'విభజనకు రూట్ మ్యాప్ ఇచ్చింది కిరణే'
కడప: ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించినవారిలో వైఎస్ జగన్‌ను దేశంలో మూడోస్థానంలో నిలిపింది మీరేనని ప్రజలను ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మీకెప్పుడూ తమ కుటుంబం రుణపడి ఉంటుందన్నారు. కడప కృష్ణ సర్కిల్‌లో జరిగిన రోడ్ షోలో వైఎస్ విజయమ్మ ప్రసంగించారు. 70 లక్షల మంది ఓట్లను 15 మంది ఎమ్మెల్యేలను సోనియా వద్ద చిరంజీవి తాకట్టుపెట్టారని విమర్శించారు. ఇప్పుడు ఏం తాకట్టుపెట్టడానికి చిరంజీవి వస్తున్నాడని ప్రశ్నించారు. విభజనలో కేంద్రానికి రూట్ మ్యాప్ ఇచ్చింది కిరణే అని చెప్పారు. ఎన్జీవోల సమ్మెను నీరుగార్చింది కిరణ్నేనని చెప్పారు.
జనతా వస్త్రాలను రద్దు చేసి ఆప్కోలను చంద్రబాబు నిర్వీర్యం చేశారన్నారు. నేతన్నల ఆత్మహత్యలకు చంద్రబాబే కారణమన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు తానే కారణమంటున్నారు.. నమ్మేవారు ఉంటే హుస్సేన్ సాగర్ చార్మినార్ లను తానే కట్టించానంటారని ఎద్దేవా చేశారు.వైఎస్ఆర్ పథకాలను కూడా తానే ప్రవేశపెట్టానని చంద్రబాబు అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. తాగడానికి నీరు, తినడానికి తిండి లేక చంద్రబాబు పాలనలో ప్రజలు వలసలు వెళ్లారని గుర్తు చేశారు. ప్రజలు ఆకలికేకలతో అలమటిస్తుంటే సింగపూర్, మలేషియా టూర్లు తిరిగొచ్చారని చెప్పారు.
'మీ గుండెలోతుల్లోనే వైఎస్ఆర్‌ను చూసుకుంటున్నా. మమ్మల్ని మీ కుటుంబంలో చేర్చుకున్నందుకు కృతజ్ఞతలు. ప్రాణం ఉన్నంతవరకు మీ ప్రేమ మర్చిపోము' అని విజయమ్మ అన్నారు.