కుతంత్రాలు
వైఎస్సార్ సీపీ నేతలపై తప్పుడు ఫిర్యాదులు
ఇళ్లు, కార్యాలయాల్లో ముమ్మర తనిఖీలు
ఏమీ దొరక్క వెనుదిరిగిన అధికారులు
టీడీపీ నేతలపై ఫిర్యాదులను పట్టించుకోని వైనం
సాక్షి, కాకినాడ :ఓటమి భయంతో తెలుగుతమ్ముళ్లు దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. ఏదో విధంగా విజయం దక్కించుకోవాలనుకొని అడ్డదారులు తొక్కుతున్నారు. కోట్లు కుమ్మరించి గంపగుత్తగా ఓట్లు దండుకుంటున్నారు. మద్యం ఏరులై పారిస్తున్నారు. ఇంత చేసినా వారిలో ఓటమి భయం వీడడడం లేదు. ప్రజాబలంతో విజయం వైపు దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ లక్ష్యంగా కుట్రలు..కుతంత్రాలకు పాల్పడుతున్నారు. ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై తప్పుడు కరపత్రాలను ముద్రించి పంపిణీ చేస్తున్నారు. వారు చేసే తప్పుడు ఫిర్యాదులపై తీవ్రంగా స్పందిస్తున్న అధికారులు వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. అయితే తెలుగుదేశం వారి అక్రమాలను చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల లక్ష్యంగా ఒక పక్క ఎన్నికల అధికారులు..మరొక పక్క ఇన్‌కంటాక్స్ అధికారులు సోమ, మంగళవారాల్లో విస్తృతంగా దాడులు చేశారు.
అయితే ఆ దాడుల్లో ఏమీ దొరక్కపోవడంతో వెనుదిరిగారు. ద్వారంపూడి చేతిలో గతంలో పరాజయం పాలైన వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) మరోసారి తన ఓటమి ఖాయమనే భయంతో ద్వారంపూడిని అప్రతిష్ట పాల్జేసేందుకు కరపత్రాలతో దుష్ర్పచారం చేస్తున్నారు. ద్వారంపూడి, ఆయన అనుచరుల కార్యాలయాలు, ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో సోదాలు చేస్తే భారీగా డబ్బు కట్టలు బయటపడతాయని తప్పుడు ఫిర్యాదులు చేశారు. దాంతో సోమవారం అర్ధరాత్రి నుంచి ద్వారంపూడికి చెందిన రాయల్ పార్క్ హోటల్‌తో పాటు ఆయన అనుచరుల ఇళ్లను ఎన్నికల అధికారులు విస్తృతంగా తనిఖీ చేశారు.మరొక పక్క కాకినాడ సిటీ మాజీ డిప్యూటీ మేయర్, పార్టీ నేత పసుపులేటి వెంకటలక్ష్మి, జగన్నాథపురానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు శివకుమార్ ఇళ్లల్లో ఎన్నికల అధికారులు సోమవారం అర్ధరాత్రి నుంచి తెల్లార్లు సోదాలు చేశారు.
ముమ్మిడివరం మండల పార్టీ కన్వీనర్ జగతా బాబ్జి కుమారుడు జగతా గంగాధర్ రావు(చంటి) కార్యాలయంలో ఇన్‌కంటాక్స్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. స్థానిక ‘దేశం’ నేతల ఫిర్యాదుతో శుక్రవారం అర్ధరాత్రి పలుమార్లు చంటి ఇంట్లో ఎన్నికల అధికారులు సోదాలు చేసినా ఏమీ దొరకలేదు. అయినప్పటికీ దేశం నేతల ఒత్తిళ్లతో విజయవాడ నుంచి వచ్చిన ఇన్‌కంటాక్స్ అధికారుల బృందం సోమవారం మధ్యాహ్నం నుంచి ముమ్మిడివరంలోని చంటి కార్యాలయంలో విస్తృతతనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కూడా సోదాలు జరిగాయి.
ఇదే మండలానికి చెందిన సినీ నిర్మాత ఆదిత్య శ్రీరామ్ సోదరుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు గాడిలంక ఉపసర్పంచ్ మామిడశెట్టి శ్రీనివాస్ ఇంట్లో కూడా ఎన్నికల అధికారులు సోదాలు చేశారు. తాళ్లరేవుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు కాదా గోవిందకుమార్ ఇంట్లో కూడా ఎన్నికల అధికారులు సోదాలు చేశారు. అయితే ఎక్కడా వారికి డబ్బు కానీ, మద్యం కానీ, ఏ ఇతర ప్రలోభాలకు సంబంధించిన ఆధారాలు కానీ దొరకలేదు. భారీ స్థాయిలో ఓట్ల కొనుగోలుకు కోట్లు కుమ్మరిస్తూ, మద్యం ఏరులై పారిస్తున్న ‘దేశం’ నేతల ఇళ్లపై మాత్రం జిల్లాలో ఎక్కడా దాడులు చేయలేదు. నాలుగు రోజులుగా కాకినాడ, ముమ్మిడివరం, రాజమండ్రి. అమలాపురం, రామచంద్రపురం తదితర నియోజక వర్గాల్లో టీడీపీ నేతలు ఓటుకు రూ.1000 వరకు పంపిణీ చేసినా అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరించారు. ‘దేశం’ నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా అంతిమ విజయం తమదేనని వైఎస్సార్‌సీపీ నేతలు ఢంకా బజాయించి చెబుతున్నారు.