భివండీ, న్యూస్‌లైన్: ఇతర దే శాలపై ఆధారపకుండా ఆహార భద్రత పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఉద్ఘాటించారు. భివండీ లోక్‌సభ నియోజకవర్గంలోని అంజూర్‌ఫాటా ప్రాంతంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి చవాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆహార భద్రత పథ కం వల్ల రూ.2 లక్షల 40 వేల కోట్ల విలువచేసే ధాన్యాన్ని మనమే ఎగుమతి చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే పేద కుటుంబాలు బాగుపడుతున్నాయన్నారు. ‘మహిళలు, దళితులకు పూర్తి భద్రత కల్పిస్తున్నాం. కొందరు గిట్టనివారు మా పార్టీపై దుష్ర్పచారం చేస్తున్నారు’అని తెలిపారు. బాలికలకు వసతి గృహాలు, సాంకేతిక, ఇతర కళాశాలు నిర్మించడంవల్ల విద్యార్థినుల సంఖ్య బాగాపెరిగిందన్నారు.
ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్, ఎన్సీపీల నేత త్వంలోని తమ పాటుపడుతోందన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం అందరితో మమేకమై అభివృద్ధి బాటలో దూసుకెళుతుందని చవాన్ పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ఫిరాయింపుల బెడద పెరిగిపోవడంతో కార్యకర్తలు ఆందోళనలో పడిపోయారు. ఎవరి తరఫున ప్రచారం చేయాలి? ఎవరికి అండగా నిలబడాలి? తదితర విషయాలను తేల్చుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల్లో నెలకొన్న గందరగోళాన్ని దూరం చేయడానికే ఇక్కడికి వచ్చాను’ అని అన్నారు. అనంతరం జిల్లా ఇంచార్జీ మంత్రి గణేశ్ నాయిక్ ప్రసంగిస్తూ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. అక్కడి నుంచి వేలాదిసంఖ్యలో పశువులు గడ్డి కోసం ఈ రాష్ట్రానికి వస్తున్నాయన్నారు.
దీన్ని బట్టి గుజరాత్ ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందనే విషయాన్ని తేలికగా అర్ధం చేసుకోవచ్చన్నారు. ఇదిలాఉండగా ముఖ్యమంత్రి చవాన్ నిర్ధేశించిన సమయానికంటే సుమారు మూడు గంటలు ఆలస్యంగా సభా ప్రాంగణానికి రావడంతో కార్యకర్తలు కొంత అసహనానికి గురయ్యారు. సురేష్ టావ్‌రేకి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ టికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా కార్యకర్తలు డిమాండ్‌చేస్తూ చవాన్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున విశ్వనాథ్ పాటిల్‌ని అభ్యర్థిగా ఖరారు చేశారు. కార్యకర్తల ఒత్తిడికి తలొగ్గి చవాన్ అభ్యర్థిని మారుస్తారా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. కాగా కాంగ్రెస్, ఎన్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు మాజీ ఎమ్మెల్యే యోగేష్ పాటిల్, ఎమ్మెల్యేలు ఆనంద్‌బాయి ఠాకూర్, ఇర్ఫాన్ బురే, మహాదేవ్ చౌగులే, సహాయ మంత్రి సతేజ్ పాటిల్, కాంగ్రెస్ ప్రతినిధి మహాదేవ్ శేలార్, వేలాదిమంది కార్యకర్తలు హాజరయ్యారు.
‘ఆహార భద్రత’ ఘనత మాదే
Published Wed, Mar 26 2014 10:49 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement