మున్సిపోల్స్‌కు ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగిసింది. చివరిరోజున వేలాదిమంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బరిలో మిగిలిన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయించారు. అరుుతే 146 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు గాను మొత్తం ఎంతమంది అభ్యర్థులు రంగంలో ఉన్నారో పూర్తి వివరాలు మంగళవారం అర్ధరాత్రి వరకు అందలేదు.
అందిన సమాచారం మేరకు కరీంనగర్ కార్పొరేషన్‌లో 50 డివిజన్లకు గాను 376 మంది, రాజమండ్రి 50-278, ఏలూరు 50-174, కడప 50-311, అనంతపురం 50-222, చిత్తూరు 50-209 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 114 మునిసిపాలిటీలకు సంబంధించిన 3,089 వార్డులకు 12,840 మంది పోటీలో ఉన్నట్టు సమాచారం. ఇలావుండగా.. ఇప్పటికే ఇటు మునిసిపల్ అటు సాధారణ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్న పార్టీలు బుధవారం నుంచి ప్రచార జోరు పెంచనున్నారుు.
సీమాంధ్ర ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ నాయకురాలు షర్మిల వేర్వేరుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. కాగా సీమాంధ్రలోని కొన్ని మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ తరఫున అసలు నామినేషన్లే దాఖలు కాకపోవడం గమనార్హం. మరికొన్ని మునిసిపాలిటీల్లో ఒకటీ రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. సీమాంధ్రలో ప్రధానంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యనే పోటీ నెలకొంది. ఇక తెలంగాణలో చాలాచోట్ల కాంగ్రెస్, టీఆర్‌ఎస్, తెలుగుదేశం, బీజేపీ ప్రధానంగా పోటీ పడనున్నాయి.
ఇక ప్రచార హోరు!
Published Wed, Mar 19 2014 4:01 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement