పార్టీలకు స్వతంత్రుల తలనొప్పి
- 279 నామినేషన్లలో 114 మంది స్వతంత్రులు
- టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు సవాలు
- 9 నియోజకవర్గాల్లో ఒక్కో దానిలో 16 నుంచి 20 మంది పోటీ
- అదనంగా 4364 బ్యాలెట్ యూనిట్లు అవసరం
- ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి 2529 మాత్రమే
- అవసరమైతే పక్క జిల్లాల నుంచి రప్పించాలని అధికారుల యోచన
విశాఖ ఎంపీకి 15 మంది స్వతంత్రులు
నామినేషన్లు సక్రమంగా ఉన్న 279 మందిలో 114 మంది స్వతంత్రులే ఉండడం విశేషం. ప్రధానంగా విశాఖ లోక్‌సభ స్థానానికి 25 మంది నామినేషన్లు రాగా ఇందులో 15 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. యువకులు, మహిళలు సైతం రూ.25 వేలు చెల్లించి నామినేషన్ వేయడం గమనార్హం. అరకు ఎంపీ స్థానానికి 12 మందిలో ఏడుగురు స్వతంత్రులు ఉన్నారు. అనకాపల్లి ఎంపీకి మాత్రం 9 నామినేషన్లలో ఇద్దరు మాత్రమే ఇండిపెండెంట్లు ఉన్నారు.
అభ్యర్థులకు సవాలు
జిల్లాలో 9 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు రెబెల్స్ బెడద ఉంది. టికెట్లు ఆశించిన భంగపడిన వారందరూ రెబెల్స్‌గా నామినేషన్లు వేశారు. స్వతంత్రులుగా బరిలోకి దిగి పార్టీ నాయకులకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. దీంతో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఈ స్వతంత్రులను బుజ్జగించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని అభ్యర్థులతో పాటు పార్టీ అధినాయకులు రంగంలోకి దిగి నజరానాలు ఆశ చూపిస్తున్నా.. వీరు మాత్రం పంతం వీడడం లేదు. దీంతో వారిని దారికెలా తెచ్చుకోవాలో తెలియక టీడీపీ అభ్యర్థులకు కంటి మీద కునుకులేకుండాపోతోంది.