కారుజోరుకు కళ్లెం వేసేదెలా? | how to control to trs party? | Sakshi
Sakshi News home page

కారుజోరుకు కళ్లెం వేసేదెలా?

Published Sat, Apr 26 2014 3:17 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కారుజోరుకు కళ్లెం వేసేదెలా? - Sakshi

కారుజోరుకు కళ్లెం వేసేదెలా?

కాంగ్రెస్‌ను వణికిస్తున్న ఓటమి భయం     మెజారిటీ స్థానాలు రావనే సంకేతాలు అందడంతో ఆందోళన
 
{పజలను ఆకర్షించేందుకు ఇతర హామీలు
కొత్త వివాదానికి తెరదీసిన ‘మహిళా సీఎం’
మొన్న జైరాం నోట దళిత సీఎం మాట
నేడు రాహుల్ మహిళా సీఎం మంత్రం

 
  హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకు మొదలైంది. తెలంగాణలో మెజారిటీ స్థానాలు రావనే భయం పట్టుకుంది. ఈ మేరకు వివిధ మార్గాల ద్వారా అందుతున్న సర్వేలు అదే విషయాన్ని స్పష్టం చేయడంతో పునరాలోచనలో పడింది.  దేశవ్యాప్తంగా ఎన్ని విమర్శలు ఎదురైనా, చివరకు సొంత పార్టీలో తీవ్ర సంక్షోభం ఏర్పడినా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు చేస్తుంటే దానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదనే సంకేతాలు కాంగ్రెస్ నేతలకు ఊపిరి సలపనీయడం లేదు. ఇలా జరిగితే దేశవ్యాప్తంగా తప్పుడు సంకేతాలు వెళతాయని భావించిన కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ ప్రజలను ఆకట్టుకునేందుకు కొత్త హామీలను జపిస్తున్నారు. బ్యాంకులకు బకాయి ఉన్న రూ. 2 లక్షలలోపు రైతు రుణాలను మాఫీ చేస్తామనే కొత్త పల్లవి అందుకున్నారు. ఈ విషయాన్ని వరంగల్ వేదికగా రాహుల్‌తో  చెప్పించారు. ఈ హామీ ఓట్లను కురిపిస్తుందని కాంగ్రెస్ నేతల ఆశ పడుతున్నారు.
 
నాడు కుదరదన్న వాళ్లే..నేడు హామీకి తెగబడ్డారు


 వాస్తవానికి కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఈ హామీ లేదు. ప్రదేశ్ ఎన్నికల హామీల కమిటీ సభ్యులు ఈ అంశంపై సుదీర్ఘంగా కసరత్తు చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్‌సింగ్,  కేంద్ర మంత్రి జైరాం రమేశ్, ఏఐసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ కొప్పుల రాజులు రుణమాఫీ సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అయితే ఏఐసీసీ పెద్దలెవరూ దీనిని మేనిఫెస్టోలో చేర్చేందుకు ఒప్పుకోలేదు. రైతు రుణాలను మాఫీ చేయాలంటే వేల కోట్లు అవసరమవుతాయని, అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. అయితే తెలంగాణ రైతులను ఆకట్టుకోవాలంటే ఏదో ఒక హామీని ఇవ్వక తప్పదని మేనిఫెస్టో కమిటీ సభ్యులు చెప్పడంతో పార్టీ అధికారంలోకొస్తే బ్యాంకు ఖాతా ఉన్న ఒక్కో రైతుకు రూ. 10 వేల నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించారు. ఆ అంశాన్నే మేనిఫెస్టోలో పొందుపర్చారు. కానీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ దూసుకుపోతుండటం, కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు దక్కేలా కన్పించకపోవడంతో హైకమాండ్ పెద్దల ఆలోచన మారింది. లక్ష రుణమాఫీ, రెండు బెడ్‌రూమ్‌ల ఇళ్ల నిర్మాణం వంటి అంశాలతో కేసీఆర్ ప్రజలను ఆకట్టుకుంటున్నందున కాంగ్రెస్ కూడా రుణమాఫీ అంశాన్ని ప్రస్తావించక తప్పదని నిర్ధారించారు. గురువారం రాత్రి దిగ్విజయ్‌సింగ్, వయలార్ రవి, జైరాం రమేశ్, కొప్పుల రాజు, కేబీ కృష్ణమూర్తి ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకుని సోనియా, రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారం ఉదయం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన జైరాం రమేశ్ తొలుత రైతులకు రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. ఆ వెంటనే రాహుల్‌గాంధీ వరంగల్ సభలో మాట్లాడుతూ ఇదే హామీని ప్రకటించారు. రాహుల్ తాజా హామీతో రూ. 2 లక్షల రుణమాఫీని అమలు చేస్తామని చెప్పాలా? లేక మేనిఫెస్టోలో పొందుపర్చినట్టు ప్రతి ఒక రైతుకు రూ. 10 వేల నగదు ప్రోత్సాహం అమలు చేస్తామని చెప్పాలా? లేక రెండు హామీలను అమలు చేస్తామని ప్రజల్లోకి వెళ్లాలా? అనే  దానిపై కాంగ్రెస్ పెద్దల్లో స్పష్టత లేకుండా పోయింది.

