షర్మిల రోడ్‌షోలో ప్రసంగిస్తున్న గౌరు వెంకటరెడ్డి, చిత్రంలో ఎస్పీవెరైడ్డి, గౌరు చరితారెడ్డి తదితరులు
వైఎస్సార్సీపీతో అభివృద్ధి సాధ్యం
చంద్రబాబు పాలనను కోరుకోవద్దు
వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి
షర్మిల రోడ్‌షోలో గౌరు వెంకటరెడ్డి
కల్లూరు, న్యూస్‌లైన్: జననేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేద్దామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక చెన్నమ్మ సర్కిల్ వద్ద సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరు వెంకటరెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల రోడ్‌షో నిర్వహించారు.
ఈ సదర్భంగా గౌరు వెంకటరెడ్డితోపాటు ఆ పార్టీ నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ప్రసంగించారు. గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ... వైఎస్సార్ హయాంలో అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమైందన్నారు.
ఆ మహానేత ఆశయాలను సాధించేందుకు ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలిస్తే కరువు విలయతాండవం చేసిందని గుర్తుచేశారు.
వ్యవసాయం దండగన్న బాబు.. ఎన్నికల సమయంలో రైతులపై ఎనలేని ప్రేమ కురిపిస్తున్నారన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనను మళ్లీ కోరుకోవద్దని సూచించారు. ఎంపీ ఎస్పీ వై రెడ్డి మాట్లాడుతూ... రైతుల గురించి టీడీపీ అధినేత ఏనాడు పట్టించుకోలేదన్నారు.
అన్నదాతల సంక్షేమం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితోనే సాధ్యమని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రైతులకు పగటి పూట ఏడు గంటల ఉచిత విద్యుత్ నిరంతరాయంగా అందుతుందని, అలాగే ధరల స్థిరీకరణకు రూ. 3 వేల కోట్లతో నిధి ఏర్పాటు అవుతుందన్నారు.
ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే ఐదు సంతకాలతో రాష్ట్ర దిశను మార్చివేస్తారని గౌరు చరితారెడ్డి అన్నారు. అమ్మ ఒడి పథకం, డ్వాక్రా రుణాల మాఫీ.. మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని వివరించారు.
వైఎస్సార్సీపీతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తంరెడ్డి, మండల కన్వీనర్ చంద్రకళాదరరెడ్డి, కల్లూరు, ఓర్వకల్లు, గడివేముల, పాణ్యం మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.