కర్ణాటకలో తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఘోర పరాభవం ఎదురైంది. నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుని కుదేలయింది.
బెంగళూరు: కర్ణాటకలో తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఘోర పరాభవం ఎదురైంది. నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుని కుదేలయింది. కర్ణాటకలో 'ఆప్'కు 2,54,501 ఓట్లు రాగా, నోటా(మాకెవ్వరూ వద్దు)కు 2,57,873 ఓట్లు వచ్చాయి. లక్షకు పైగా సభ్యులున్న బెంగళూరు నగరంలోనూ ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బెంగళూరులోని మూడు లోక్సభ నియోజకవర్గాల్లో కలిపి 89,379 ఓట్లు మాత్రమే సాధించింది.
కార్మిక నాయకుడు బాబూ మాథ్యూ, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ వి. బాలకృష్ణన్, బాలల హక్కుల నేత నైనా పి నాయక్... బెంగళూరులోని మూడు స్థానాల నుంచి ఆప్ తరపున పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. సెంట్రల్ బెంగళూరులో 39,869 ఓట్లతో బాలకృష్ణన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. తాము నిజాయితీగా ఎన్నికల ప్రచారం నిర్వహించామని, ప్రజలు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వానికి ఓటు వేశారని బాలకృష్ణన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో ప్రజలు బీజేపీ వైపు మొగ్గారని తెలిపారు.