పొత్తుల్లోనే పోటు
* టీడీపీ కమలం చెవిలో పువ్వు
* మొదటిదెబ్బ రుచి చూపించిన బాబు
* ‘చంద్రబాబు’ ట్రీట్‌మెంట్‌తో బీజేపీ బెంబేలు
* తాను గెలవలేని సీట్లను అంటగట్టిన బాబు
* బీజేపీ బలంగా ఉన్న స్థానాలను నొక్కేసిన వైనం
గౌరీభట్ల నరసింహమూర్తి: రెండు కళ్లు... రెండు నాలుకలు... ఎదుటివారిని దెబ్బతీసేందుకు ఒకేసారి రెండు గోతులు తీసే ఆలోచనలు..... వెరసి కుడిఎడమల దగాతత్వం. అభిప్రాయాలు... ఆలోచనలు వేరే అయినా... ఎన్నికల్లో కలిసి సాగేందుకు ఏర్పాటు చేసుకునే పొత్తుకు కొన్ని సిద్ధాంతాలుంటాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇమిడి ఉంటుంది. కానీ... చంద్రబాబు ముందు ఇవన్నీ బలాదూర్. పబ్బం గడుపుకోవటానికే పొత్తు జపం చేసే నారా బాబు... ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పొత్తు భాగస్వామిని నిలువెల్లా దగా చేసేందుకు అస్సలు వెనకాడరు. ‘కార్గిల్’ బలాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు 2004లో బీజేపీతో పొత్తు పెట్టుకుని... ఆ వెంటనే అదే పార్టీని తిట్టిపోసిన చంద్రబాబు, ఇప్పుడు మోడీ ప్రభంజనం నుంచి లబ్ధి పొందేందుకు మళ్లీ అదే పార్టీ పంచన చేరారు. కానీ పొత్తుపొడుపులోనే బీజేపీకి వెన్నుపోటుతో స్వాగతం పలికిన ఘనాపాఠి బాబు. కిందపడ్డా తనదే పైచేయిగా ఉండాలని తపించే బాబు... తెలంగాణలో తన బలం తగ్గినా ఎలాగోలా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం కోసం బీజేపీని రెండు రకాలుగా దెబ్బ కొట్టారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది మొదలు తెలంగాణ బిల్లుపై చట్టసభల్లో చురుగ్గా వ్యవహరించడం ద్వారా ప్రజల్లో బలం పెంచుకున్నామని భావిస్తున్న కమలనాథులను దొంగదెబ్బ తీశారు. అందుకు ఆయన అమలు చేసిన ‘రెండంచెల’ వ్యూహాల్లో ఒకటి... తనకు ఏమాత్రం బలం లేని సీట్లను బీజేపీ అంటగట్టడం. రెండు... బీజేపీ బలంగా ఉన్న స్థానాలను తన ఖాతాలో వేసుకోవడం. బాబు దగాను ఆలస్యంగా గుర్తించిన కమలనాథులు ఇప్పుడు తీరిగ్గా లబోదిబోమంటున్నారు. పొత్తు చర్చల్లో పిడివాదంతో ప్రతిష్టంభన సృష్టించినబాబు... కమలనాథుల సహనాన్ని పరీక్షించి, తుదకు అదను చూసి దెబ్బ తీశారు.
ళీ నిజామాబాద్ జిల్లాలో కొంతకాలంగా కమలం బాగా బలపడుతూ వస్తోంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని కైవసం చేసుకున్న ఆ పార్టీ, ఈసారి నిజామాబాద్ లోక్‌సభ స్థానంతో పాటు జిల్లాలో కనీసం మూడు అసెంబ్లీ సీట్లు గెలిచేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకుంది. కానీ అక్కడ బీజేపీకి కేవలం రెండు అసెంబ్లీ సీట్లే కేటాయించడం ద్వారా ఆ ప్రయత్నాలపై బాబు నీళ్లు చల్లారు. నిజామాబాద్ ఎంపీ స్థానంలో తాము పోటీ చేస్తున్నందున దాని పరిధిలో ఎక్కువ అసెంబ్లీ స్థానాలివ్వాలని కోరినా ససేమిరా అన్నారు. విచిత్రమేంటంటే... తాజా పంచాయితీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో 583 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ పోటీ చేసింది కేవలం 336 చోట్లలోనే!
ళీ నల్లగొండ జిల్లాలో బీజేపీ కోరిన సీట్లలో టీడీపీ కేవలం రెండింటిని మాత్రమే కేటాయించింది. ఎక్కువ స్థానాలను బాబే కొట్టేశారు. ఇంతా చేసి జిల్లాలో 835 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ పోటీలో నిలిచింది కేవలం 567 చోట్లలోనే. బీజేపీ బాగా బలంగా ఉన్న సూర్యాపేట, పటాన్‌చెరు, నారాయణపేట, పెద్దపల్లి, మేడ్చల్, బోధన్ అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీకి ఇవ్వకుండా బాబు చివరి నిమిషంలో చక్రం తిప్పారు. వాటిల్లో తమ బలం ఎంతుందో పేర్కొంటూ పలు నివేదికలను కూడా మొదట్లోనే బాబు ముందు పెట్టింది బీజేపీ. తొలుత సానుకూలంగా ఉన్నట్టే వ్యవహరించిన బాబు తుది చర్చల రోజు అర్ధరాత్రి వేళ, వాటిని ఇచ్చేది లేదంటూ భీష్మించారు.
ళీ ఇక జంటనగరాల్లోని సికింద్రాబాద్, ఎల్‌బీనగర్, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల అసెంబ్లీ స్థానాలను బీజేపీకి కేటాయించేం దుకు తొలుత అంగీకరించిన బాబు... చివరి నిమిషంలో జాబితా నుంచి వాటిని తొలగించి, తాను గెలిచే అవకాశం లేని ఆంధోల్, గద్వాల, సిద్దిపేటలను అంటగట్టారు.
ళీ నగర శివారు (అర్బన్ రంగారెడ్డి)లో 14 కీలక అసెంబ్లీ నియోజకవర్గాలుంటే వాటిల్లో కేవలం ఉప్పల్, మల్కాజిగిరిలను మాత్రమే బీజపీ కి కేటాయించి, మిగతా 12 సీట్లనూ తన ఖాతాలో వేసుకున్నారు బాబు. వాటి బదులు రూరల్ రంగారెడ్డిలో టీడీపీ గెలిచే అవకాశం లేని పరిగి, వికారాబాద్‌లను బీజేపీకిచ్చారు!