
ఆదరించి అవకాశమివ్వండి.. ఐదేళ్లు సేవ చేస్తా..
మచిలీపట్నం : దివంగత మహానేత వైఎస్ తనను ఆశీర్వదించి జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ చేశారని, జననేత.. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనను గుర్తించి జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిత్వం ఇచ్చారని, ప్రజలు ఆదరించి అవకాశం ఇస్తే ఐదేళ్లపాటు శక్తివంచన లేకుండా సేవ చేస్తానని తాతినేని పద్మావతి అన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అభ్యర్థి పద్మావతి పామర్రు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేసేందుకు బుధవారం మచిలీపట్నం వచ్చారు.
బందరు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్త కేఆర్వీ విద్యాసాగర్ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. దివంగత నేత కుక్కల నాగేశ్వరరావు (కేఎన్నార్) చైర్మన్‌గా పనిచేసిన సమయంలో జెడ్పీ పాలకవర్గంలో తాను వైస్ చైర్‌పర్సన్‌గా కొనసాగిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.
వైఎస్ ఆశీస్సులు, కేఎన్నార్ సహకారంతో జెడ్పీలో తనవంతు కృషిచేసినట్లు చెప్పారు. పార్టీ జిల్లా నాయకులు, శ్రేణుల మద్దతుతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసేలా నూరు శాతం న్యాయం చేసేలా శ్రమిస్తానని అన్నారు.
మున్సిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు వైఎస్సార్‌సీపీకే ఉందని, రాష్ట్ర సమైక్యత కోసం రాజీలేని పోరాటం చేసిన వైఎస్సార్‌సీపీకే జనాదరణ ఉందని పద్మావతి స్పష్టం చేశారు. జిల్లాలోని 49 జెడ్పీటీసీ స్థానాల్లో అత్యధిక సీట్లు వైఎస్సార్‌సీపీ గెలుచుకోవడం తథ్యమని చెప్పారు.
మ్యానిఫెస్టోకి ప్రజాదరణ : విద్యాసాగర్
పార్టీ మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్త కేవీఆర్ విద్యాసాగర్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. వైఎస్ ఆశయాలను కొనసాగించేలా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన పార్టీ మ్యానిఫెస్టోకి ప్రజాదరణ లభిస్తోందన్నారు. ప్రస్తుతం జరిగే అన్ని ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ప్రజలు ఆదరించి గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పామర్రు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ చైర్‌పర్సన్ అభ్యర్థి పద్మావతిని తమ నియోజకవర్గంలోని తోట్లవల్లూరు మండల ఓటర్లు జెడ్పీటీసీగా గెలిపించుకుంటారని చెప్పారు.
వైఎస్‌పై ప్రజాభిమానం గెలిపిస్తుంది...
వైఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో జిల్లా వాసుల్లో ఉప్పొంగే అభిమానమే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తుందని పలువురు నేతలు ధీమా వ్యక్తం చేశారు. పద్మావతి నామినేషన్ కార్యక్రమానికి బందరు, విజయవాడ లోక్‌సభ నియోజకవర్గాల సమన్వయకర్తలు కేవీఆర్ విద్యాసాగర్, కోనేరు ప్రసాద్, గుడివాడ, మచిలీపట్నం, పామర్రు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు కొడాలి నాని, పేర్ని నాని, ఉప్పులేటి కల్పన హాజరయ్యారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ చైర్‌పర్సన్‌గా పద్మావతిని ప్రజలు, పార్టీ శ్రేణులు గెలిపిస్తారన్నారు.
ఏ ఎన్నికలైనా ప్రజలు ఫ్యాను గుర్తుకే ఓటేసి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ట్రిపుల్ ఐటీ, కృష్ణా యూనివర్సిటీ, పోర్టు మంజూరు చేసిన వైఎస్ డెల్టా ఆధునికీకరణ వంటి పనులతో జిల్లాను ప్రగతి బాటలో నడిపారన్నారు. వైఎస్‌పై అభిమానం, జగన్‌మోహన్‌రెడ్డిపై ఆదరణ ఉందనే సంగతి ఈ ఎన్నికలు నిరూపించనున్నాయని వారు తెలిపారు.