పొత్తుల్లోనూ జిత్తులే..! | Fellowship trickery ..! | Sakshi
Sakshi News home page

పొత్తుల్లోనూ జిత్తులే..!

Published Mon, Apr 21 2014 1:34 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

పొత్తుల్లోనూ జిత్తులే..! - Sakshi

పొత్తుల్లోనూ జిత్తులే..!

భాగస్వాములకూ బాబు వెన్నుపోట్లు మిత్రులను మోసగించడంలో ఘనాపాఠి బీజేపీకి ముచ్చటగా మూడుసార్లు చుక్కలు  ఆ పార్టీ అభ్యర్థులు నెగ్గకుండా పలు కుట్రలు 1999లో, 2004లోనూ కమలనాథులకు షాక్  ఈసారి కూడా ముప్పుతిప్పలు పెట్టిన బాబు 2009లో టీఆర్‌ఎస్, లెఫ్ట్‌లకు ఇదే పరిస్థితి
 
 సీహెచ్ శ్రీనివాసరావు
 
నమ్ముకొన్న వారిని చివరకు నట్టేట ముంచడంలో చంద్రబాబు ఘనాపాఠి. మిత్రత్వమంటూనే మోసగించడంలో ఆయన అందెవేసిన చేయి. అప్పుడు... ఇప్పుడు... టీడీపీ అధ్యక్షునితో పొత్తు పెట్టుకున్న పార్టీలు ఎప్పుడూ నిండా మునుగుతూనే ఉన్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు తహతహలాడిన బాబు, చివరకు ఆ పొత్తును వీలైనంతగా అపహాస్యం పాలు చేశారు. నామినేషన్ల దాఖలు తుది గడువు ముగిసేదాకా అటు మిత్ర పక్షాన్ని, ఇటు సొంత పార్టీ నేతలను కూడా నానా అవస్థలకు గురి చేశారు. పొత్తును నవ్వులాటగా, హైడ్రామాగా మార్చి ఇరు పార్టీల నేతలనూ ఏమార్చారు. పొత్తులో భాగంగా సీమాంధ్రలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 15, 25 లోక్‌సభ స్థానాల్లో నాలుగింటిని బీజేపీకిచ్చేందుకు టీడీపీ అంగీకరించడం తెలిసిందే. కానీ పొత్తు పై ఎడతెగకుండా చర్చలు ‘సా.....గినా’ ఇరుపార్టీల మధ్య చివరి క్షణం దాకా అంతులేని గందరగోళమే, అస్పష్టతే! ఏ స్థానం ఎవరికన్న దానిపై లొల్లే లొల్లి. పొత్తుపై బాబు మడ త పేచీ పెడతారన్న బీజేపీ క్షేత్రస్థాయి నేతల అనుమానమే చివరికి నిజ మైంది. పొత్తు ధర్మాన్ని ఇలా పరిహసించడం బాబుకు కొత్తేమీ కాదు. 2004 బీజేపీతో అంటకాగినప్పుడూ, 2009లో టీఆర్‌ఎస్, వామపక్షాలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసినప్పుడూ ఆయన చేసింది అచ్చం ఇదే!

 ఎప్పుడూ అంతే

 1999 ఎన్నికల్లో బాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయి కరిష్మా, కార్గిల్ యుద్ధ విజయ ప్రభావ ఫలితంగా బీజే పీ గాలి వీస్తుండటంతో ఆ పార్టీతో జతకట్టారు. బీజేపీకి 24 అసెంబ్లీ స్థానాలు ఇచ్చి టీడీపీ 269 స్థానాల్లో పోటీ చేశారు. బీజేపీ అండతో బాబు 180 అసెంబ్లీ స్థానాలు, అంటే 70 శాతం సీట్లను కైవసం చేసుకున్నారు. కానీ బీజేపీ మాత్రం సగమే, అంటే 12 స్థానాలే గెలిచింది. బాబు వెన్నుపోటే ఇందుకు కారణమని బీజేపీ రాష్ట్ర నేతలు అప్పట్లో వాపోయారు. బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలిస్తే ఎక్కడ బలపడిపోతుందోనన్న భయంతో ఆ పార్టీ ఎదగకుండా చేసేందుకు బాబు తెరవెనుక మిత్రద్రోహానికి పాల్పడ్డారని, ఆ అభ్యర్థులు గెలవకుండా కుట్రపూరితంగా వ్యవహరించారని చెబుతారు. టీడీపీ శ్రేణులతో సహాయ నిరాకరణ చేయించి వారిని వెన్నుపోటు పొడిచారు. తమ అగ్రనేతల ఇమేజీని సొమ్ము చే సుకుని భారీగా లాభపడ్డ బాబు, తమను మాత్రం ఇలా వెన్నుపోటుతో వంచించారంటూ బీజేపీ నేతలు ఆక్రోశించారు.

 2004 ఓటమి నెపం బీజేపీపైకి

 1999 ఎన్నికల విజయమంతా తన ఘనతేనని అప్పట్లో బాబు గొప్పలు పోయారు. బాబు అపర చాణుక్యుడంటూ పచ్చ పత్రికలు కూడా యథాశక్తి ఆకాశానికెత్తేసి తరించాయి. కానీ 2004కు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ఆ ఎన్నికల్లో బాబు మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. దానికి 27 అసెంబ్లీ స్థానాలిచ్చి టీడీపీ 267 చోట్ల పోటీ చేసింది. బీజేపీ 2 సీట్లలో మాత్రమే గెలవగా, టీడీపీ కూడా 47 స్థానాలకు పరిమితమై మట్టికరిచింది. కనీసం బాబు నక్సలైట్ల దాడి బాధితుడన్న సానుభూతి కూడా పని చేయలేదంటే ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత ఎంతగా వెల్లువెత్తిందో   అర్థం చేసుకోవచ్చు! ఈ ఘోర పరాభవం పూర్తిగా స్వయంకృతమే అయినా, బీజేపీ వల్లే ఓడిపోయామంటూ విమర్శలు గుప్పించారు బాబు. పైగా బీజేపీ మతతత్వ పార్టీ అని, దానితో మరెప్పుడూ కలవబోమని ప్రకటించారు! అన్నట్టూ, ఆ ఎన్నికల్లో బీజేపీకి కేటాయించిన పలు స్థానాల్లో కూడా టీడీపీ నేతలను స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలో దించి వారిని ఓడించారు బాబు!!

 కొత్త పొత్తుల్లోనూ వెన్నుపోట్లే

 ఇక 2009 ఎన్నికలు వచ్చేసరికి బీజేపీని వదులుకుని కొత్త పొత్తులకు తెర తీశారు బాబు. వైఎస్ రాజశేఖరరెడ్డి నేతత్వంలో కాంగ్రెస్‌ను ఢీకొనడం సులువు కాదని గ్రహించి, ముందు నుంచే టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ సహా మరికొన్ని చిన్నాచితకా పార్టీలను మచ్చిక చేసుకుని మహాకూటమికి తెర తీశారు. కానీ ఆ కొత్త మిత్రులకు కూడా తనదైన మార్కు వెన్నుపోట్లను రుచి చూపిన ఘనుడు బాబు! టీఆర్‌ఎస్‌కు 40 అసెంబ్లీ, 9 లోక్‌సభ, సీపీఐకి 14 అసెంబ్లీ, ఒక లోక్‌సభ, సీపీఎంకు 18 అసెంబ్లీ, 2 లోక్‌సభ సీట్లిచ్చారు. కానీ పొత్తు ధర్మానికి తిలోదకాలిచ్చి, టీఆర్‌ఎస్‌కు ఇచ్చిన మూడు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ నేతలను బరిలో నిలిపారు. పైగా మహేశ్వరంలో తీగల కృష్ణారెడ్డి, మక్తల్‌లో కొత్తకోట దయాకర్‌రెడ్డిలను టీడీపీ బీఫారాలిచ్చి మరీ పోటీ చేయించిన చరిత్ర బాబుది! చివరికి మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై కూడా టీడీపీ అభ్యర్థిని దించేందుకు ప్రయత్నించారు. అంతేగాక చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి జితేందర్‌రెడ్డికి చివరి రోజు మధ్యాహ్నం బీ ఫారమిచ్చి నామినేషన్ వేయించేందుకు ప్రయత్నించారు. కానీ సమయం మించిపోవడంతో సాధ్యపడలేదు. ఇలా నమ్మిన ప్రతి ఒక్కరినీ మర్చిపోకుండా వెన్నుపోటు పొడవనిదే నిద్రపోని నాయకుడు బాబు!
 
నేడూ అంతే

 తాజాగా బీజేపీతో పొత్తులంటూ డ్రామా నడిపిన బాబు, చివరికి సీట్ల సంఖ్య కూడా ఖరారయ్యాక... బీజేపీ అభ్యర్థులు బాగా లేరంటూ మడతపేచీకి దిగడం టీడీపీ నేతలను కూడా ఆశ్చర్యపరిచింది. బీజేపీ ఏ స్థానాల్లో ఎవరిని నిలబెట్టాలో కూడా తానే నిర్ణయించాలన్నట్టుగా బాబు వ్యవహరించడం ఆ నేతలకు మింగుడు పడటం లేదు. పొత్తుల డ్రామాలు నడిపించి, చివరకు అందులోనూ గందరగోళం రేపి... చివరికి ఓటమికి బీజేపీయే కారణమని నిందించడానికే బాబు ఇలా చేస్తున్నారన్న అనుమానాలు బీజేపీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement