కాంగ్రెస్ ఉనికికే ఎసరు!
- రాష్ర్ట విభజన ఎఫెక్ట్..
- 146 స్థానాల్లో పోటీ.. గెలిచింది 4 వార్డుల్లోనే
సాక్షి, అనంతపురం : రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీపై పట్టణ ప్రజలు ఓటు ద్వారా తమ కసి తీర్చుకున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఘోర ఓటమి చవిచూశారు. జిల్లాలో ఒక నగరపాలక సంస్థ, 11 మునిసిపాలిటీల పరిధిలో కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలు 373 ఉన్నాయి. ఇందులో 146 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పోటీ చేసింది. నాలుగు స్థానాల్లో మాత్రమే గెలవగలిగింది. 142 స్థానాల్లో కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది.
సింగిల్ డిజిట్ ఓట్లకే పరిమితమైన వారు ఆ పార్టీ అభ్యర్థుల్లో వందమందికి పైబడి ఉండటం చర్చనీయాంశమైంది. ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సొంత నియోజకవర్గమైన మడకశిర మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను రెండు వార్డుల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. పుట్టపర్తి, కళ్యాణదుర్గం మున్సిపాలిటీల్లో ఒక్కొక్క స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
అనంతపురం నగరపాలక సంస్థతో పాటు రాయదుర్గం, కదిరి, తాడిపత్రి, ధర్మవరం, గుంతకల్లు, గుత్తి, పామిడి, హిందూపురం మున్సిపాలిటీల్లో ఒక్క వార్డులో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలవలేకపోయారు. పూర్వ వైభవం తెస్తానన్న రఘువీరారెడ్డికి ఈ ఎన్నికల్లో చుక్కెదురైంది. కమ్యూనిస్టు పార్టీలకు వచ్చిన స్థానాలు ూడా కాంగ్రెస్‌కు దక్కక పోవడంతో ఆ పార్టీ నాయకులు అంతర్మథనంలో పడ్డారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద ఒక్క కార్యకర్త కూడా కనిపించలేదు.
పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సొంతంగా చేయించిన సర్వేలో కాంగ్రెస్‌కు అనుకూలంగా పరిస్థితి కనిపించకపోవడంతో ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయడానికి వెనుకంజవేసినట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల్లో బోణీ కొట్టాలనుకున్న పెనుకొండ నియోజకవర్గంలో కూడా మూడవ స్థానంలో వుండే పరిస్థితి కన్పిస్తోంది. మునిసిపల్ ఎన్నికల్లో ఇంతటి ఘోరమైన ఫలితాలు వస్తాయని ఊహించలేకపోయామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.