సీమాంధ్రలో ‘హస్త’ వ్యస్తం
* పురపోరులో 2 డివిజన్లు, 52 వార్డులతో సరి
* అనేక చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు కకావికలం
* కాంగ్రెస్ సభ్యులకన్నా స్వతంత్రులే అధికం
* ముఖ్యనేతల ఇలాకాల్లోనూ ఘోరపరాభవం
* పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఒక్క మునిసిపల్ వార్డూ కూడా దక్కని వైనం
* మరో నాలుగు జిల్లాల్లో ఉనికికే పరిమితం
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలైంది. రాష్ట్ర విభజనకు ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. అనేక జిల్లాల్లో అసలు ఒక్క మునిసిపాలిటీనీ గెలుచుకోలేకపోగా.. పార్టీ ముఖ్యనేతల ఇలాకాల్లోనూ ప్రజాగ్రహంతో మట్టికరిచింది. సీమాంధ్రలోని 92 మునిసిపాలి టీల్లో 2,571 వార్డులకు గానూ ఆ పార్టీకి కేవలం 52 వార్డులు మాత్రమే అంటే రెండు శాతం మాత్రమే దక్కాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకన్నా స్వతంత్రంగా పోటీచేసిన అభ్యర్థులే రెట్టింపు సంఖ్యలో 110 మంది విజయం సాధించడం గమనార్హం. అసలు.. 22 మునిసిపాలిటీల్లో మాత్రమే కాంగ్రెస్ ఖాతా తెరవగా తక్కిన వాటిలో ఉనికి కూడా లేకుండాపోయింది. ఇక ఏడు మునిసిపల్ కార్పొరేషన్లలో నెల్లూరు, రాజమండ్రిలలో ఒక్కో డివిజన్‌ను ఆ పార్టీ స్వల్ప ఓట్ల తేడాతో గెల్చుకోగలిగింది.
- పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో కాంగ్రెస్‌కు ఒక్కటంటే ఒక్క వార్డు కూడా దక్కలేదు.
- కృష్ణా, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్క మునిసిపాలిటీలో కాంగ్రెస్‌కు ఒకటీ, అరా మాత్రమే వార్డులు దక్కాయి.
- ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కల్యాణదుర్గంలో కాంగ్రెస్‌కు ఒక్క వార్డే వచ్చింది. ప్రస్తుతం ఆయన పోటీచేస్తున్న మడకశిర నియోజకవర్గం పరిధిలోని మడకశిర నగర పంచాయతీలో కూడా ఆ పార్టీకి దక్కింది ఒకే ఒక ్క వార్డు.
- పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ సొంత జిల్లాలోనూ.. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాల్టీల్లోని 129 వార్డుల్లో కాంగ్రెస్‌కు కేవలం 10వార్డులు మాత్రమే వచ్చాయి.
- తూర్పుగోదావరిలో 10మునిసిపాలిటీలు ఉం డగా కాంగ్రెస్ కేవలం రెండింటిలో మాత్రమే ఖాతా తెరిచింది. జిల్లాలో మొత్తం 264 వార్డుల్లో ఆ పార్టీ కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది.
- కృష్ణా జిల్లాలోని 8 మునిసిపాలిటీలకు గాను మచిలీపట్నంలో ఒకే ఒక్క వార్డును కాంగ్రెస్ గెలుచుకోగలిగింది.
- కన్నా లక్ష్మీనారాయణ సొంత జిల్లా గుంటూరు జిల్లాలో 371 వార్డుల్లో 11 చోట్ల మాత్రమే గెలించింది.
- మరో సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి సొంత జిల్లా పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు ఉండగా.. ఆత్మకూరులో 8 వార్డులు దక్కించుకున్నా తక్కిన చోట ఒకటీ అరా మాత్రమే కాంగ్రెస్ ఖాతాలో చేరాయి.
- మాజీ సీఎం కిరణ్ సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో ఆరు మునిసిపాలిటీల్లో కేవలం కాళహస్తిలో మాత్రమే కాంగ్రెస్ ఉనికి కనిపించింది.
- వైఎస్సార్ జిల్లాలోని ఏడు మునిసిపాలిటీల్లో బద్వేలులో ఒకే ఒక్క వార్డు ఆ పార్టీ ఖాతాలో పడింది.
- కర్నూలు జిల్లాలో 8 మునిసిపాలిటీల్లో ఒక్క గూడూరు మునిసిపాలిటీలో కేవలం రెండు వార్డుల్లో మాత్రమే కాంగ్రెస్ గట్టెక్కింది.