అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమి తప్పదు
పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స
సాక్షి, హైదరాబాద్: ‘‘మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఓడిపోయాం. సీమాంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు. ఈ విషయాన్ని బహిరంగంగానే ఒప్పుకుంటున్నాం’’ అని పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెస్ ఓటమిని చవిచూడాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన పొరపాట్లకు నేడు సమష్టిగా బాధ్యత వహించాల్సి ఉందన్నారు. కొన్ని పార్టీలు విభజన నెపాన్ని కాంగ్రెస్‌పై నెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. సీమాంధ్రలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అది తన మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను వంద రోజుల్లో అమలు పర్చాలని బొత్స డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా టీడీపీ చేసిన ఎన్నికల వాగ్దానాలను ప్రస్తావించిన బొత్స ‘అవన్నీ జరిగేవేనా?’ అన్న అనుమానం వ్యక్తం చేశారు.