మొదట 'చేయి' కామ్రేడ్లదే...!
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తుగా ఉన్న హస్తంను మొదటి సార్వతిక ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలకు కేటాయించారు. 1952లో కాంగ్రెస్ పార్టీది కాడెడ్ల గుర్తు. దీంతోనే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పోటీ చేసింది. హైదరాబాద్ సంస్థానం మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు కంకికొడవలి గుర్తుపై పోటీ చేశాయి. హైదరాబాద్ సంస్థానంలో నిషేధం ఉండటంతో ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) పేరిట ఎన్నికల్లో పోటీ చేశారు.
ఎన్నికల సంఘం పీడీఎఫ్ అభ్యర్థులకు హస్తం గుర్తును కేటాయించింది. 1957లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలకు కంకికొడవలి గుర్తే లభించింది. ఈ ఎన్నికల్లో హస్తం గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు. 1970లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోవడంతో ఇందిరాగాంధీ అభయహస్తం గుర్తును స్వీకరించారు. అప్పటి నుంచి అదే గుర్తును కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తోంది. తొలుత కమ్యూనిస్టులకు కేటాయించిన చెయ్యి గుర్తు కాలక్రమంలో కాంగ్రెస్కు శాశ్వత గుర్తుగా మిగిలింది.