సత్తుపల్లి, న్యూస్‌లైన్: సత్తుపల్లి నగరపంచాయతీలో ఏ వార్డులో చూసినా కొత్త ముఖాలే తారసపడుతున్నాయి. కొత్తవ్యక్తులను చూసి ఎవరో అర్థంకాక ఓటర్లు తలపట్టుకుంటున్నారు. ఆయా పార్టీల తరఫున నగర పంచాయతీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న వారంతా.. నిత్యం వా ర్డుల్లో తిరుగుతూ ఎన్నికల ఫలితాలు, విశ్లేషణ పై ఆరా తీస్తున్నారు. నలుగురు ఉన్న చోటకు వ చ్చి పరిస్థితి ఎలా ఉందంటూ మొదలుపెట్టి ‘ఎవరు గెలుస్తారేంటి..! మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు..! అతనికే ఎందుకు వేయాలనుకుంటున్నారు..’ అని రకరకాల ప్రశ్నలు సంధిస్తూ సమాధానాలు రాబడుతున్నారు.
సేకరించిన సమాచారాన్ని పార్టీ నా యకులకు చేరేవేసే పనిలో వీరు బిజీగా ఉన్నా రు. ప్రధాన పార్టీలు సత్తుపల్లిలో వార్డుల వారీ గా ఇన్‌చార్జ్‌లను నియమించి సొంతపార్టీ, ప్రత్యర్థి పార్టీల ప్రచార సరళి గమనించే పనిలో పడ్డాయి. ఈ ఇన్‌చార్జ్‌లు ప్రతిరోజు వార్డుకు సంబంధించిన సమాచారాన్ని పార్టీ ముఖ్యనాయకులకు చేరవేస్తారు. ఈ విధంగా రెండు, మూడు నిఘా బృందాలు వార్డుల్లో రహస్యంగా పని చేస్తున్నాయి. ఒక కమిటీ ఇచ్చిన సమాచారాన్ని, మరో కమిటీ ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించుకుంటూ విజయావశాలపై పార్టీ ము ఖ్య నాయకులు వ్యూహ రచనలో పడ్డారు. సత్తుపల్లి నగరపంచాయతీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకుల ను నియమించారు. ఆయాపార్టీల ఇన్‌చార్జ్‌లతో వార్డులన్నీ ఎన్నికల కళ సంతరించుకున్నాయి.
ఎన్నికల చుట్టరికం...
ఎన్నికలు పాత చుట్టరికాలను మళ్లీ గుర్తుకు తెస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థి, వారి తరఫున ప్రచారం చేసేవారు బాబాయ్, పిన్ని, మామయ్య, అత్తమ్మ.. బాగున్నారా..!. తమ్ముడు ఏం చేస్తున్నాడు.. నాన్న ఆరోగ్యం ఎలా ఉంది..అని వరసలు పెట్టి పిలుస్తూ చుట్టరికాలు కలుపుకుంటున్నారు. ఎక్కడలేని ఆప్యాయతలు కురిపిస్తున్నారు. ఎవరు చెబితే ఏ కుటుంబం ఓటు వేస్తుందో గుర్తించి ఆ వ్యక్తులతో ఒత్తిడి చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇన్ని రోజులు గుర్తుకు రాని చుట్టరికం, వరసలు తెగ కలిపేసుకుంటున్నారు. ఇదంతా చూసి స్థానికులు లోలోన నవ్వుకుంటున్నారు.
ఇన్‌చార్జ్‌లే కీలకం
ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ ఇన్‌చార్జ్‌ల చేతుల మీదుగానే జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఇన్‌చార్జ్‌లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. పంపిణీలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఆయా పార్టీల వారు తమకు నమ్మకస్తులైన ఇన్‌చార్జ్‌లను వార్డుల వారీగా నియమించినట్లు సమాచారం.
పోస్టల్ బ్యాలెట్ గురించి...
వైరా, న్యూస్‌లైన్: ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఒక్కోసారి అభ్యర్థి గెలుపోటములను ఇవి ప్రభావితం చేస్తాయి. ఇంతటి ముఖ్యమైన పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునేది ఎవరు..? ఎలా పొందాలో.. ? తెలుసుకోండి. ఆర్మీ, నేవీలో పని చేసే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకోవచ్చు. ముందుగా ఆ ఉద్యోగులు సంబంధిత ఎన్నికల అధికారి లేక రిటర్నింగ్ అధికారికి పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
అందుకోసం వారు కనీసం పది రోజులు ముందుగా ఓటరు పేరు, చిరునామా, ఓటరు జాబితాలో వరుస సంఖ్య తదితర వివరాలు పొందుపరుస్తూ ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. ఇలా పంపిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు ఆ ఉద్యోగికి పోస్టల్ సర్వీస్ ద్వారా బ్యాలెట్ పేపర్‌ను అందజేస్తారు.
పోస్టల్ బ్యాలెట్ పేపర్‌లో తనకు న చ్చిన అభ్యర్థి పేరు లేదా అభ్యర్థికి కేటాయించిన గుర్తుపై పెన్నుతో టిక్ మార్కు చేస్తే సరిపోతుంది. తర్వాత ఆ ఉద్యోగి పోస్టు ద్వారా ఎన్నికల అధికారికి దానిని పంపించాలి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతనే ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు.
సిరా చుక్కతో చిక్కు..
వరుస ఎన్నికలతో ఓటర్లకు కొత్త సమస్య ఎదురు కానుంది. అదేమిటనుకుం టున్నారా..? సిరా చుక్క. సిరా చుక్కేమిటి.. దాంతో సమస్యేమిటనుకుంటున్నారా..? రానున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి ఒక్కరికీ ఎడమచేతి చూపుడు వేలుపై సిరా రాస్తారు. ఆ చుక్క సుమారు రెండు నెలల వరకు చెరిగిపోదు. కానీ రాష్ట్రం లో ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసినవారు ఆ తర్వాత కొద్ది రోజుల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఓటు వేయాలి.
ఇక్కడే అసలు సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది.
గత ఎన్నికలకు సంబంధించి సిరా మరక ఇంకా పోకుంటే ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లినప్పుడు ఏజెంట్ల నుంచి, అధికారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. వారు ఈఎన్నికల్లో ఓటు వేశారా..? లేదా..? అనేది తెలియడం కష్టంగా మారుతుంది. ఎన్నికల సంఘం మాత్రం ప్రత్యామ్నాయంగా మరో వేలుకు చుక్క పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ విషయంపై అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించకుంటే మాత్రం ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ సమస్యను అధికారులు ఎలా అధిగమిస్తారో.. చూడాలి.
ఇన్‘చార్జ్’
Published Wed, Mar 19 2014 2:50 AM | Last Updated on Fri, Aug 17 2018 7:42 PM
Advertisement