సాక్షి, హైదరాబాద్: మాజీ ఐఏఎస్ అధికారి, ఏఐసీసీ ఎస్సీసెల్ ఛైర్మన్ కొప్పుల రాజు అమలాపురం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగనున్నారా? ఇప్పుడు ఇదే అంశంపై ప్రచారం ఉంది. రాజును బరిలోకి దింపే అంశంపై పీసీసీ నాయకులతో ఏఐసీసీ ముఖ్యనేతలు ఇటీవల చర్చించినట్లు సమాచారం. అమలాపురం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన హర్షకుమార్ రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం నోటీసు ఇచ్చినందుకు బహిష్కృతులైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటుచేసిన జైసమైక్యాంధ్ర పార్టీలో చేరారు.
ఈ నేపథ్యంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ కోటరీలో ముఖ్యపాత్ర పోషిస్తున్న కొప్పుల రాజు పేరును పీసీసీకి చెందిన కొందరు నేతలు అధిష్టానం వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. రాజు రాష్ట్రంలో ఐఏఎస్ అధికారిగా కీలకమైన అనేక విభాగాల్లో సుదీర్ఘకాలం పనిచేసి మంచిపేరు సంపాదించి ఉన్నారని, కోస్తాంధ్ర జిల్లాలకు చెందిన వ్యక్తి అయినందున అమలాపురం నుంచి ఎంపీగా గట్టి పోటీ ఇవ్వగలుగుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. రాజు పోటీకి సుముఖత చూపని పక్షంలో ప్రత్యామ్నాయంగా మాజీ ఎంపీ బుచ్చిమహేశ్వరరావు పేరును పరిశీలనలోకి తీసుకోవచ్చని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
అమలాపురం నుంచి కొప్పుల రాజు!
Published Thu, Apr 10 2014 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM
Advertisement