సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్: పోలీసుల అవగాహన లోపం సామాన్యులకు శాపంగా మారింది. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో చిరువ్యాపారుల నుంచి మధ్య తరగతి ప్రజల వరకు.. కనీసం లక్ష రూపాయల లోపు డబ్బును తమ అవసరాల కోసం తీసుకెళ్లలేకపోతున్నారు. వివిధ వ్యాపారాల నిమిత్తం డబ్బులు తీసుకెళ్లడం సర్వసాధారణం. కానీ పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహం వల్ల వీరంతా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం 50వేల రూపాయలలోపు డబ్బును ఎవరు తీసుకెళ్లినా పట్టుకునేందుకు వీలు లేదు. రూ.2.50లక్షల వరకు ఎవరైనా డబ్బును తీసుకెళుతుంటే, అందుకు ఆధారాలు చూపడితే వదిలివేయాలి. సీజ్ చేయకూడదు.
రూ.2.50లక్షల కంటే ఎక్కువ డబ్బు రవాణా అయితేనే సీజ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ పత్రికాముఖంగా వెల్లడించారు. కానీ జిల్లాలో ఏర్పాటు చేసిన ఏ చెక్‌పోస్టు వద్ద కూడా ఈ విధంగా జరగడం లేదు. కనీసం రూ. 50 వేలు తీసుకెళుతున్నా వెంటనేసీజ్ చేస్తున్నారు. కాగా జిల్లావ్యాప్తంగా మొత్తం 26 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. జహీరాబాద్, నారాయణఖేడ్, కంగ్టి, మనూరు, పటాన్‌చెరు, రామచంద్రపురం, మెదక్, సిద్దిపేట, అందోల్, చేగుంట, రామాయంపేట, గజ్వేల్, ఒంటిమామిడి తదితర ప్రాంతాల్లో ఈ చెక్‌పోస్టులు ఉన్నాయి. అయితే ఈ చెక్‌పోస్టుల వద్ద అవగాహన కలిగిన పోలీసు అధికారులెవ్వరూ లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఎఎస్‌ఐ స్థాయి కంటే కింది స్థాయి సిబ్బంది మాత్రమే ఈ చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వాహనాల్లో డబ్బు కనిపించిన వెంటనే ఎంత డబ్బు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఆరా తీయకుండానే సీజ్ చేస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల్లో వినియోగించే డబ్బు అక్రమ మార్గం ద్వారా గమ్యస్థానాలకు చేరుతున్నప్పటికీ వ్యాపార నిమిత్తం తీసుకెళ్తున్న చిరు వ్యాపారులు, ఇతరులు మాత్రం ఇబ్బంది పడాల్సివస్తోంది. దీంతో వ్యాపార కొనుగోళ్ల కోసం కనీసం రూ.50వేలు వెంట తీసుకెళ్లాలన్నా జంకుతున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకుంటున్న డబ్బును తిరిగి తీసుకోవడానికి సామాన్యులకు సవాలక్ష నిబంధనలు ఎదురవుతున్నాయి. దీంతో తమ కష్టార్జితమైన డబ్బును తిరిగి సొంతం చేసుకునేందుకు వ్యాపారులు, సామాన్యులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
బాబోయ్ ఇవేం తనిఖీలు
Published Tue, Mar 25 2014 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM
Advertisement
Advertisement