప్రాంతాలున్న ఈ నియోజకవర్గంలోని ఓటర్లలో కూడా హస్తిమశకాంతరం కనబడుతుంది. గుర్గావ్‌లోని పట్టణ ప్రాంతాలను పక్కనబెడితే గ్రామీణ ప్రాంతా ప్రజలు కులమత సమీకరణాల ఆధారంగానే ఓట్లు వేస్తారు. ఇక్కడి ఓటర్లలో దళితులు, జాట్‌లు, వైశ్యులు, గుజ్జర్లు, రాజపుత్రులు, పంజాబీలు, బ్రాహ్మణులు తమ తమ సామాజికవర్గానికి చెందిన నేతలకే ఓట్లు వేసే అవకాశముంది. ఈ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 17, 80,000.
మారిన రాజకీయ సమీకరణాలు
Published Fri, Mar 28 2014 10:48 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement