కాంగ్రెస్‌లో.. లకలకలక..
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల ముంగిట బయటపడుతున్న లుకలుకలు కాంగ్రెస్ పార్టీలో గుబులు రేపుతున్నాయి. పార్టీలోని గ్రూపులు చేతులు కలపట్లేదు. ఒకరినొకరు దెబ్బతీసుకునేందుకు వైరి వర్గాలు అమీతుమీకి సిద్ధపడుతున్నాయి. తమ స్థానాలతో పాటు మిగతా నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల గెలుపునకు పాటుపడతామన్న ఇద్దరు మాజీ మంత్రులు.. ప్రస్తుతం సొంత సెగ్మెంట్లలో నెగ్గుకు వచ్చేందుకే చెమటలు కక్కుతున్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ అభ్యర్థుల్ని హడలెత్తిస్తున్నాయి. డివిజన్ స్థాయి నాయకులు- ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు- ఎంపీ అభ్యర్థుల మధ్య సమన్వయం కొరవడుతోంది.
ప్రచార కార్యక్రమాలు రసాభాసగా మారుతున్నాయి. బుధవారం సికింద్రాబాద్ శాసనసభ నియోకజవర్గ పరిధిలో కేంద్ర మంత్రి జైరాం రమేష్ పాల్గొన్న సభ అనంతరం కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి అంజన్‌కుమార్ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఆయన వైఖరిపై నగర మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, పీసీసీ కార్యదర్శి చంద్రారెడ్డి దుమ్మెత్తిపోశారు.
ఒక దశలో నువ్వెంతంటే నువ్వెంత అనుకునే వరకు పరిస్థితి వెళ్లింది. పార్టీ కోసం శ్రమించి, టికెట్లు దక్కక కినుక వహించిన ముఖ్య నేతల ఇళ్లకు జైరాం రమేష్‌తో పాటు కొప్పుల రాజు స్వయంగా వెళ్లి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం సీతాఫల్‌మండిలో కాంగ్రెస్ సభ ముగియగానే జైరాం రమేష్ బండ కార్తీకరెడ్డి ఇంటికి వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. ‘ఇప్పుడు టైం లేదు.. వద్దం’టూ అంజన్‌కుమార్ ఆపే ప్రయత్నం చేశారు. దీంతో బండ కార్తీక, ఆమె వర్గీయులు నిరసనకు దిగడంతో కలకలం రేగింది.
కొత్త ముఖాల బిక్కమొహం
ముషీరాబాద్‌లో బుధవారం జరిగిన సభలోనూ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అంజన్‌కుమార్, వినయ్‌కుమార్ మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈ సభలో అంజన్ మాట్లాడుతూ తనను వెన్నుపోటు పొడిచేందుకు కొందరు సిద్ధమవుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాలను అయోమయంలో పడేశాయిఎన్నికల బరిలోకి కొత్తగా దిగిన ముద్దం నర్సింహయాదవ్ (కూకట్‌పల్లి), నందికంటి శ్రీధర్ (మల్కాజిగిరి), గజ్జెల కాంతం (కంటోన్మెంట్) పరిస్థితి మరీ దారుణం..
ఇప్పటికీ కింది, డివిజన్ స్థాయి నేతలతో వీరికి సఖ్యతలేదు రెండోసారి పోటీలో ఉన్న జయసుధ (సికింద్రాబాద్), జ్ఞానేశ్వర్ (రాజేంద్రనగర్)కు నియోకజవర్గంలోని ముఖ్య నాయకులంతా ముఖం చాటేస్తున్నారు. వీరిని ఎలా బుజ్జగించాలో, ప్రచారం ఎలా సాగించాలో తెలియక వీరు గందరగోళానికి గురవుతున్నారు.
ఇద్దరు మంత్రుల ఎదురీత
నగరంలో ప్రతి కార్యక్రమంలో హడావుడి చేసే తాజా మాజీ మంత్రులు దానం నాగేందర్, మూల ముఖేష్‌గౌడ్.. సొంత నియోజకవర్గాల్లో ప్రతికూల పరిస్థితులకు ఎదురీదుతున్నారు. ప్రజా వ్యతిరేకత, మెజారిటీ సెక్షన్లు పార్టీకి దూరమైన తీరుతో ఖిన్నులైన వీరు.. నయానో భయానో దారికి తెచ్చుకునే పనిలో పడ్డారు.
ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌ను వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, దివంగత నేత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి గట్టి ప్రజాబలంతో ఢీకొడుతున్నారు. రోజుకో బస్తీ విజయారెడ్డి వెంట నడుస్తుండటంతో చాలా కాలంగా బస్తీలకు వెళ్లని దానం, బస్తీ వాసులందరిని తెల్లవారక ముందే తమ ఇంటి ముందు క్యూ కట్టించుకుంటూ తాయిలాలు సమర్పిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గోషామహల్‌లో మూల ముఖేష్‌గౌడ్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ లోధా చేతిలో ముప్పుతిప్పలు పడుతూ నియోకజవర్గం దాటలేని పరిస్థితి నెలకొంది.
జైరాం, కొప్పుల రాజులే ప్రచార సారథులు
నగరంలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచార సభలకు కేంద్ర మంత్రి జైరాం రమేష్, ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు ముఖ్య అతిథులుగా వెళుతున్నారు. ‘స్టార్ క్యాంపెయినర్లు’గా పాల్గొంటున్న వీరిని పార్టీ అభ్యర్థులే ప్రజలకు పరిచయం చేయాల్సి వస్తుం డటం విచిత్రం. వీరివల్ల ఓట్లు రాలవని అభ్యర్థులే సొంత ప్రచార కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు