
భజనపరులు
షోలాపూర్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మన్ననలు పొందే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు పనిచేయడం లేదని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. షోలాపూర్‌లోని పార్క్ మైదానంలో బుధవారం సాయంత్రం బీజేపీ అభ్యర్థి శరద్ బాన్‌సోడేకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. గత 60 సంవత్సరాలుగా అధికారంలో చెలామణి అవుతున్న కాంగ్రెస్‌కు అహంకారం విపరీతంగా పెరిగిపోయిందని మోడీ అన్నారు.
ఈ సారి ఎన్ని కుయుక్తులు పన్నినా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, మిత్రపక్షమైన ఎన్సీపీలకు అధికారం దక్కదని దుయ్యబట్టారు. గత వేసవి కాలంలో నీరు లేక విలవిలలాడుతున్న రైతులు, పంటలకు నీరు కావాలని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ను కోరితే అసభ్యకరమైన పదజాలం వాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వారి అహంకారానికి ఇది పరాకాష్ట అన్నారు. ‘డీఎఫ్ కూటమి నేతలకు దేశభక్తి అవసరం లేదు. కేవలం సోనియాకు భజన చేయడమే వారికి కావాలి. అందుకే సుశీల్‌కుమార్ షిండేకు ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్ర మంత్రి పదవులు లభించాయ’ని మోడీ అన్నారు.
ఎల్‌బీటీ అంటే లూటో బాటో ట్యాక్స్
ప్రజలు, వ్యాపారులను ఇబ్బందులు పెట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్థానిక సంస్థల పన్ను (ఎల్బీటీ)ని లూటో బాటో ట్యాక్స్‌గా మోడీ అభివర్ణించారు. తాము అధికారంలోకి రాగానే ప్రజలకు తలనొప్పిగా మారిన పన్నులను సమీక్షించి వెంటనే సవరిస్తామని హామీ ఇచ్చారు. షోలాపూర్ జిల్లాలో ఉన్న రెండు లోక్‌సభ నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎన్నో హామీలు ఇచ్చినా శరద్ పవార్ ఏ ఒక్కటీ చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ మాయమాటలకు మోసపోకుండా బీజేపీకే పట్టం కట్టబెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆవినీతికి వ్యతిరేకంగా అర్డినెన్స్‌లు తీసుకొచ్చామని చెబుతున్న కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో అవినీతి, కుంభకోణాల్లో ఇరుక్కున్న వారికి టికెట్లు ఇవ్వడం వెనుక మతలబేమిటి అని ప్రశ్నించారు.
దేశప్రజలకు ఏమి కావాలో, తాము ఏం చేయదల్చుకున్నామో ఇప్పటికే పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో స్పష్టం చేశామని చెప్పారు. అందులో చేర్చిన ప్రతి అంశానికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ వాగ్దానాలు చేసింది. అయితే ఏ వస్తువుల ధరలు తగ్గాయని సభికులను మోడీ ప్రశ్నించారు అందుకు లేదు లేదు అంటూ వారినుంచి సమాధానం వచ్చింది. ఇక వారికి గుణపాఠం చెప్పే సమయం వచ్చిందని, ప్రజలను దోచుకుంటున్న కాంగ్రెస్‌ను గద్దె దింపాలంటే బీజేపీనే గెలిపించాలని కోరారు.
తమ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. కాంగ్రెస్‌ను ఇంటిదారి పట్టించేందుకే దేశంలోని 26 ప్రాంతీయ పార్టీలు తమతో జతకట్టాయని మరోసారి గుర్తు చేశారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని చేసినా ఎన్‌డీఏ విజయాన్ని ఆపలేరన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకుడు కల్పనా గిరి తన భార్యను హత్య చేశాడని, అలాంటి పార్టీనే మహిళలకు భద్రత కల్పిస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. సభలో ఫడ్నవీస్‌తోపాటు స్థానిక, ప్రాంతీయ పదాధికారులు హాజరయ్యారు. ప్రచార సభకు దాదాపు 70 వేలకుపైగా జనం, కార్యకర్తలు తరలివచ్చారు.