రాకోయి.. మా ఇంటికి! | confusion in Telangana congress campaign | Sakshi
Sakshi News home page

రాకోయి.. మా ఇంటికి!

Published Sun, Apr 20 2014 1:56 AM | Last Updated on Tue, Aug 14 2018 5:41 PM

రాకోయి.. మా ఇంటికి! - Sakshi

రాకోయి.. మా ఇంటికి!

 ప్రచారానికి వస్తామంటున్నా పట్టించుకోని అభ్యర్థులు
 టీ కాంగ్రెస్ పెద్దలకు చిత్రమైన పరిస్థితి
 ప్రచారానికి వస్తాం.. ఏర్పాట్లు చేసుకోవాలని అభ్యర్థులకు ఫోన్లు
 హెలికాప్టర్ సిద్ధంగా ఉందని.. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తామని వెల్లడి
 పదే పదే చెబుతున్నా పట్టించుకోని స్థానిక కాంగ్రెస్ అభ్యర్థులు
 దీంతో నేడు సొంత జిల్లా వరంగల్‌లో పర్యటనకు పొన్నాల నిర్ణయం

 
 సాక్షి, హైదరాబాద్: స్పీచ్‌లు రెడీగా ఉన్నాయి.. హెలికాప్టర్ కూడా సిద్ధంగా ఉంది.. అస్త్రశస్త్రాలన్నీ సమకూర్చుకున్నారు. వీటితో ప్రచారంలో రేసుగుర్రంలా దూసుకుపోవాలని భావించారు.. అయితే రమ్మనేవారే కరువయ్యారు.. ఎక్కడి నుంచైనా ఆహ్వానం అందుతుందేమోనని చూసిన వారి ఆశలు అడియాసలయ్యాయి.. అలా చూసిచూసి, ఇక లాభం లేదనుకుని వారే రంగంలోకి దిగారు.. జిల్లాలోని అభ్యర్థులకు ఫోన్ చేసి, ప్రచారం చేసి పెడతాం.. ఎప్పుడు ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తాం.. ఏర్పాట్లు చేసుకోండి ప్లీజ్ అని బతిమాలారు.. అయినా అటునుంచి స్పందన లేకపోవడం చూసి అవాక్కయ్యారు.. ఇదీ తెలంగాణ కాంగ్రెస్‌లోని బడా నేతల పరిస్థితి..!
 
 సాధారణంగా ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు.. గెలుపు కోసం అందివచ్చే ప్రతి చిన్న అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. తమ పార్టీలోని పెద్ద నేతలతో ఎలాగైనా ప్రచారం చేయించుకోవాలని తహతహలాడతారు. అందుకోసం వారిని ఒప్పించి తమ తమ నియోజకవర్గాలకు తీసుకెళ్లి ప్రచారం చేయించుకుంటారు. కానీ తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మేం మీ నియోజకవర్గానికి వచ్చి ప్రచారం చేసిపెడతాం.. చేయించుకోండి ప్లీజ్ అంటూ బడా నేతలే అభ్యర్థులకు ఫోన్ చేసి అడుగుతున్నా, వారు స్పందించకపోవడం విశేషం.
 
 తెలంగాణలో ఎన్నికల సమరానికి ఇక పదిరోజులే గడువు ఉంది. ఓవైపు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వివిధ జిల్లాలను చుట్టేస్తూ, ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను కడిగిపారేస్తున్నారు. దీంతో కేసీఆర్‌ను దీటుగా ఎదుర్కోవాలని టీ కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు సొంత నియోజకవర్గాలకే పరిమితమైన    ఆయా నేతలు.. ఇతర జిల్లాల్లో కూడా ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి కె.జానారెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, కో-చైర్మన్ షబ్బీర్‌అలీ, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డి.శ్రీధర్‌బాబు, కో-చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క ఈనెల 20 నుంచి 28 వరకు కొన్నిచోట్ల కలిసికట్టుగా, మరికొన్ని చోట్ల ృందాలు ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తొలివిడతగా ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పర్యటించేందుకు ప్రణాళిక కూడా రూపొందించుకున్నారు. అందుకోసం ప్రత్యేకంగా హెలికాప్టర్‌ను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. తాము ప్రచారానికి వస్తున్నామని, ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా జిల్లాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, స్థానిక నేతలకు పదేపదే చెబుతున్నా.. అటునుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో వారికి ఏమి చేయాలో అర్థం కావడంలేదు.
 
 హలో..
 
 నేను పోన్నాలను మాట్లాడుతున్నా!
 
 టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గత రెండు రోజులుగా ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో పోటీచేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫోన్ చేసి.. ‘‘పార్టీ సమకూర్చిన హెలికాప్టర్ సిద్ధంగా ఉంది. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం. జిల్లాలో ఎక్కడెక్కడ ప్రచారం చేయాలో మీరే చెప్పండి. రూట్‌మ్యాప్ తయారు చేయండి’’ అని కోరినా ఇప్పటి వరకు ఆయా జిల్లాల నుంచి స్పందన రాలేదు. శనివారం ఉదయం కూడా పొన్నాల ఆయా జిల్లా నేతలకు ఫోన్ చేసినా.. అటువైపు నుంచి, జిల్లా నాయకులతో మాట్లాడి చెబుతామనే సమాధానమే ఎదురైంది. ఒకవైపు రూ.లక్షలకు లక్షలు అద్దె చెల్లించి తీసుకున్న హెలికాప్టర్ ఖాళీగా ఉండటం, మరోవైపు ప్రచారానికి వస్తున్నామని చెప్పినా అవతలివైపు నుంచి స్పందన లేకపోవడంతో.. ఇక చేసేదేమీ లేక తన సొంత జిల్లా వరంగల్‌లోనైనా పర్యటించాలని పొన్నాల నిర్ణయించుకున్నారు. వెంటనే వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు ఫోన్‌చేసి.. తాను ఆదివారం జిల్లాలో పర్యటిస్తానని, స్థానిక నేతలు, అభ్యర్థులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి భూపాలపల్లి, గీసుకొండ, వర్ధన్నపేట, హన్మకొండ ప్రాంతాల్లో పర్యటించడంతోపాటు వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సొంత జిల్లాలో కాబట్టి నాయకులందరినీ సమన్వయం చేసి జనసమీకరణ చేయడం సమస్య కాదనే ఉద్దేశంతోనే అక్కడ ప్రచారానికి సిద్ధమయ్యారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. వరంగల్ జిల్లా పర్యటనను విజయవంతం చేస్తే ఇతర జిల్లాల స్థానిక అభ్యర్థులు కూడా ప్రచారానికి పిలుస్తారని పొన్నాల భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పెద్దలంతా కలిసికట్టుగా ఈనెల 22, 23, 24, 26, 28 తేదీల్లో జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నారని, అందుకోసం ఎక్కడెక్కడ ప్రచారం చేయాలనే దానిపై రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని అన్ని జిల్లాల కాంగ్రెస్ కార్యాలయాలకు సమాచారం పంపారు.
 
 కలిసికట్టుగా, విడివిడిగా ప్రచారం చేస్తాం: పొన్నాల
 
 తనతోపాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, షబ్బీర్‌అలీ తెలంగాణలో ప్రచారం చేయనున్నట్లు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఈనెల 22 నుంచి 28 వరకు తామంతా కలిసికట్టుగా, కొన్నిచోట్ల విడివిడిగృ, బందాలుగా ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలతోపాటు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రచారం చేయని ప్రాంతాల పై ప్రధానంగాృదష్టి పెట్టినట్టు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement