కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు రెబెల్స్ భయం పట్టుకుంది. ప్రత్యర్థుల కంటే సొంతపార్టీలోని తిరుగుబాటు నేతలతోనే ప్రమాదమని ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ అన్ని పార్టీల్లోనూ టికెట్ దక్కని నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. స్వతంత్రులుగా బరిలో ఉంటామని నామినేషన్లు దాఖలు చేశారు. తాము గెలవకున్నా, పార్టీ అభ్యర్థిని ఓడించి టిక్కెట్ ఎంపిక తప్పని నిరూపించేందుకు కొంతమంది పోటీలో ఉంటున్నారు. నామినేషన్లపర్వం ముగియడంతో అన్ని పార్టీల్లోనూ రెబెల్స్ తెరపైకి వచ్చారు. ఇందు లో చాలా మటుకు తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉండేం దుకే మొగ్గుచూపుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో రెబెల్స్ బెడద తీవ్రం గా ఉంది. కోరుట్ల నుంచి టికెట్ తనకే ఖాయమని ధీమాతో ఉన్న మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు తనయుడు నర్సింగరావు అనూహ్యంగా కొమొరెడ్డి రామ్‌లుకు టికెట్ దక్కడంతో రెబెల్‌గా నామినేషన్ వేశారు. జూనియర్ జువ్వాడి పోటీతో కాంగ్రెస్ బెంబేలెత్తుతోంది. పెద్దపల్లిలో తనకంటూ సొంతవర్గాన్ని సృష్టించుకున్న మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి టికెట్ దక్కకపోవడంతో అనుచరవర్గంతో చర్చించి రెబెల్‌గా నామినేషన్ దాఖ లు చేశారు. పోటీలో ఉండాలని అనుచరవర్గం ఒత్తిడి తెస్తుండగా, ఒకటి రెండు రోజుల్లో గీట్ల నిర్ణయం ప్రకటించే అవకాశముంది. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు చేతి ధర్మయ్య మహాజన సోషలిస్టు పార్టీ తరపున నామినేషన్ వేశారు.
రామగుండం అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ, కౌశిక హరి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలిచారు. బుధవారం భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేసి పార్టీ అభ్యర్థికి సవాల్ విసిరారు. హుజూరాబాద్ టికెట్ ఆశించిన కాంగ్రెస్ నాయకులు పరిపాటి రవీందర్‌రెడ్డి, ప్యాట రమేశ్, పాడి కౌశిక్‌రెడ్డి, ఇనుగాల భీంరావు నామినేషన్లు వేశారు. ప్యాట రమేష్, కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వేయగా, పరిపాటి రవీందర్‌రావు, భీంరావు స్వతంత్రులుగా నామినేషన్ వేశారు. వేములవాడ నుంచి అల్లాడి రమేశ్ నామినేషన్ వేశారు. హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో న్యాయవాది వొంటెల రత్నాకర్ పోటీకి దిగారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలోనూ అదే పరిస్థితి. కాంగ్రెస్ టికెట్ ఖాయమని ప్రచారం జరిగిన గోమాస శ్రీనివాస్, వివేక్‌కు టికెట్ ఇవ్వడంతో రెబెల్‌గా బరిలో దిగారు.
టీఆర్‌ఎస్‌లో..
రామగుండం మాజీ ఇన్‌చార్జి కోరుకంటి చందర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. మంథని నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చందుపట్ల సునీల్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. చొప్పదండి నుంచి టీఆర్‌ఎస్ టిక్కెట్ కోసం ప్రయత్నించిన సుంకె రవిశంకర్ నామినేషన్ వేసినప్పటికి బీ-ఫారం అందచేయకపోతే ఆయన పోటీలో ఉండే అవకాశం లేదు.
పొసగని పొత్తులు
పొసగని పొత్తులు పెట్టుకున్న బీజేపీ, టీడీపీల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఒక పార్టీకి కేటాయించిన స్థానంలో మరో పార్టీ, ఒక్క పార్టీలోనే ఇద్దరు నామినేషన్లు వేసి, ఆయా పార్టీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. మానకొండూరు స్థానాన్ని టీడీపీకి కేటాయించగా, బీజేపీ టికెట్ ఆశించిన సీనియర్ నాయకుడు గడ్డం నాగరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీడీపీకి చెందిన ఎడ్ల వెంకటయ్య సైతం నామినేషన్ వేశారు. వేములవాడ సీటును బీజేపీకి కేటాయించగా, అంతకుముందే టీడీపీ నుంచి గండ్ర నళిని నామినేషన్ వేశారు. హుస్నాబాద్‌లో బీజేపీ రెబెల్‌గా దుబ్బాక విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్ వేశారు.
చొప్పదండి స్థానాన్ని టీడీపీకి కేటాయించగా బీజేపీ టికెట్ ఆశించిన లింగంపల్లి శంకరయ్య, టీడీపీ టికెట్ ఆశించిన మ్యాక లక్ష్మణ్ స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. ధర్మపురి బీజేపీకి ఇవ్వగా, టీడీపీ టికెట్ ఆశించిన రాజనర్సు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కోరుట్ల బీజేపీ టికెట్ ఆశించిన రఘు రెబెల్‌గా రంగంలోకి దిగారు. బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి కరీంనగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. రామగుండం టికెట్ ఆశించిన పార్టీ రాష్ట్ర నేత బల్మూరి వనిత, టికెట్ రామకృష్ణారెడ్డికి ఇవ్వడంతో తిరుగుబాటు చేశారు.
బుజ్జగింపులు షురూ..
పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి తిరుగుబావుటా ఎగురవేసిన నాయకులకు బుజ్జగింపులు మొదలయ్యాయి. రెబెల్స్ బరిలో ఉంటే తమ విజయం అసాధ్యమని భావిస్తున్న పార్టీలు నామినేటెడ్ పోస్టుల ఆశ చూపుతూ బుజ్జగిస్తున్నారు.
రెబెల్స్
Published Thu, Apr 10 2014 4:15 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM
Advertisement
Advertisement