జనభేరి సభకు హాజరైన అశేష జనం, (ఇన్‌సెట్‌లో) ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలంటున్న షర్మిల
షర్మిల రోడ్‌షో, జనభేరి సభలు సక్సెస్
నంద్యాల పార్లమెంట్ స్థానం పరిధిలో ప్రచారం
వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు
రాజన్న కుమార్తెకు అపూర్వ స్వాగతం
పోటెత్తిన జనం
‘ఫ్యాన్’ గాలి వీస్తోందనేందుకు ఈ జనమే సాక్షి. ఏ కూడలి చూసినా పోటెత్తిన అభిమానమే. ఆత్మీయత పంచుకునేందుకు రోడ్ల వెంట బారులు తీరిన ప్రజలు పూలవర్షం కురిపించారు. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి.. మహానేత కుమార్తె షర్మిల రాకతో నంద్యాల పార్లమెంట్‌లోని పల్లెలు జనసంద్రమయ్యాయి. జనభేరి సభలకు ఇసుకేస్తే రాలనంతగా హాజరైన అశేష ప్రజానీకం పార్టీ ప్రభంజనానికి అద్దంపట్టింది.
సాక్షి, కర్నూలు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా అభిమానం పోటెత్తింది. మహానేత కుమార్తె రాకతో జనం రోడ్ల వెంట బారులు తీరడం విశేషం.
బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు.. ఆత్మకూరు, నంద్యాలలో ఆమె సుడిగాలి పర్యటన చేపట్టారు. ఇక ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన జనభేరి సభలు జనసంద్రమయ్యాయి.వైఎస్‌ఆర్ అమర్‌హై.. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఉదయం 11.25 గంటలకు కల్లూరులోని చెన్నమ్మ సర్కిల్‌లో ప్రారంభమైన రోడ్‌షో నందికొట్కూరు, ఆత్మకూరు, వెలుగోలు మీదుగా నంద్యాలకు చేరింది.
దారిపొడవునా జనం ప్రచారరథానికి ఎదురొచ్చి పూల వర్షం కురిపించారు. నంద్యాలలో రాత్రి 9.20 గంటలకు రోడ్‌షో ముగించుకుని ఆమె పులివెందుల వెళ్లారు. తన ప్రసంగంలో వైఎస్‌ఆర్ హయాంలో సాధించిన ప్రగతి.. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను కళ్లకు కట్టారు.
అదేవిధంగా వైఎస్‌ఆర్ ఆశయ సాధనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వైఎస్ జగన్ ఎదురొడ్డి నిలిచి పోరాడుతున్న తీరును వివరించిన తీరు ప్రజలను ఆలోచింపజేసింది. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే మొట్టమొదటగా జగన్ చేయనున్న ఐదు సంతకాలు రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతాయన్నారు.
ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరిన ప్రతిసారీ ప్రజలు అంతే స్ఫూర్తితో మద్దతు తెలపడం విశేషం. కల్లూరులో పాణ్యం నియోజకవర్గ అభ్యర్థి గౌరు చరితారెడ్డిని.. నందికొట్కూరులో ఐజయ్య, ఆత్మకూరులో బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, నంద్యాలలో ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి భూమా నాగిరెడ్డిలను ప్రజలకు పరిచయం చేస్తూ.. కనీవినీ ఎరుగని మెజార్టీ కట్టబెట్టాలని పిలుపునిచ్చారు. నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి పట్టణ శివార్లలో షర్మిలకు ఘన స్వాగతం పలికారు. స్థానిక పొట్టి శ్రీరాములు సర్కిల్ ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసింది.
తన ప్రసంగంలో వైఎస్‌ఆర్, జగన్ పేర్లను ప్రస్తావించిన ప్రతిసారీ ప్రజలు జేజేలు పలికారు. పోటెత్తిన జనం నినాదాలతో హోరెత్తించిన తీరు ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బుట్టా రేణుక నందికొట్కూరు మండలంలో బ్రహ్మణకొట్కూరు వద్ద షర్మిలను కలిశారు.
పర్యటనలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి.. పాణ్యం, నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ అసెంబ్లీల అభ్యర్థులు గౌరు చరితారెడ్డి, ఐజయ్య, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి, కేంద్ర కార్యనిర్వాహక సభ్యుడు ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి, కర్నూలు పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడు హఫీజ్‌ఖాన్, నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, డాక్టర్ నౌమాన్, డాక్టర్ బాబన్, ఎన్.హెచ్ భాస్కరరెడ్డి, ఏవీఆర్ ప్రసాద్.. మాజీ కార్పొరేటర్లు తోట కృష్ణారెడ్డి, పెరుగు పురుషోత్తంరెడ్డి, టూరిజం శాఖ మాజీ డెరైక్టర్ తరిగోపుల భాస్కర్‌రెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు రాకేష్‌రెడ్డి, పర్ల శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.