ప్రచారం ఆపేద్దాం.. నోట్లు విసిరేద్దాం
సాక్షి, ఏలూరు:‘ఎన్నేళ్లు అధికారంలో ఉన్నా ప్రజలకు ఏమీ చేయక్కర్లేదు. వారి కష్టాలు పట్టించుకోవాల్సిన పని లేదు. వారి కన్నీళ్లు తుడవక్కర్లేదు. నోట్లు విసిరేస్తే ఓట్లు పడిపోతాయి’ టీడీపీ అభ్యర్థులకు ఆ పార్టీ పెద్దలు చేస్తున్న హితబోధ ఇది. తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి కూడా ప్రజలకేమీ చేయకపోయినా.. కొందరికే మేలు చేకూర్చి సామాన్యుల నడ్డివిరి చినా.. ఇప్పుడు హామీలు గుప్పిస్తే జనం అవన్నీ మర్చిపోతారని భావిస్తున్న ఆ పార్టీ అధినేతనే ఆదర్శంగా తీసుకోమంటున్నారు. ప్రచా రం మాట పక్కనపెట్టి పంపకాలకు మార్గాలను అన్వేషించమని సూచనలిస్తున్నారు.
ఆదరణ లేదని తెలిసి...
పార్లమెంటరీ, అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల ప్రచారానికి జిల్లాలో ఆదరణ లభించడం లేదు. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రచారానికి డబ్బు ఖర్చుచేయడం దండగని ఆ పార్టీ భావిస్తోంది. ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగితే జనం ఛీకొడుతుండటంతో ప్రచారం చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇందుకయ్యే ఖర్చును మిగుల్చుకుని ఓటర్లకు పంచిపెట్టాలని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో జనాభిమానంతో కాకుండా డబ్బుతోనే ఓట్లు రాబట్టాలని నిర్ణరుుంచుకున్నారు. ఇందుకోసం సొమ్ములు కూడగట్టుకునే పనిలో ఆ పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. పంపకాలకూ కొత్త పద్ధతులు కనుగొంటున్నారు.
ప్రలోభాలపైనే నమ్మకం
‘ఎన్నికల్లో గెలవడం కోసం ఆస్తులు అమ్మేయండి. పార్టీ కోసం పొలాలు తాకట్టు పెట్టండి’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాకు వచ్చినప్పుడల్లా పార్టీ నేతలకు నూరిపోశారు. ఏదో ఒకటి చేయకపోతే ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకోవడం అసాధ్యమనే భయాన్ని ఓ సామాజిక వర్గంలో ఆయన సృష్టించారు. ఇప్పుడు అభ్యర్థులందరికీ ఆ పార్టీ పెద్దలు అదే చెబుతున్నారు. జనంలోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తామనే నమ్మకాన్ని కలిగించడంలో విఫలమవుతున్న అభ్యర్థులు ప్రచారంపై ఆశలు వదులుకుంటున్నారు. ప్రలోభాలపైనే నమ్మకం పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారానికి ఉపయోగించే వాహనాల దగ్గర్నుంచి, వెంటతిరిగే కార్యకర్తల వరకూ సంఖ్య తగ్గించుకుంటున్నారు. కొంద రైతే ప్రచారం ఖర్చు పూర్తిగా స్థానిక నేతలు, యువకులపైనే పడేస్తున్నారు. తమ జేబులోంచి ఒక్క రూపాయి తీయడానికి కూడా ఇష్టపడటం లేదు. ఇలా ఆదా చేసిన డబ్బును పోలింగ్‌కు ముందు ఓటర్లకు పంచేందుకు ఉపయోగించాలనుకుంటున్నారు.
మరోవైపు ఓటర్లకు డబ్బులు పంచడానికి కూడా పార్టీ నాయకులు కొత్త పద్ధతులు ఆలోచిస్తున్నారు. నేరుగా సొమ్ము, బహుమతులు పంచి గత ఎన్నికల్లో కొన్నిచోట్ల అధికారులకు దొరికిపోయారు. ఈసారి అలాకాకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారు. దీనికోసం తమకు అనుకూలంగా ఉన్న వ్యాపారస్తులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఆ పార్టీలో పెద్దాయన ఒకరు ఈ వ్యవహారాలను చూసుకుంటున్నారు. హైదరాబాద్‌లో తనకున్న పరిచయాలను దీనికోసం ఉపయోగించుకుంటున్నారు.
వ్యాపార సంస్థల నిర్వాహకులకు నగదు పంపిణీ చేస్తున్నారు. కొందరికి నోటి మాటగా ఒప్పందం చేసుకుని పోలింగ్ ముగిశాక నగదు చెల్లిస్తామంటున్నారు. వ్యాపారులు చేయాల్సిందల్లా పోలింగ్ ముందు ఓటర్లకు తమ వస్తువులు ఉచితంగా అందజేయడమే. చూసేవారికి ఇది కేవలం వ్యాపారంలా కనిపిస్తుంది. తెరవెనుక ప్రలోభాల పర్వం నడుస్తుంటుంది. ఇలా చేస్తే ప్రజలు తమను గెలిపిస్తారనే భ్రమల్లో ఇలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత ఉన్న నేతనే విజయం వరిస్తుందనే వాస్తవాన్ని తెలుసుకునే రోజు తొందరలోనే వస్తుందని ప్రజలు అంటున్నారు.