హైదరాబాద్ తరహాలో అభివృద్ధి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు
మిర్యాలగూడ, న్యూస్‌లైన్ : టీడీపీ అధికారంలో వస్తే హైదరాబాద్ తరహాలో నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాలను అభివృద్ధి చేస్తామని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని మినీ రవీంద్రభారతి వద్ద నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలకు ఓట్లు వేస్తే బాంఛన్ దొర నీ కాల్మొక్తా అనే రోజులు మళ్లీ వస్తాయన్నారు.
టీడీపీ పేద, బడుగు బలహీన వర్గాల పార్టీ అని, జిల్లాలో నాలుగు సీట్లు బడుగు బలహీనవర్గాల వారికి కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని అన్నారు. హైదరాబాద్ తన హయాంలోనే అభివృద్ధి అయ్యిందని, అదే తరహాలో జిల్లాలోని పట్టణాలన్నీ అభివృద్ధి చేస్తానని అన్నారు. జిల్లాలో తాగు, సాగునీటి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా ఏకమై మిర్యాలగూడ అసెంబ్లీ బీసీ అభ్యర్థి బంటు వెంకటేశ్వర్లును, నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డిని గెలిపించాలని అన్నారు. అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలకు తమ్ముడిగా ఆదరిస్తే అభివృద్ది చేస్తానని అన్నారు.
స్థానికుడిగా అన్ని గ్రామాలకు తాగు, సాగునీరందిస్తానన్నా రు. సభలో నెల్లూరి దుర్గాప్రసాద్, బీజేపీ జిల్లా కార్యదర్శి బంటు సైదులు, ఎండీ యూసుఫ్, సాదినేని శ్రీని వాస్, రతన్‌సింగ్‌నాయక్, సైదిరెడ్డి, మంగ్యానాయక్, పెద్ది శ్రీనివాస్, ప్రసాద్, రాములుగౌడ్, జడ రాములు యాదవ్, జానీ, విద్యాసాగర్, మాన్యానాయక్, ఫహిమొద్దిన్, బోయపల్లి కృష్ణారెడ్డి, మాదగోని శ్రీనివాస్‌గౌడ్, కాశీనాథ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి చేయని గుత్తా : తేరా
ఎంపీగా ఉన్నా గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్లగొండను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని టీడీపీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి అన్నారు. ప్రజా సమస్యల గురించి ఏనాడు కూడా పార్లమెంట్‌లో ప్రస్తావించలేదని అన్నారు. ఐదేళ్ల కాలంలో నల్లగొండ ఒక ఇల్లు, మిర్యాలగూడలో ఒక ఇల్లు, ఆస్తులు కూడబెట్టుకున్నాడని అన్నారు.
నియోజకవర్గ ప్రజలను ఓటు అడిగే అర్హత కూడా గుత్తా సుఖేందర్‌రెడ్డికి లేదని అన్నారు. తాను పేదల అభివృద్ధి కోసం నిజాయితీగా పోరాడుతున్నానని, ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.