వారసుల పోరు!
రాష్ట్ర రాజకీయాల్లో చేవెళ్ల పార్లమెంటు స్థానానికి ప్రత్యేకత ఉంది. ఒకవైపు ఆధునిక నగరం.. మరోవైపు గ్రామీణ ప్రాంతం. పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోని మూడింట్లో నగర వాతావరణం ప్రతిబింబిస్తుండగా.. మరో నాలుగింట్లో పల్లె సంస్కృతి సాక్షాత్కరిస్తుంది.
విభిన్న జీవనశైలులు, ఆలోచన ధోరణులు, అవసరాలు కలిగిన ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో విశ్లేషకుల అంచనాలకు కూడా అందడంలేదు. రాజకీయ చరిత్ర తక్కువే అయినా.. చేవెళ్లకు అరుదైన ఘనత దక్కింది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో చేవెళ్ల లోక్‌సభ స్థానం ఏర్పడింది. ఎన్నికలు జరిగిన తొలిసారే కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకుంది. తొలి ఎన్నికలో కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి విజయం సాధించారు. ఈసారి ఆయన సొంత జిల్లా పాలమూరులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం
బలాబలాలు: అనుకూలం
- కుటుంబానికి క్షేత్రస్థాయిలో పరిచయాలు
- ప్రధాన ప్రత్యర్థి టీడీపీ బలహీనపడడం
- తెలంగాణ ఇచ్చామనే సానుభూతి
- బలమైన సామాజిక వర్గం అండ
ప్రతికూలం
- కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు
- ప్రత్యర్థులు బలంగా ఉండడం
- పట్టణ ప్రాంత ఓటర్లలో ప్రతికూలత
- అవినీతి ఆరోపణలు
- సొంత పార్టీలోనే వైరివర్గం
అనుకూలం
- పార్టీ సంప్రదాయ ఓటింగ్, తండ్రి దేవేందర్‌గౌడ్‌కు ఉన్న విస్తృత పరిచయాలు
- కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత
- బీసీ ఓటర్లు అధికసంఖ్యలో ఉండడం
- పటణాల్లో బలంగా ఉన్న బీజేపీతో జతకట్టడం
ప్రతికూలం
- కీలక నేతలంతా పార్టీని వీడడం
- తమకు పట్టున్న ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ బలోపేతం కావడం
- బీజేపీ పొత్తుతో మైనార్టీ ఓటర్లకు దూరం
- తెలంగాణ వ్యతిరేక ముద్ర
అనుకూలం
- జిల్లాలో కొండా కుటుంబానికున్న ప్రాధాన్యం
- తెలంగాణ సెంటిమెంటు
- ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీలో చేరడం
- ఆర్థికంగా సంపన్నుడు కావడం
ప్రతికూలం
- సంస్థాగతంగా పార్టీ నిర్మాణం లేకపోవడం
- కేవలం తెలంగాణ సానుభూతినే నమ్ముకోవడం
- రాజకీయాలలో అనుభవలేమి
- సీమాంధ్ర ఓటర్లు అధికంగా ఉండడం
- తెలుగుపై పట్టులేకపోవడం, భావ వ్యక్తీకరణలో తడబాటు
నే.. గెలిస్తే
పట్లోళ కార్తీక్‌రెడ్డి(కాంగ్రెస్)
- గ్రామీణ పట్టణ ప్రాంతాలకు వేర్వేరు మేనిఫెస్టోలు అమలు చేస్తా
- మౌలిక వసతుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు పూర్తికి కృషి
- మారుమూల ప్రాంతాలను శివార్లకు ధీటుగా అభివృద్ధి చేస్తా
తూళ్ల వీరేందర్‌గౌడ్ (టీడీపీ)
- హైదరాబాద్‌లో ఉన్న జిల్లా కేంద్రాన్ని తరలిస్తా
- వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తా
- హైటెక్ సిటీ తరహాలో ఇతర ప్రాంతాల్లోను సాఫ్ట్‌వేర్ సంస్థలను రప్పిస్తా
- ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ, మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తా.
కొండా విశ్వేశ్వర్ రెడి(టీఆర్‌ఎస్)
- సాగునీరు-తాగునీరుకు మొదటి ప్రాధాన్యం
- గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు
- రైతులకు గిట్టుబాటు ధరలు, పంటల బీమా, సబ్సిడీపై ఎరువులు అందేలా చొరవ చూపుతా
- ప్రాంతీయ అసమానతలపై దృష్టి సారిస్తా
- జిల్లా అభివృద్ధికి అడ్డుగోడగా ఉన్న జీవో నెం 111 ఎత్తి వేసేందుకు కృషిచేస్తా.
కొండా రాఘవరెడ్డి (వైఎస్సార్ సిపి)
అనుకూలం
- జిల్లాకు సుపరిచితుడు కావడం
- వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు
- మైనార్టీల మద్దతు
- తెలంగాణేతరుల అండదండలు
- ఓటర్లను ఆకట్టుకోవడంలో దిట్ట
ప్రతికూలం
- ప్రత్యర్థులు ఆర్థికంగా స్థితిమంతులు కావడం
- జిల్లా బీడు భూములను సస్యశ్యామలం చేసే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు, చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టులకు పెద్ద పీట వేస్తా
- చేవెళ్ల, వికారాబాద్, తాండూరుకు మంజీరా.. రాజేంద్రనగర్, మహేశ్వరానికి కృష్ణాజలాలు అందేలా చర్యలు తీసుకుంటా
- బీజాపూర్-హైదరాబాద్ రహదారి విస్తరణకు కృషి చేస్తా
- మారుమూల నియోజకవర్గాల అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్‌ను వినియోగిస్తా
- ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తా
నియోజకవర్గం ఏర్పడింది : 2009
ప్రస్తుత ఎంపీ : సూదిని జైపాల్‌రెడ్డి (కాంగ్రెస్)
ప్రస్తుత రిజర్వేషన్ : జనరల్
నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలు:
చేవెళ్ల(ఎస్సీ), తాండూరు, పరిగి, వికారాబాద్ (ఎస్సీ), రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం
నియోజకవర్గ ప్రత్యేకతలు: దక్కన్ పీఠభూమిలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతం.
ఉద్యాన పంటలు, నాపరాతి
పరిశ్రమలు, ప్రపంచంలో అరుదైన సుద్దగనులకు ప్రసిద్ధి.
చిలుకూరు బాలాజీ దేవాలయం, అనంతగిరి కొండలు,
హైటెక్‌సిటీ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.
ప్రధాన అభ్యర్థులు వీరే
పట్లోళ కార్తీక్‌రెడ్డి (కాంగ్రెస్)
కొండా రాఘవరెడ్డి (వైఎస్సార్‌సీపీ)
తూళ్ల వీరేందర్‌గౌడ్ (టీడీపీ)
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (టీఆర్‌ఎస్)
మొత్తం ఓటర్లు : 20,56,731
పురుషులు 10,83,080
మహిళలు 9,73,104
ఇతరులు 547
డోకూరి వెంకటేశ్వర్ రెడ్డి: ఈ సారి లోక్‌సభ బరిలో నిలిచినవారంతా కొత్తవారే. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ప్రధాన పార్టీల అభ్యర్థులు నలుగురు రాజకీయ వారసులే. మాజీ హోంమంత్రులు సబితా ఇంద్రారెడ్డి, దేవేందర్‌గౌడ్ తనయులు కార్తీక్‌రెడ్డి(కాంగ్రెస్), వీరేందర్‌గౌడ్(టీడీపీ), మాజీ ఉప ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డి కుటుంబీకులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(టీఆర్‌ఎస్), కొండా రాఘవరెడ్డి(వైఎస్సార్‌సీపీ)ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు.
అంతుచిక్కని అంతరంగం
గత ఎన్నికల్లో ద్విముఖ పోటీ జరగ్గా .. ఈసారి మాత్రం చతుర్ముఖ పోటీ నెలకొంది. యువనేతల రాజకీయ ప్రవేశంతో టీడీపీ, కాంగ్రెస్‌లు నువ్వా నేనా! అన్నట్లు ప్రచారపర్వాన్ని కొనసాగిస్తుండగా, బడా వ్యాపార వేత్తను బరిలోకి దింపిన టీఆర్‌ఎస్ విజయం తమదేనని విశ్వసిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాపకిందనీరులా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ ప్రధా న పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ‘తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది తామే’నని కాంగ్రెస్ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి ప్రజల్లోకి వెళుతున్నారు. టీడీపీ, బీజేపీతో జతక ట్టినందువల్ల మైనార్టీలు తమవైపు మొగ్గుచూపుతారని ఆశిస్తున్నారు.
వలసలతో టీడీపీ నీరసం..
టీడీపీ మాత్రం పట్టణ ఓటర్లపై నమ్మకం పెట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ బలపడడం, తమ పార్టీలోని కీలక నేతలు కారెక్కిన నేపథ్యంలో ఆ పార్టీ ఇక్కడ బలహీనపడింది. గ్రామీణ సెగ్మెంట్ల కంటే అత్యధిక ఓట్లు ఉన్న శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మేహశ్వరం పట్టణాలపై దృష్టి పెడుతోంది. తన తండ్రి దేవేందర్‌గౌడ్‌కు జిల్లా ప్రజలతో ఉన్న సంబంధాలు కలిసివస్తాయని, గ్రామీణ నియోజకవర్గాల్లోనూ ఈ ప్రభావం ఉంటుందని వీరేందర్‌గౌడ్ విశ్వసిస్తున్నారు. బీజేపీతో పొత్తు, మోడీ హవా తమకు లాభిస్తాయని అంచనా వేస్తున్నారు. 2009లో ఇక్కడ బిజేపీకి లక్ష 30వేలు ఓట్లు వచ్చాయి. ఈసారి ఆ ఓట్లు తమ ఖాతాలో పడతాయని ఆశిస్తున్నారు.
పేదల ‘కొండ’త అండ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా రాఘవరెడ్డి ప్రచారంలో ముందున్నారు. మైనార్టీల సంక్షేమం, జిల్లా అభివృద్ధి వైఎస్ హయాంలోనే జరిగిందనే అంశా న్ని ప్రచారాస్త్రంగా మలుచుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్లా రు. ప్రతి పేద కుటుంబం వైఎస్ హయాంలో లబ్ధి పొందిందని, వారి ఆశీర్వచనాలే ‘కొండ’ంత అండ అని రాఘవరెడ్డి విశ్వసిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ఓటర్లకు భద్రతకు భరోసా కల్పించేది తమ పార్టీయేనని ఆయన చెబుతున్నారు. మూడు నియోజకవర్గాల్లో ప్రభావశీలంగా ఉన్న మైనార్టీ ఓటర్లు తమకు మద్దతుగా నిలుస్తారని వైఎస్సార్ సీపీ అంచనా వేస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీని కలవరపరుస్తోంది.
గులాబీ జోరు..
ఒకప్పుడు నామమాత్రంగా ఉన్న టీఆర్‌ఎస్..ప్రస్తుతం బలీయంగా తయారైంది. బడా వ్యాపారవేత్త, జస్టిస్ మాధవరెడ్డి కుమారుడు విశ్వేశ్వర్‌రెడ్డిని బరిలోకి దించడం ద్వారా ప్రత్యర్థి పార్టీలను కలవరపెడుతుంది. నాలుగు నెలల ముందే ప్రచారంలోకి దిగిన విశ్వేశ్వర్... టీడీపీ కీలక నేతలైన హరీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, రత్నం తదితరులను గులాబీ గూటికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి ఆ పార్టీ నడ్డి విరిచారు. దీంతో గ్రామీణ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పట్టుసాధించింది. గెలుపోటముల మీద ప్రభావం చూపే శివారు నియోజకవర్గాల్లో మాత్రం ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించ డంలేదు.
పోల్ పదనిసలు...రెండంచుల ‘కత్తి’
కత్తికి రెండు వైపులా పదునున్నట్లుగా ఈయనకు మాత్రం రెండు పార్టీల నుంచి బీ ఫారమ్‌లు దక్కాయి. టీఆర్‌ఎల్‌డీ ప్రకటించిన జాబితాలో కత్తి వెంకటస్వామిగౌడ్ పేరును ప్రకటించారు. తీరా అదే సమయానికి ఆయనను వరంగల్ జిల్లా నర్సంపేట కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆ పార్టీ ప్రకటించడంతో అందరూ నోరెళ్లబెట్టారు. టీజేఏసీలో, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన కత్తి వెంకటస్వామిగౌడ్ ఒక దశలో టీఆర్‌ఎస్ నుంచి వరంగల్ తూర్పు టికెట్ ఆశిస్తున్నట్లు వినిపించింది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో ముందు నర్సంపేట నుంచి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డికి స్థానం కల్పించారు. రాత్రికి రాత్రే మారిన సమీకరణల్లో దొంతిని తప్పించి కత్తి వెంకటస్వామిగౌడ్‌కు కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగానే బరిలో ఉన్నారు.
-న్యూస్‌లైన్,వరంగల్
ఇక్కడా.. అక్కడా కపిలవాయి...!
తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ (టీఆర్‌ఎల్‌డీ) తరపున మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ రెండు చోట్లా పోటీ చేస్తున్నారు. వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, నల్గొండ జిల్లా భువనగిరి పార్లమెంట్ స్థానంలోనూ అభ్యర్థిగా ఉన్నారు. ఇప్పటి వరకు భువనగిరి పార్లమెంట్ స్థానంలోని నియోజకవర్గాలపైనే గురి పెట్టారు. నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని సెగ్మెంట్లలో ప్రచారం చేశారు. వరంగల్ పశ్చిమ అసెంబ్లీ స్థానంలో ఆయన తరఫున పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు చోట్లా దిలీప్ కుమార్‌కు ఒకే గుర్తు కేటాయించడం విశేషం. పార్టీకి ఇక్కడ గుర్తు లేకపోవడంతో స్వతంత్రుల తరహాలోనే గుర్తును కేటాయించారు. భువనగిరి ఎంపీ స్థానంలో, వరంగల్ పశ్చిమ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఆయన బోరింగ్ గుర్తును కేటాయించారు.
-న్యూస్‌లైన్,హన్మకొండ
చీపురుకట్టలకు భలే గిరాకీ
వేసవి కాలంలో రంజన్లకు, వానాకాలంలో గొడుగులకు, చలికాలంలో స్వెటర్లకు గిరాకీ దొరికినట్లే ప్రస్తుత ఎన్నికల సీజన్‌లో చీపురు కట్టలకు గిరాకీ దొరుకుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల గుర్తు చీపురుకట్ట కావడంతో రోడ్డు వెంట కనిపిస్తోన్న చీపురు కట్టలన్నీ అమ్ముడుబోతున్నాయి. ఏలూరు ప్రాంతం నుంచి చీపురు కట్టలు తెచ్చి విక్రయిస్తున్నారు. ఎన్నికల పుణ్యమా అని ఎప్పుడూ లేని విధంగా కట్టలకు డిమాండ్ పెరిగింది. దీంతో విక్రయదారులు ఆనందిస్తున్నారు.
-న్యూస్‌లైన్, పెద్దపల్లి
దేవుడా... నీదే భారం!
ఒకవైపు ప్రచారానికి గడువు సమీపిస్తుండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగి దేవుడినే నమ్ముకున్నారు. ప్రచార పర్వంలో ఏ గ్రామానికి వెళ్ళినా ముందుగా ఆ గ్రామ దేవతను దర్శించుకోవడం..ముఖ్యమైన ప్రార్థనా స్థలాలుంటే అక్కడ ప్రత్యేక పూజలు చేయడం జరుగుతోంది. అందులో భాగంగానే వర్నీ మండలం మోస్రాలో గల రామాలయాన్ని ప్రముఖ నాయకులు దర్శించుకుంటున్నారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి మధు యాష్కీ, పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, బాన్సువాడ టీఆర్‌ఎస్ అభ్యర్థి పోచారం, కాసుల బాల్‌రాజ్‌తో పాటు జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కార్ దర్శించుకొన్నారు. అలాగే నామినేషన్ మొదలు, ప్రచారం వరకూ ముహూర్తాలపై ఆధారపడుతుండడంతో సిద్ధాంతులు కూడా బిజీగా ఉన్నారు.
-న్యూస్‌లైన్, బాన్సువాడ
జన తెలంగాణ...వైఎస్ పథకాలు కొనసాగాలి
వైఎస్ హయాంలో కొనసాగిన కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలోనూ అమలు చేయాలి. గ్రామాల్లో ఆర్‌ఎంపీల సేవలను వినియోగించుకోవాలి. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలివ్వాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నిర్మూలించాలి. అందరికీ బీమా సౌకర్యం కల్పించాలి.
-హెచ్.పి. లకో్ష్మజీ, బెక్కంగూడెం, మహబూబ్‌నగర్ జిల్లా
సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్లాలి
కొత్త రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే సరికొత్త ప్రణాళికలను రూపొందించాలి. ప్రతి జిల్లాకు ఒక కమిటీ ఏర్పాటు చేసి స్థానిక అవసరాలను గుర్తించాలి. వాటిని నెరవేర్చడానికి చర్యలు తీసుకోవాలి. వివిధ కారణాలవల్ల తెలంగాణ ప్రాంత విద్యార్థులు విద్యాపరంగా ఆశించిన ప్రతిభను కనబర్చడంలేదన్న అభిప్రాయం ఉంది. దేశంలోని మిగతా ప్రాంతాల వారితో పోటీపడే స్థాయిలో విద్యరంగాన్ని తీర్చిదిద్దాలి. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలి.
- కె. వెంకటరాజయ్య