ఉపసంహరణల ఘట్టం ముగిసింది. ‘రెబెల్స్’ను దారిలోకి తెచ్చేందుకు బరిలోని అభ్యర్థులు, ఆయా పార్టీల పెద్దలు చేసిన యత్నాలు పాక్షికంగానే ఫలించాయి. కొందరు ఇంకా పోరుకు సై అంటూ సత్తా చూపేందుకు సిద్ధపడుతున్నారు. మొత్తానికి ఒక ప్రధాన అంకం ముగిసి అంతా సమరానికి శంఖారావం చేసినట్లే. ఇక ‘సార్వత్రిక’ ప్రచార పర్వం కొత్త ఊపుతో నడవడమే తరువాయి. దీనికి అన్ని పక్షాల వారూ ఉత్సాహంగా కదులు తున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సాధారణ ఎన్నికల నామినేషన్ల పర్వానికి శనివారం నాటికి ఉపసంహరణ ప్రక్రియతో తెరపడింది. టికెట్లు ఆశించిన ఔత్సాహికులు పోటీలు పడి నామినేషన్లు దాఖలు చేయడంతో అన్ని పార్టీలు తలపట్టుకున్నాయి. టికెట్ దక్కించుకున్న నేతలు తిరుగుబాటుదారులను రంగం నుంచి తప్పించేందుకు నానా పాట్లు పడ్డారు. కొందరు బెట్టువీడి అధికారిక అభ్యర్థులకు మద్దతు పలికేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు చివరి నిముషంలో ఇతర పార్టీల తీర్థం పుచ్చుకున్నారు. ఇంకొందరు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచి సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.
పత్యర్థులెవరో తేలడంతో పార్టీలు, అభ్యర్థులు ప్రచార పర్వంలోకి దిగుతుండటంతో కీలక ఘట్టానికి తెరలేచింది. జిల్లాలోని రెండు లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాలకు శనివారంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో తొమ్మిది, నాగర్‌కర్నూలులో ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. 14 అసెంబ్లీ స్థానాల్లో 149 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా వీరిలో 73 మంది స్వతంత్రులే కావడం గమనార్హం.
మక్తల్, షాద్‌నగర్, నాగర్‌కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా 14 మంది వంతున పోటీ చేస్తున్నారు. కొడంగల్, జడ్చర్ల, దేవరకద్ర, అచ్చంపేట నియోజకవర్గాల్లో ఏడుగురు చొప్పున మాత్రమే బరిలో వున్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ 10, టీడీపీ ఎనిమిది, బీజేపీ ఆరు, సీపీఎం రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపాయి. బీఎస్పీ, ఆమ్ ఆద్మీ, పిరమిడ్ వంటి పార్టీ తరపున కూడా అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఫలించిన బుజ్జగింపులు
పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి బరిలోకి దిగిన తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించేందుకు పార్టీలు, నేతలు చేసిన ప్రయత్నాలు పాక్షికంగా ఫలితాన్ని ఇచ్చాయి. చాలా చోట్ల చివరి నిముషంలో తిరుగుబాటు అభ్యర్థులు తప్పుకునే క్రమంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పి.చంద్రశేఖర్ పోటీ నుంచి తప్పుకుని నేరుగా గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
నారాయణపేట సీటును టీడీపీకి కేటాయించడాన్ని నిరసిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండు రెడ్డి ఏకంగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.
జడ్చర్ల సీటు దక్కక పోవడంతో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌రెడ్డి బరి నుంచి తప్పుకుని టీఆర్‌ఎస్‌లో చేరారు.
కల్వకుర్తి టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జి బాలాజీ సింగ్, దేవరకద్ర నుంచి టీడీపీ నేత ఎగ్గని నర్సింహులు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
విశ్వేశ్వర్ (దేవరకద్ర), వీర్లపల్లి శంకర్ (షాద్‌నగర్), విష్ణువర్దన్ రెడ్డి (కొల్లాపూర్) బరి నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థులకు ఊరట దక్కింది.
టీఆర్‌ఎస్ నుంచి గోలి శ్రీనివాస్‌రెడ్డి, కరాటే రాజు (కల్వకుర్తి), విఠల్‌రావు (నారాయణపేట), పున్నంచంద్ లాహోటీ, నాగరాజు గౌడ్ (కొడంగల్) పోటీ నుంచి తప్పుకున్నారు.
బీజేపీ కార్యవర్గ సభ్యుడు కొండయ్య (మక్తల్) చివరి నిముషంలో ఉపసంహరించుకోవడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ టికెట్ దక్కక పోవడంతో తిరుగుబాటు జెండా ఎగురవేసిన సయ్యద్ ఇబ్రహీం మహబూబ్‌నగర్ లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు.
ఇక సమరమే!
Published Sun, Apr 13 2014 3:37 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement