నగ్మాకు మరో చేదు అనుభవం
చేయి వేసిన యువకుడి చెంప చెళ్లుమనిపించిన తార
ఇలాగైతే మళ్లీ మీరట్ మొహం చూడనని ప్రకటన
మీరట్: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అందాల సినీతార నగ్మాకు ఎన్నికల ప్రచారం చేదు అనుభవాలను మిగుల్చుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ లోక్‌సభ నియోజకవర్గంలో సొంత పార్టీ ఎమ్మెల్యే గజరాజ్ సింగ్ ఆమెను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకున్న ఘటన మరవకముందే ఇంచుమించు అలాంటిదే మరో అనుభవం శుక్రవారం ఎదురైంది. మీరట్‌లో చేపట్టిన ర్యాలీ సందర్భంగా సభాస్థలి వద్దకు వెళ్తున్న ఆమెను జనం ఒక్కసారిగా చుట్టుముట్టారు. దీంతో గందరగోళానికి గురైన నగ్మాపై ఒక యువకుడు చేయి వేశాడు.
దీంతో అగ్గి మీద గుగ్గిలమైన నగ్మా... అతని చెంప పగులగొట్టారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన నగ్మా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మళ్లీ మీరట్‌లో అడుగుపెట్టబోనని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే గజరాజ్‌పై చర్యల్లేవ్...: బహిరంగంగా నగ్మాపై అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే గజరాజ్ సింగ్‌పై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. అంతేకాదు ఆ దృశ్యాల వీడియోను టీవీ చానళ్లు పదేపదే ప్రసారం చేయడంతో పలు విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ ఎమ్మెల్యేపై చర్యలకు ఆదేశిస్తే వచ్చే ఎన్నికలలో విజయావకాశాలు ఎక్కడ దెబ్బతింటాయోననే అధిష్టానం భావిస్తోంది. అయితే ఈ ఘటనను మరో కాంగ్రెస్ నేత ప్రమోద్ కాత్యాయన్ ఖండించారు. ‘గజరాజ్ చాలా సీనియర్ నేత. ఆయన ప్రవర్తన ఎమ్మెల్యే హోదాకు తగినట్లుగా లేద’’ని వ్యాఖ్యానించారు. ఇందుకుగాను కాత్యాయన్‌ను పార్టీ నుంచి సోమవారం బహిష్కరించడం కొసమెరుపు.