విందు.. మందు..
సాక్షి ప్రతినిధి, గుంటూరు :జనబలంతో నెగ్గలేని తెలుగుదేశం పార్టీ అక్రమాలకు తెరతీసింది. ధనబలంతోనైనా లొంగదీసుకునేందుకు చీకటి రాజకీయాలు మొదలెట్టింది. కార్పొరేట్ ఆశీస్సులు మెండుగా ఉన్న ఈ పార్టీకి డబ్బుకు కొదవలేకపోవడంతో రాబోయే ఎన్నికల్లో ప్రలోభాలకు పాల్పడుతోంది. ఇప్పటికే పోస్టల్‌బ్యాలెట్ల కొనుగోలులో తలమునకలైన ఆ పార్టీ నాయకులు రాబోయే పది రోజుల్లో ప్రచారం కన్నా ప్రలోభాలకే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అవకాశం ఉన్న మేరకు విందులతో ఆకట్టుకోవాలని... అవసరమైన చోట్ల కరెన్సీ వెదజల్లాలని అధిష్టానం ఆలోచనగా ఉన్నట్టు దిగువస్థాయిలో చర్చజరుగుతోంది. మొదటి నుంచీ పార్టీని పెంచి పోషిస్తున్న కార్పొరేట్ వ్యవస్థలే ఈ ఎన్నికల్లోనూ ఆలంబనగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది.
పోస్టల్ బ్యాలెట్లతోనే శ్రీకారం..
జిల్లాలో పోస్టల్‌బ్యాలెట్లను తమవశం చేసుకునేందుకు ఆ పార్టీ నాయకులు విఫలయత్నమే చేశారు. దీనికి పాల్పడిన పలువురు నిఘా అధికారుల చేతికి చిక్కారు. నరసరావుపేటలో ప్రభుత్వోద్యోగులను తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని కోరుతూ డబ్బు పంపిణీ చేయబోతున్న ఓ ఉపాధ్యాయుడిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి పదివేల రూపాయల నగదు స్వాధీన పర్చుకున్నారు. నాదెండ్ల మండలం గణపవరంలో ఇదే తరహాలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు పోస్టల్‌బ్యాలెట్లు పొందుతున్నవారిని ప్రలోభపెట్టేందుకు యత్నిస్తుండగా నియోజకవర్గ ఎన్నికల అధికారి, డీఆర్‌డీఏ ప్రాజెక్టు అధికారి ప్రశాంతి జోక్యంతో వారిని నిరోధించగలిగారు. ఇక రేపల్లెలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనగాని సోదరుడైన ఓ ఉపాధ్యాయుడు రేపల్లెలో పబ్లిక్‌గా నిధులు అందజేసేందుకు యత్నిస్తూ నిఘా కెమెరాకు చిక్కారు. ఎంపీ అభ్యర్ధిగా పోటీలో ఉన్న ఓ నాయకుడు ఏకంగా ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలకు ఇన్వర్టర్లను బహుమతిగా పంపుతున్నారు. గెట్ టు గెదర్ పేరుతో వేలాది మందితో ఏసీ కల్యాణ మండపాల్లో విందు రాజకీయాలు చేస్తున్నారు. సోమవారం స్ధానిక విద్యానగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో కార్యకర్తలకు పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం అరండల్‌పేటలోని ఓ హాటల్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెద్ద ఎత్తున విందు కార్యక్రమం నిర్వహించారు.
దిగువస్థాయి నాయకులకూ నగదు ఎర
డబ్బుకు ఆశపడే ప్రత్యర్థి పార్టీలకు చెందిన గ్రామ సర్పంచ్‌లు, సహకార సంఘాల అధ్యక్షులను డబ్బుతో కొనుగోలు చేస్తున్నారు. కార్యకర్తలను మద్యం మత్తులో ముంచేస్తున్నారు. సత్తెనపల్లి, నరసరావుపేట, పొన్నూరు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీడీపీ విజయానికి ఎన్‌ఆర్‌ఐలను రంగంలోకి దించింది. కొంతమంది ఎన్‌ఆర్‌ఐలు గ్రామాల్ని దత్తత తీసుకుని ఆ గ్రామాల్లో టీడీపీకి మెజార్టీ ఓట్లు తీసుకువచ్చేందుకు కోట్లు కుమ్మరిస్తున్నారు. ఎన్నికల తరువాత గ్రామంలోని సమస్యలు పరిష్కరిస్తామని పెద్దమనుషుల సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. మసీదులు, చర్చిలు, దేవాలయాల మరమ్మతులు, శ్మశాన వాటికలకు భూమిని కొనుగోలు చేసేందుకు నగదు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదే అదనుగా మ్యాచ్‌ఫిక్సింగ్‌లు.. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఓటమే లక్ష్యంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. జిల్లాలోని కొన్ని నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఓట్లనే చీల్చేందుకు కాంగ్రెస్ అభ్యర్థులకు టీడీపీ ఆర్థిక సహాయం అందజేస్తోంది. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని రెండు నియోజకవర్గాల్లో తాము ఓడిపోతామనే కారణం చూపి కాాంగ్రెస్ అభ్యర్థులు పెద్దగా ప్రచారం సైతం చేపట్టలేదు. ఆయా నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల వారీగా ఓట్లను చీల్చే అవకాశం ఉందన్న అంశాన్ని గుర్తించిన టీడీపీ నాయకులు వారిని కలిసి రూ. 1.50 కోట్ల వరకు నజరానాలు అందిస్తున్నారని తెలిసింది. ప్రజాలం, ప్రజల ఆశీస్సులు నిజంగా వీరికి ఉంటే ఇన్ని కుట్రలు, కుతంత్రాలు చేయాల్సిన అవసరం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.