టీఆర్‌ఎస్ కుటుంబ పార్టీ
* కేంద్ర మంత్రి జైరాం రమేష్
* తెలంగాణలో 4వేల మెగావాట్ల విద్యుత్ కర్మాగారం ఏర్పాటు చేస్తాం
* టీఆర్‌ఎస్ ఆవిర్భావానికి ముందే తెలంగాణ ఇస్తామని చెప్పాం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: టీఆర్‌ఎస్ కేసీఆర్ కుటుంబ పార్టీగా మారిందని, ఆయన తన నలుగురు కుటుంబ సభ్యులకు టికెట్లు ఇచ్చుకున్నారని కేంద్రమంత్రి జైరాం రమేష్ విమర్శించారు. టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావానికి ముందే కాంగ్రెస్, తెలంగాణ ఏర్పాటు దిశగా కార్యాచరణ ప్రారంభించిందని గుర్తుచేశారు. గురువారం నిర్మల్‌లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన అంతకుముందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం టీఆర్‌ఎస్ పార్లమెంట్‌లో ఏనాడూ ఉద్యమించలేదన్నారు. కాంగ్రెస్ ఎంపీలే శాంతియుతంగా ఉద్యమించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ పైనా విమర్శలు చేశారు. తెలంగాణ బిల్లుకు లోక్‌సభలో మద్దతిచ్చిన బీజేపీ, రాజ్యసభలో ఆ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. సీమాంధ్ర నాయకుల కనుసన్నల్లోనే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక జరిగిందనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ సీమాంధ్ర, తెలంగాణలు ఇండియా పాకిస్థాన్‌లు కావని వ్యాఖ్యానించారు.
20 జిల్లాలు చేస్తాం..
ఈ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తుందని, ఇక్కడ ప్రస్తుతమున్న పది జిల్లాలను 20కి పెంచుతామని అన్నారు. తెలంగాణలో 4వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక్కడి మారుమూల ప్రాంతాలను కూడా హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేస్తామన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించిన వారికి పదేళ్ల పాటు పన్ను మినహాయింపులు ఇస్తామని చెప్పారు.
సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృష్ణా, గోదావరి నదీ జలాల బోర్డును ఏర్పాటు చేసి, వివాదాలు తలెత్తకుండా చూస్తామన్నారు. ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, నిర్మాణానికి 90 శాతం నిధులను కేంద్రం నుంచి మంజూరు చేస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏయిర్‌పోర్టును ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అసంతృప్తి సర్దుకుంటుంది
టికెట్ల కేటాయింపులో భాగంగా పార్టీలో తలెత్తిన అసంతృప్తి సర్దుకుంటుందని, తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో దిగిన నాయకులు తమ నామినేషన్ల ఉపసంహరించుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అసంతృప్తులతో మాట్లాడుతామని అన్నారు. విలేకరుల సమావేశంలో ఏఐసీసీ ఎస్సీసెల్ విభాగం అధ్యక్షుడు కొప్పుల రాజు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి జి.వివేక్, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి నరేష్ జాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రేమ్‌సాగర్‌రావు, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఆత్రం సక్కు, భార్గవ్‌దేశ్‌పాండే, అనిల్ జాదవ్, విఠల్‌రెడ్డి, గడ్డం అరవింద్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రావు, పీసీసీ మాజీ చీఫ్ నర్సారెడ్డి పాల్గొన్నారు.