 ‘మహిళా సీఎం’ బాంబు... నైరాశ్యంలో సీనియర్లు

 ఇదిలాఉండగా, వరంగల్ సభలో రాహుల్‌గాంధీ ప్రస్తావించిన మహిళా సీఎం అంశం కాంగ్రెస్‌లో సంచలనం రేపుతోంది. తెలంగాణలో మహిళా సీఎంను చూడాలన్నదే తన కల అని, త్వరలోనే అది నెరవేరాలని ఆకాంక్షిస్తున్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేమిటనే అంశంపై పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో 119 సీట్లకు గాను 9 మంది మహిళలే కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్నారు. వారిలో డీకే అరుణ, గీతారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి మాత్రమే మంత్రులుగా పనిచేశారు. మిగిలిన వారిలో జయసుధ(సికింద్రాబాద్), కుంజా సత్యవతి(భద్రాచలం), మాలోతు కవిత(మహబూబాబాద్) ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎంపీగా ఉన్న విజయశాంతి ప్రస్తుతం మెదక్ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఇక ఎర్రబెల్లి స్వర్ణ, పద్మావతి ఉత్తమ్ (కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రె డ్డి సతీమణి) తొలిసారిగా అసెంబ్లీకి పోటీచేస్తున్నారు.  రాహుల్ నోట మహిళా సీఎం అనే మాట విన్పించడంతో వీళ్లలో ఎవరికి అవకాశం ఉంటుందా? అనే చర్చలు కొనసాగుతున్నాయి. ఒకవేళ జైరాం ఇచ్చిన దళిత సీఎం, రాహుల్‌గాంధీ చెప్పిన మహిళా సీఎం హామీని అమలు చేసినట్లయితే మాజీమంత్రి గీతారెడ్డే సీఎం రేసులో ముందుంటారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి కూడా సీఎం రేసులో ఉన్నారు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే సీఎం కావాలని డజను మంది కాంగ్రెస్ నాయకులు పావులు కదుపుతుంటే రాహుల్  వ్యాఖ్యలతో  వారు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు.
 
రాహుల్ నోట మహిళా సీఎం మాట వ్యూహాత్మకమా? లేక హైకమాండ్ ఆలోచనల్లో భాగమేనా? అనేది కూడా పార్టీలో చర్చనీయాంశమైంది. సరిగ్గా 20 రోజుల క్రితం కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తెలంగాణలో పర్యటిస్తూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే దళితుడినే తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా నియమిస్తామని ప్రకటించారు. జైరాం వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారాన్నే లేపాయి. ఇప్పుడు రాహుల్ తాజా వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు మళ్లీ  గందరగోళంలో పడ్డారు. కాగా, దళిత సామాజికవర్గ ఓట్లను కాంగ్రెస్‌వైపు తిప్పుకోవాలనే లక్ష్యంతోపాటు కేసీఆర్ ఈ విషయంలో మాట తప్పిన మనిషిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో జైరాం  ద్వారా హైకమాండ్  పెద్దలు దళిత సీఎం మాటలు అనిపించారని భావిస్తున్నారు. తాజాగా మహిళా ఓట్లను రాబట్టుకునేందుకే రాహుల్ నోట ‘మహిళా సీఎం’ అనే వ్యాఖ్యలు రావడం కూడా అందులో భాగమేనని పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement