మెజారిటీ హంగ్
- ఎనిమిది చోట్ల అనిశ్చితి
- కాంగ్రెస్, టీఆర్ఎస్లో ఉత్కంఠ
- ఇతరుల మద్దతే కీలకం
- నెంబర్ గేమ్‌కు పోటాపోటీ
పుర ఫలితాల్లో గులాబీ జెండా ఎగరేసింది. కానీ.. ఛైర్మన్లు, మేయర్ స్థానాలకు సరిపడేన్ని మెజారిటీ స్థానాలను దక్కించుకోలేకపోయింది.జమ్మికుంట, హుస్నాబాద్‌లో టీఆర్ఎస్, జగిత్యాలలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. జిల్లాలోని 11 పట్టణాల్లో మిగతా ఎనిమిది చోట్ల హంగ్ ఫలితాలు వెలువడ్డాయి. దీంతో వచ్చే నెలలో జరిగే ఛైర్మన్లు, మేయర్ స్థానాల ఎంపిక ఉత్కంఠ రేపనుంది.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మేయర్, చైర్మన్ సభ్యుల సంఖ్యా బలాబలాలపై జరిగేవి కావటంతో... అన్ని పార్టీలు ఇతరులు, స్వతంత్రుల మద్దతు కోసం ఎత్తుగడలు వేస్తున్నాయి. ఈ బలాబలాలు ఎవరికి మొగ్గు చూపితే... ఆ పార్టీ అక్కడి పుర పీఠాన్ని కైవశం చేసుకునే అవకాశముంది. అందుకే... రెండు పార్టీలు మరో నెల రోజులు బస్తీమే సవాల్‌కు కత్తులు దువ్వనున్నాయి. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇప్పటికే ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలకు సైతం ఓటుహక్కు ఉండటంతో జయాపజయాల మొగ్గు ఎటువైపు ఆసక్తి రేపుతోంది.
- కరీంనగర్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ అత్యధికంగా 24 స్థానాలను కైవశం చేసుకుంది. కాంగ్రెస్‌ను కేవలం 14 స్థానాలకు కట్టడి చేసింది. కానీ మేయర్ సీటును దక్కించుకునేందుకు మరో రెండు సీట్లు కావాల్సి ఉండటంతో.. తుది ఫలితానికి టీఆర్ఎస్ మళ్లీ శ్రమించాల్సిన పరిస్థితి నెలకొంది.
- రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ అత్తెసరు ఆధిక్యం ప్రదర్శించింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలను గెలుచుకోగా టీఆర్ఎస్ 14 డివిజన్లలో విజయం సాధించింది. ప్రధాన పార్టీలకు ధీటుగా ఇండిపెండెంట్లు 15 స్థానాల్లో సత్తా చాటుకున్నారు. దీంతో అక్కడ హంగ్ ఫలితం వెలువడింది. ఇండిపెండెంట్లు కీలకంగా మారటంతో రామగుండం మేయర్ పీఠం చివరి వరకు ఉత్కంఠ రేపనుంది.
- కోరుట్ల మున్సిపాలిటీలోని 31 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 13 చోట్ల గెలుపొందారు. 8 చోట్ల టీఆర్ఎస్, ఎంఐఎం 5, బీజేపీ 2, ఇండిపెండెంట్లు మూడు చోట్ల విజయం సాధించారు. ఇక్కడి ఛైర్మన్ పీఠాన్ని అందుకునేందుకు కాంగ్రెస్‌కు ఇతరుల మద్దతు కీలకంగా మారనుంది.
- సిరిసిల్ల మున్సిపాలిటీలోని 33 వార్డుల్లో 15 టీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ 10, బీజేపీ-3, టీడీపీ-1, ఇండిపెండెంట్లు 4 వార్డుల్లో విజయం సాధించారు. మరో ఇద్దరు సభ్యుల మద్దతు సాధిస్తే మున్సిపాలిటీ టీఆర్ఎస్ ఖాతాలో జమవుతుంది.
- మెట్‌పల్లిలోని మొత్తం 24 వార్డుల్లో సగానికి సగం 12 స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 9 వార్డులకే పరిమితమైంది. బీజేపీ ఒక చోట, ఇండిపెండెంట్లు రెండు చోట్ల విజయం సాధించారు. మేజిక్ ఫిగర్‌కు మరో సీటు అవసరం కావటంతో టీఆర్ఎస్ అక్కడి ఎమ్మెల్యే ఓటు.. లేదా ఇతరుల మద్దతు కీలకంగా మారనుంది.
- హుజూరాబాద్ నగర పంచాయతీలో టీఆర్ఎస్ 9 వార్డులు, కాంగ్రెస్ ఆరు వార్డులు గెలుచుకున్నాయి. బీజేపీ, టీడీపీలో చెరో సీటు, ఇండిపెండెంట్లు మూడు చోట్ల సత్తా చాటుకున్నారు. దీంతో ఇక్కడ ఇతరుల మద్దతు కీలకంగా మారనుంది.
- వేములవాడ నగర పంచాయతీలో బీజేపీ అత్యధికంగా తొమ్మిది వార్డులు గెలుచుకుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు చెరో మూడు వార్డులు గెలుచుకున్నాయి. మిగతా అయిదుగురు ఇండిపెండెంట్లు విజయం సాదించారు. వీరిలో ఇద్దరి మద్దతుతో బీజేపీ నగర పంచాయతీని కైవశం చేసుకునే అవకాశముంది.
- పెద్దపల్లి నగర పంచాయతీ టై అయింది. ఇక్కడి 20 వార్డు స్థానాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటాపోటీగా చెరో ఆరు సీట్లు గెలుచుకున్నాయి. టీడీపీ మూడు వార్డుల్లో, ఇండిపెండెంట్లు 3 చోట్ల సత్తా చాటుకున్నారు. ఒక చోట ఎంఐఎం, మరో చోట బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో ఇక్కడి ఫలితం రెండు పార్టీల మధ్య దోబూచులాడుతోంది.