నందికొట్కూరులో గురువారం నామినేషన్ దాఖలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఐజయ్య
ఒకేరోజు 101 దాఖలు
మిగిలింది ఒక్కరోజే
టీడీపీకి రెబెల్స్ బెడద
వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా
నామినేషన్ వేసిన బుగ్గన, ఐజయ్య
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. ఒక్కరోజులోనే 85 మంది అభ్యర్థులు 101 నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం ఇప్పటివరకు రెండు పార్లమెంటు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 156 మంది అభ్యర్థులు 215 నామినేషన్ పత్రాలు సమర్పించారు. శుక్రవారం సెలవు కావడంతో శనివారం ఒక్కరోజే మిగిలి ఉంది. గురువారం కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బుట్టా రేణుక మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు.
నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ తరఫున ఎస్.పి.వై.రెడ్డి మరో సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. కర్నూలు పార్లమెంటు స్థానానికి తెలుగుదేశం అభ్యర్థిగా బి.టి.నాయుడు నామినేషన్ వేయగా, మాజీ మంత్రి కె.ఇ.ప్రభాకర్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కె.ఇ.ప్రభాకర్ తెలుగుదేశం అభ్యర్థిగా ఒక సెట్, ఇండిపెండెంట్‌గా మరో సెట్ నామినేషన్లు వేశారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం నుంచి 8 మంది, కర్నూలు పార్లమెంటు నుంచి ఏడుగురు ఒకే రోజు నామినేషన్లు వేశారు.
పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా పలువురు మరో సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా శోభా నాగిరెడ్డి, శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, నందికొట్కూరు నుంచి వై.ఐజయ్య, పాణ్యం నుంచి గౌరు చరితారెడ్డి, నంద్యాల నుంచి భూమా నాగిరెడ్డి, డోన్ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పత్తికొండ నుంచి కోట్ల హరిచక్రపాణిరెడ్డి, మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి, ఆదోని నుంచి వై.సాయిప్రతాప్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.
అయితే అందరూ నిరాడంబరంగా నామినేషన్లు వేయడం విశేషం. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి సీపీఎం అభ్యర్థిగా ఎం.ఎ.గఫూర్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా తమ్మడపల్లి విక్టర్ నామినేషన్ వేయడం గమనార్హం. నామినేషన్ల పర్వం శనివారంతో పూర్తికానుండడంతో ప్రచారం ఊపందుకోనుంది.