‘చేవెళ్ల’ ఎవరికో?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌లో సస్పెన్స్ కొనసాగుతోంది. సిట్టింగ్ ఎంపీ సూదిని జైపాల్‌రెడ్డి పాలమూరు సీటుకుమారడం దాదాపు ఖాయం కావడం.. ఆయన స్థానంలో రంగంలో దిగే గెలుపు గుర్రం ఎవరనేది తేలకపోవడం హస్తం పార్టీ ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ అన్న కాంగ్రెస్ హైకమాండ్ నిబంధన.. ఈ సీటుపై ఆశ పెట్టుకున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుటుంబసభ్యుల ముందరికాళ్లకు బంధం వేస్తున్నాయి.
తన రాజకీయ వారసుడిగా తనయుడు కార్తీక్‌రెడ్డిని చేవెళ్ల బరిలోకి దించాలని చేవెళ్ల చెల్లెమ్మ భావించారు. కార్తీక్ పార్లమెంట్‌కు... తాను అసెంబ్లీకి పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో రాజేంద్రనగర్ శాసనసభా స్థానం నుంచి పోటీకి సబిత సన్నాహాలు చేసుకుంటున్నారు. ఏకకాలంలో పార్లమెంట్, అసెంబ్లీ టికెట్ల బీ ఫారాల కోసం నిరీక్షిస్తున్న వీరికి అధిష్టానం పెద్దల ప్రకటన షాక్‌నిస్తోంది. కుటుంబసభ్యుల్లో ఒకరికి మాత్రమే టికెట్ పక్కా అన్న ప్రకటన వీరికి ప్రతికూలంగా మారింది.
జై... పాలమూరుతో..
జైపాల్‌రెడ్డి నిష్ర్కమణతో చేవెళ్ల టికెట్ కు లైన్ క్లియరైనట్లేనని సబితమ్మ భావించారు. ఆయన స్థానంలో కార్తీక్‌ను బరిలోకి దింపేందుకు ప్రధాన అవరోధం తొలిగిందన్నఅంచనాకొచ్చారు. అయితే, ఒక్కరికే ఛాన్స్ నిబంధనతో తమలో ఒకరు తప్పుకోవాల్సి వస్తుందనే వాదన వారిని డీలా పడేస్తోంది. పార్లమెంటు రేసులో సబిత అభ్యర్థిత్వానికే అధిష్టానం మొగ్గు చూపుతోంది. ఇదే విషయాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సైతం సబితతో చర్చించారు. తనకు జాతీయ రాజకీయాలపై అంతగా ఆసక్తి లేదని, ఎంపీ సీటుకు తన కుమారుడి అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఆమె కోరారు. అదే సమయంలో రాజేంద్రనగర్ అసెంబ్లీ టికెట్ తనకు ఖరారు చేయాలని అభ్యర్థించారు.
సబిత విన్నపంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని డిగ్గీరాజా ఈ అంశంపై మరోసారి చర్చిద్దామని దాటవేసినట్లు తెలిసింది. ఇదిలావుండగా, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సారి పార్లమెంటుకు పోటీ చేయాలని కార్తీక్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ వ్యూహంలో భాగంగానే గత ఆరు నెలలుగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడమే కాకుండా, తెలంగాణ నవ నిర్మాణ యాత్ర పేరిట 101కి.మీ. మేర పాదయాత్ర నిర్వహించారు. జైపాల్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీకి దిగనిపక్షంలో తనకే సీటొస్తుందన్న ధీమాతో ఉన్నారు.
అటో..ఇటో తేల్చుకోలేక...
ఇద్దరిలో ఒకరికే టికెట్ అని అధిష్టానం స్పష్టం చేయడంతో సబిత, కార్తీక్‌లు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కుమారుడు ఆశిస్తున్న చేవెళ్ల నుంచి తనను బరిలోకి దించాలనే కాంగ్రెస్ పెద్దల సూచన ఆమెను ఇరకాటంలోకి నెట్టింది. ఎంపీ సీటు పుత్రుడికి దక్కించుకునేందుకు వివిధ మార్గాల్లో ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాగా, కార్తీక్ మాత్రం అమ్మ విషయంలో పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని... అదే సమయంలో రాజేంద్రనగర్ టికెట్ కూడా తమ వారికే కేటాయించాలని అంటున్నారు. అంతేకాకుండా లోక్‌సభ బరిలో ఎవ రు ఉండాలనేది మా కుటుంబ ంలో అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. ఏది ఏమైనా చేవెళ్ల ఎంపీ టికెట్ కేటాయింపు కాంగ్రెస్ పార్టీకి చిక్కుముడిగా మారిందనడంలో సందేహం లేదు.