కాంగ్రెస్సే ధోకా పార్టీ
దొరలంతా ఆ పార్టీలోనే ఉన్నారు కేసీఆర్‌తోనే తెలంగాణ వచ్చింది: హరీశ్‌రావు
హైదరాబాద్: తెలంగాణను 60 ఏళ్ల నుంచి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మించిన ధోకాబాజీ పార్టీ మరొకటి లేదని టీఆర్‌ఎస్ నేత టి.హరీష్‌రావు విమర్శించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో వ్యతిరేకత ఉన్నా సమైక్య రాష్ట్రంలో కలిపిన నాటి నుంచి పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన, 1969లో 369 మందిని కాల్చిచంపడం, 11 మంది టీపీఎస్ ఎంపీలను కాంగ్రెస్‌లో విలీనం చేసుకుని, 2004లో ప్రత్యేక రాష్ట్రం ఇస్తానని 10 ఏళ్లు తాత్సారం చేయడం ఇలా .. కాంగ్రెస్ మోసాల చిట్టాకు అంతేలేదన్నారు. అంతేకాక 2009లో తెలంగాణ ప్రకటననుంచి వెనక్కుపోవడం, శ్రీకృష్ణ కమిటీ పేరుతో కాలయాపన.., 12వందల మంది విద్యార్థుల ఆత్మబలిదానానికి కారణమైన కాంగ్రెస్ పార్టీకి మించిన ధోకాబాజీ పార్టీ దేశంలోనే మరొకటి లేదన్నారు.
తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కూడా హైదరాబాద్‌కు వచ్చిన కేంద్రమంత్రి జైరాం రమేశ్ వ్యక్తిగతంగా సమైక్యవాదిని అని బహిరంగంగా చెప్పారని, అలాంటి సమైక్యవాది తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించుకుంటారా అని హరీష్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్‌ను దొర అని, టీఆర్‌ఎస్‌తో గడీల రాజ్యం వస్తుంది అని విమర్శిస్తున్న కాంగ్రెస్‌లోనే ఎక్కువమంది దొరలు ఉన్నారని హరీష్‌రావు దుయ్యబట్టారు. ఈ విషయంపై జైరాం రమేశ్‌కు అవగాహన లేనట్టుందని ఎద్దేవా చేశారు. దొరలను, దేశాయ్‌లను గెలిపించొద్దని కాంగ్రెస్ నేతలు అన్నట్టుగా ప్రజలు చేస్తే కాంగ్రెస్‌కు 10 సీట్లు కూడా రావన్నారు. జైరాం రమేశ్ ప్రసంగానికి కాంగ్రెస్ అభ్యర్థులే తలలు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సయయంలో అమెరికాకు పారిపోయిన టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉద్యమకారులు ఎవరో, ఉద్యమ ద్రోహులు ఎవరో పొన్నాల స్వంత గ్రామంలోనే తేల్చుకుందామని సవాల్ చేశారు.
ప్రజల మధ్య ఉంటూ కేసీఆర్ పోరాడినందువల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. టీఆర్‌ఎస్, కేసీఆర్ ఉద్యమంలో ఉంటూ ఇబ్బందులు పడుతుంటే, మంత్రి పదవులను అనుభవిస్తూ పొన్నాల, దామోదర రాజనరసింహ వంటివారు అవహేళనగా మాట్లాడిన విషయం ప్రజలకు గుర్తుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కుంభకోణాలకు పాల్పడిన చంద్రబాబు పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతున్నాడని హరీష్‌రావు ఈ సందర్భంగా మండిపడ్డారు. సీమాంధ్రలోనూ అధికారం రాకుంటే చంద్రబాబుకు పిచ్చి పట్టడం ఖాయమని, హైదరాబాద్‌లోని పిచ్చాసుపత్రిలో ఒక గదిని చంద్రబాబుకు కేటాయిస్తామని అన్నారు. జూన్ 2 తర్వాత ఏర్పాటు కాబోయే ప్రభుత్వం టీఆర్‌ఎస్‌దేనన్నారు. ఇదిలా ఉంటే మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత సుధాకర్‌రెడ్డి, హరీష్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
కోడ్ ఉల్లంఘిస్తున్న జానా: నోముల
నాగార్జునసాగర్‌లో ఓడిపోతాననే భయంతో మాజీమంత్రి జానారెడ్డి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య ఆరోపించారు. తండాల్లో రోడ్లు, అనుమతులు లేకుండా బోర్లు వేస్తున్నారని చెప్పారు. వీటిపై ప్రశ్నించిన టీఆర్‌ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెట్టారని ఆరోపించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలాంటి గిమ్మిక్కులకు పాల్పడుతున్నాడని నోముల విమర్శించారు.